కంప్యూటర్ చిట్కాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కంప్యూటర్ చిట్కాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఎటువంటి సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే అన్ని అప్లికేషన్‌లలో తెలుగు టైప్‌ చేసుకోవడానికి

సాధారణంగా కంప్యూటర్లలో తెలుగు టైప్ చేయడానికి అధనంగా సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. ఎటువంటి సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే అన్ని అప్లికేషన్‌లలో తెలుగు టైప్‌ చేసుకోవడానికి సెట్టింగులను ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూడవచ్చు.

కంప్యూటరు కొనాలనుకుంటున్నారా? తప్పని సరిగా మీకోసమే.

సాధారణంగా ఇప్పటికి కూడా ఎక్కువగా కంప్యూటరు కొనాలనుకునే వారు అసెంబుల్డ్ కంప్యూటరు వైపే మొగ్గు చూపిస్తున్నారు. దానికి కారణం మన అవసరాలను తీర్చగల కంప్యూటరును మనకు వీలయిన ధరలోనే పొందగలిగే అవకాశం ఉంటుంది కనుక. అయితే అసెంబుల్డ్ కంప్యూటరు కొనేవారు మొదట కంప్యూటరు గురించి తెలిసినవారి దగ్గర కాని లేదా కంప్యూటరు కొట్టు వాడి దగ్గరకాని కాన్‌ఫిగరేషన్ తీసుకొని నాలుదైదు కొట్లు తిరిగి ధరను పోల్చుకొని

మీ కంప్యూటరులో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టంలు వాడుతున్నారా?

  
  • విండోస్ యొక్క రిఈన్‌స్టాల్ డిస్క్ మరియు ఆపరేటింగ్ సిస్టం అలాగే మన ఫైళ్ళు బ్యాకప్ తీసుకున్న తరువాత మాత్రమే ప్రయత్నించవలసి ఉంటుంది. 
  • విండోస్ లో ఉండగా ఉబుంటు, ఉబుంటులో ఉండగా విండోస్ ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్ లను మనం తొలగించడం లేదా మార్చడంచేయకుడదు. దానివలన రెండు ఆపరేటింగ్ సిస్టంలు పనిచేయకుండా పోతాయి.  
  • విండోస్‌లో కనిపించని రికవరీ మరియు తయారీదారుకి సంభందించిన పార్టీషియన్‌లు ఉబుంటులో కనిపించినప్పటికి మనం వాటిలోని పైళ్ళను మార్చడం కాని డ్రైవ్ ని తొలగించడం కాని చేయరాదు. 
  • ఉచిత ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ముందే విండోస్ అప్‌డేట్లు అన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది.
  • ఒకొకసారి విండోస్ అప్‌డేట్ అయిన తరువాత ఉబుంటు అసలు కనిపించకుండా పోతుంది. అటువంటప్పుడు మనం ఉబుంటు లైవ్ డిస్క్ ని ఉపయోగించి మనం మునుపటిలా ఉబుంటు మరియు విండోస్ 8 డ్యూయల్ బూట్ అయ్యేవిధంగా చేసుకోవచ్చు.
  • పొరపాటు జరిగి రెండుఆపరేటింగ్ సిస్టంలు బూట్ కానప్పటికి కంగారుపడి తిరిగి ఇన్‌స్టాల్ చెయ్యకండి. రెండిటిని కూడా యధాస్థితిలో రికవరీ చేయ్యడానికి మనకి నెట్‌లో పలు ఉపాయాలు దొరుకుతాయి. 

మీ కొత్త లినొవొ లాప్‌టాప్‌లో ఇతర ఆపరేటింగ్ సిస్టంలు ఇన్‌స్టాల్ కావట్లేదా?

                    ఇప్పుడు కొత్తగా వస్తున్న లినొవొ లాప్‌టాప్‌లో మరొక ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేయడం వీలుకాకుండా ఉండడమే కాకుండా లైవ్‌ సిడి కూడా పనిచేయట్లేదు. అంతేకాకుండా సిస్టం ఆన్ చేయగానే నేరుగా విండోస్‌ లోకి వెళ్ళిపోతుంది. కనీసం బయోస్ సెట్టింగ్స్ లోకి వెళ్లడానికి మరియు బూట్ డివైజ్ ని ఎంచుకోవడానికి కూడా మనకి ఆప్షన్లు కనిపించవు. మరి అటువంటప్పుడు మనం ఏవిధంగా మనకు కావలసిన ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవాలి అదేవిధంగా విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలు కలిపి డ్యుయల్ బూట్‌గా ఎలా ఇంస్టాల్ చేసుకోవాలి. 
                
ఉబుంటు ఇన్‌స్టాల్ చేయబడిన లినొవొ లాప్‌టాప్
                   
                      మొదట మనం మన లాప్‌టాప్ బయోస్ సెటప్ లోకి వెళ్ళాలి. అది ఎలాగంటే లాప్‌టాప్ ని షట్‌డౌన్ చేసి తరువాత పవర్ బటన్ ప్రక్కన ఉన్న వన్ టచ్ రికవరీకీని పది సెకన్లు వత్తి పట్టుకొని వదిలివేయాలి.
                        
                     అప్పుడు మనకి తెరమీద క్రింది చిత్రంలో వలే బయోస్ సెటప్‌కి వెళ్ళడానికి మరియు బూట్‌ డివైజ్ ఎంచుకోవడానికి ఆప్షన్‌లు కనిపిస్తాయి.
                    
                                 ఇప్పుడు మనం బూట్ మెనూలోకి వెళ్ళి ఏదైనా లినక్స్ లైవ్ ఆపరేటింగ్ సిస్టం ప్రయత్నించడానికి ముందు బయోస్ సెటప్ లోనికి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ టాబ్‌లో ఉన్న సెక్యూర్‌బూట్ అన్న ఆప్షన్‌ని డిసేబుల్ చెయ్యలి. 

     
                 సెక్యూర్ బూట్ డిసేబుల్ చేసిన తరువాత మన కంప్యూటరులో వివిధ ఉచిత ఆపరేటింగ్ సిస్టముల లైవ్ డిస్కులు మామూలుగా ఎప్పటిలాగే పనిచేస్తాయి. కాని అన్ని ఆపరేటింగ్ సిస్టములు ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కుదరదు, కేవలం యుఇఐయఫ్ బూట్‌ని సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టంలు మాత్రమే ఇన్‌స్టాల్ అవుతాయి. ఉబుంటు 64 బిట్ వంటి కొన్ని ఆపరేటింగ్ సిస్టములు మాత్రం సెక్యూర్ బూట్ అనేబుల్ చేసి ఉన్నప్పటికి లైవ్ డిస్క్ పనిచేయడమే కాకుండా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. మనం ఉబుంటు 32 బిట్ మరియు మిగిలిన ఏదైనా ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే మనం తప్పనిసరిగా బయోస్ సెటప్ లో బూట్ టాబ్ లో ఉన్న యుఇఐయఫ్ బూట్‌ని లెగసిగా మార్చవలసి ఉంటుంది.
 
                            కానీ లెగసీ సపోర్ట్ అనేబుల్ చేసిఉన్నపుడు మిగిలిన అన్ని ఆపరేటింగ్ సిస్టంలు బాగానే పనిచేస్తున్నప్పటికి లినొవొ లాప్‌టాప్‌లో విండోస్ 8 బూటింగ్ సమస్య వస్తుంది కనుక ఉచిత ఆపరేటింగ్ సిస్టంతో పాటు విండోస్ 8 కూడా వాడుకోవాలనుకునేవారు తప్పని సరిగా యుఇఐయఫ్ బూట్‌ని సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టం అయిన ఉబుంటు64 బిట్ ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. మనం ఉబుంటు ఇన్‌స్టాల్ చేసిన తరువాత మనకి ఈవిధంగా కంప్యూటరు ఆన్ చేయగానే బూట్ మెను కనిపిస్తుంది. మనకు కావలసిన ఆపరేటింగ్ సిస్టంని ఎంచుకోవడం ద్యారా మనం ఉబుంటు లేదా విండోస్ లోకి బూట్ కావచ్చు. మన ఫైళ్ళని రెండు ఆపరేటింగ్ సిస్టంలలో నుండి వాడుకోవచ్చు.

మీరు కూడా సులభంగా కంప్యూటర్ ట్యుటోరియళ్ళు తయారుచేయవచ్చు

                 మనం సాధారణంగా కంప్యూటరు లేదా వివిధ సాఫ్ట్‌వేర్ల గురించి నెట్ లో అందుబాటులో ఉన్న ట్యుటోరియళ్ళను చూసి తెలుసుకుంటాము. మొదట్లో వివరణాత్మక వ్యాసాల రూపంలోను తరువాత చిత్రాలతొ కూడిన వ్యాసాల రూపంలోను ఈ ట్యుటోరియళ్ళు ఉండేవి. కొంతకాలంగా మనకి నెట్లో ఎక్కువగా వీడియో ట్యుటోరియళ్ళు అందుబాటులోకి వచ్చాయి. అవి వ్యాసరూపంలో ఉన్న వాటికన్నా ఎక్కువగా ఆదరణ పొందాయి దానికి కారణం అవి ఎటువంటి పరిజ్ఞానం లేనివారికి కూడా సులభంగా అర్ధం కావడమే. 
                     వీడియో ట్యుటోరియళ్ళు పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే ఎవరైనా సులభంగా తయారు చేయవచ్చు. మనం కంప్యూటర్లో చేస్తున్న పనిని రికార్డ్ చేస్తూ దానికి తగిన వాఖ్యానాన్ని జోడిస్తే చాలు వీడియో ట్యుటోరియల్ పూర్తి అయినట్లే. మన కంప్యూటరు తెరని చిత్రీకరిస్తూ మన మాటలను రికార్డు చేయడానికి మనకి అందుబాటులో ఉన్న ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ కామ్‌ స్టూడియో. ఉచితంగా లభించే ఈ సాఫ్ట్‌వేరు కంప్యూటరు నిపూణులకి, ఒత్సాహిక బ్లాగర్లకి, ఉపాధ్యాయులకి మరియు విద్యార్ధులకి ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. 


                        తక్కువ పరిమాణం కలిగి తక్కువ కంప్యూటరు వనరులని వాడుకుంటూ పనిచేసే కామ్‌ స్టూడియోని ఉపయోగించి విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న కంప్యూటర్లలో మనం వివిధ సాఫ్ట్‌వేర్, ఇంటర్ నెట్ మరియు కంప్యూటరు చిట్కాలను రికార్డ్ చేయవచ్చు. రికార్డ్ చేయబడిన వీడియోలు మంచి నాణ్యతతో కూడి ఉండడమే కాకుండా వీడియో షేరింగ్ సైట్లలో  అప్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా తక్కువ పరిమాణం తో ఉండడం కూడా దీని ప్రత్యేకత. అంతేకాకుండా తక్కువ పరిజ్ఞానం కలవారు వాడుకోవడానికి వీలుగా సరళంగా ఉంటూనే నిపూణులకి కోసం వివిధ ఆప్షన్‌లు దీని సొంతం.
 

కామ్‌స్టూడియోని క్రింది నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
                            http://camstudio.org/                                                                     

కరప్ట్ అయిన కంప్యూటరు నుండి డాటా బ్యాకప్ తీసుకోవడం,ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్ పరిమాణాన్ని తగ్గించడం ఎలా?

   ఇప్పుడు వస్తున్న కంప్యూటర్లలో హార్డ్‌డిస్క్ మొత్తం ఒకే డ్రైవ్‌గా ఉండి దానిలోనే ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. మనం మన డాటాని కూడా అందులోనే దాచుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఆపరేటింగ్ సిస్టం పనిచేయనపుడు తిరిగి ఇన్‌స్టాల్ చేయించుకోవడానికి వెళ్ళినపుడు డాటా తిరిగి రాదు లేదా డాటా బ్యాకప్ తీయడానికి మరికొంత డబ్బులవుతాయని షాపువాడు అడుగుతుంటాడు. ఇటువంటప్పుడు మనం సులభంగా షాపుకి తీసుకువెళ్ళకుండానే డాటా ఎలా బ్యాకప్ తీసుకోవాలో, అసలు ఈ సమస్య రాకుండా ముందుగానే ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్‌ని కుదించుకొని డాటా కోసం మరొక డ్రైవ్‌ని ఏర్పాటుచేసుకొని మనకు కావలసినపుడు మన డాటాకి హానికలగకుండా ఆపరేటింగ్ సిస్టం ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకొనే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు

  సాధారణంగా విండోస్‌తో వచ్చే కంప్యూటర్లలో మరొక ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చెయ్యడానికి చూసినపుడు డాటా మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం కోల్పోతున్నాము అని ఫిర్యాదు చేస్తూ ఉచిత ఆపరేటింగ్ సిస్టంలను నిందిస్తూ ఉంటారు. మనం ఇన్‌స్టాల్ చేసుకొనే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డాటా మరియు డబ్బులు పెట్టీ కొన్న ఆపరేటింగ్ సిస్టంని కోల్పోకుండా కాపాడుకోవచ్చు. తద్వారా ఇన్‌స్టాలేషన్ సమయంలో మనకి తెలియక ఏదైనా తప్పుగా చేసినప్పటికి మన డాటాని మరియు ఆపరేటింగ్ సిస్టంని ఎలా తిరిగి పొందాలో ఈ వీడియోలో చూడవచ్చు. 

మీ కొత్త కంప్యూటర్లో మీకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ అవ్వట్లేదా?

 కొత్తగా కొన్నటువంటి కంప్యూటరులో మనం మునుపటిలా మనకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చెయ్యడానికి ప్రయత్నించినపుడు ఇన్‌స్టాల్ కాకపోవడం ఈమధ్య సాధారణంగా జరుగుతుంది. అదేవిధంగా సీడీ, డీవీడీ మరియు పెన్‌డ్రైవ్‌ల నుండి నేరుగా లైవ్ ఆపరేటింగ్ సిస్టం వాడుకోవడం కూడా సాధ్యం కావడం లేదు. దీనికి కారణం కొత్తగా వస్తున్నటువంటి కంప్యూటర్లలో మనకు బయోస్ సెటప్ లోకి ప్రవేశించడానికి మరియు బూట్ డివైజ్ ని ఎంచుకోవడానికి ఎటువంటి ఆప్షనులు చూపించకుండా నేరుగా విండోస్ లోకి వెళ్ళిపోతు ఉండడం కారణం. మనం వేరే ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవడానికి లేదా లైవ్ ఆపరేటింగ్ సిస్టం వాడుకోవడానికి అడ్డుగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

ఫ్లాష్‌ప్లేయర్ లేకుండానే యుట్యూబ్ వీడియోలు చూడడం ఎలా?

 సాధారణంగా మనం యుట్యూబ్ వీడియోలు చూడడానికి ఫ్లాష్‌ప్లేయర్లను ఇన్‌స్టాల్ చేసుకుంటాము. ఇప్పుడు ప్లాష్‌ప్లేయర్ లేదా ఎటువంటి బ్రౌజర్ ప్లగిన్‌లు ఇన్‌స్టాల్ చేయనక్కరలేకుండానే యుట్యూబ్ వీడియోలను చూసెయ్యవచ్చు. అదెలాగో ఈ వీడియోలో చూడవచ్చు.

సపోర్ట్ నిలిపి వేయబడిన పాత కంప్యూటర్లకు జీవం పొయ్యండిలా

   మనం ఇప్పుడు వాడుతున్న పాత కంప్యూటర్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ నిలిపివేయడం వలన ఇక పై ఆ ఆపరేటింగ్ సిస్టంకు సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు కనుక ప్రత్యామ్నాయాల కోసం చూడవలసిన అవసరం ఏర్పడింది. మనం డబ్బులు పెట్టి కొత్త ఆపరేటింగ్ సిస్టం కొన్నప్పటికి అది మన పాత కంప్యూటర్ యొక్క సామర్ధ్యం తక్కువగా ఉండడం వలన దానిలో పని చేయకపోవచ్చు. అందువలన మనం తప్పనిసరిగా మన కంప్యూటరు యొక్క సామర్ధ్యాన్ని విడిబాగాలను మార్చుకోవడం లేదా రామ్‌ వంటి విడిబాగాలను అధనంగా చేర్చడం ద్వారా పెంచుకోవలసి రావచ్చు. వీలుకాని పరిస్థితులలో పూర్తిగా కంప్యూటరుని మార్చవలసి రావడం కూడా జరుగుతుంది. దీనికి కారణం ఆపరేటింగ్ సిస్టం తయారీదారు మరియు కంప్యూటర్ల తయారీదారులు కలిసి టెక్నాలజీ మెరుగుదల పేరుతో కొంతకాలానికి కంప్యూటర్లు మార్చడాన్ని తప్పనిసరి అవసరంగా తయారుచేయడం. దానివలన మనకి ఏవో కొన్ని ప్రయోజనాలున్నప్పటికిని ఆర్ధికంగా (కంప్యూటర్లను మరియు ఆపరేటింగ్ సిస్టం మార్చడానికి పెట్టుబడి) మరియు పర్యావరణపరంగా చాలా (కంప్యూటర్ వ్యర్ధాలు పర్యావరణానికి అతి పెద్ద ముప్పుగా పరిణమించ బోవడం) నష్టదాయకం.
   మన పాత కంప్యూటరును మార్చకుండానే సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించబడే ఆపరేటింగ్ సిస్టం మనకు అందుబాటులో ఉంటే దానికి పరిష్కారం దొరికినట్లే. అదీ ఉచితంగా దొరికితే ఇంకా బాగుంటుంది కదా. అవే ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలు. ఇవి లాభాపేక్షలేని కొన్ని సంస్థలచే మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లచే స్వచ్చందంగా అభివృద్ది చేయబడుతున్నాయి. పాత కంప్యూటర్లలో పనిచేయడానికి మనకు చాలా ఆపరేటింగ్ సిస్టంలు ఇప్పుడు మనకు ఇంటర్‌నెట్‌ లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది నిరంతరం కొత్త పీచర్లతో అప్‌డేట్ అవుతూ, మనం చూడడానికి ఇప్పుడు వాడే ఆపరేటింగ్ సిస్టం లానే ఉండే లుబుంటు.
    ఇది తక్కువ సామర్ధ్యం గల పాత డెస్క్‌టాప్, లాప్‌టాప్ మరియు మాక్ కంప్యూటర్లలో పనిచేయడానికి అనుగుణంగా వేగంగా, తేలికగా ఉండేటట్లు తయారుచేయబడింది. పెన్‌టియం 2, సెల్‌రాన్ వంటి పాత ప్రాససర్లతో ఉన్నటు వంటి కంప్యూటర్లలో కూడా పనిచేస్తుంది. తక్కువ వనరులని వాడుకొని వేగంగా పనిచేయడం దీని ప్రత్యేకత. అదే విధంగా కొత్త కంప్యూటర్ల కోసం 64బిట్ వెర్షను కూడా అందుబాటులో ఉంది. లుబుంటు ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇక్కడ నుండి దింపుకోవచ్చు. దీనిని పెద్దగా పరిజ్ఞానం లేనివారు కూడా సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బాగా పాత సిస్టంలలో సీడీ ద్వారా లాప్‌టాప్‌లు కొత్త కంప్యూటర్లలో పెన్‌డ్రైవ్ ద్వారాను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
లుబుంటు 14.04 డెస్క్‌టాప్

ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాలేషన్ డిస్క్ తయారుచేయడం ఎలా?

 ఇంటర్‌నెట్ లో ఉచితంగా లభించే ఆపరేటింగ్ సిస్టం యొక్క ఇమేజి ఫైల్ ని డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత దాన్ని సిడీ లేదా డివిడీ మరియు పెన్ డ్రైవ్ ఉపయోగించి ఇన్‌స్టాలేషన్ డిస్క్ తయారుచేయడం ఎలాగో ఈ వీడియోలో చూడవచ్చు.

పాత కంప్యూటరు హార్డ్‌డిస్కును ఇలా సద్వినియోగించుకోండి

 మన వద్దనున్న పాత డెస్క్‌టాప్ కంప్యూటర్ లేదా లాప్‌టాప్ యొక్క హార్డ్‌డిస్క్‌ను ఎలా ఎటువంటి నైపుణ్యం లేకుండానే సులువుగా తక్కువ ఖర్చుతో పెన్‌డ్రైవ్ మరియు ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్ లా వాడుకోవడానికి అనువుగా మార్చుకొని ఎలా సద్వినియోగపరుచు కోవచ్చునో ఈ వీడియోలో చూడవచ్చును. ఈ పద్దతి ద్వారా పాక్షికంగా పాడయిపోయిన అంటే మన కంప్యూటరు గుర్తించని, ఒకవేళ గుర్తించినప్పటికి ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసేటప్పుడు సమస్యలు వచ్చేటువంటి కొన్ని హార్డ్‌డిస్కులు కూడా ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్కుగా బ్రహ్మాండంగా పనిచేయడం విశేషం. ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర పనిచేయని హార్డ్‌డిస్కులని ఈ వీడియోలో చూపించినట్లు పరిక్షించుకోండి.

మీ కంప్యూటర్‌కి సౌండ్ డ్రైవర్లు దొరక్కపోతే

  ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆపరేటింగ్ సిస్టములకి మీ కంప్యూటరు యొక్క సౌండ్ డివైజ్ పనిచేయకపోతే లేదా వాటికి సంబందించిన ఆడియో డ్రైవర్లు దొరక్కపోతే మొదట క్రింది లంకెలో చెప్పిన విధంగా డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ పయత్నించండి.

http://spveerapaneni.blogspot.in/2013/09/blog-post_7.html

అయినప్పటికి  సౌండ్ డ్రైవర్లు దొరక్కపోతే అందుబాటులో ఉన్న మిగతా ప్రత్యామ్నాయాలను ఈవీడియోలో చూడవచ్చు.

బ్రాడ్‌బ్యాండ్ కేబుల్‌ని ఉపయోగించి ఇంటర్ నెట్ ని టాబ్లెట్లలో వాడుకోవడానికి

 మనం టాబ్లెట్లలో ఇంటర్ నెట్ వాడుకోవడానికి సాధారణంగా వైఫి సదుపాయాన్ని ఉపయోగిస్తుంటాము. సిమ్‌కార్డ్ సదుపాయం ఉన్న టాబ్లెట్లలో అయితే 2జి లేదా 3జి సేవలని ఉపయోగించి ఇంటర్‌నెట్ కి అనుసంధానమవుతుంటాము. సాధారణ ఇంటర్‌నెట్ తో పోల్చితే సెల్యులార్ డాటా పధకాలు ఖరీదు ఎక్కువ కావడం మరియు మన దగ్గర వైఫి రూటర్ అందుబాటులో లేనపుడు మనం ప్రత్యామ్నాయంగా మన కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్ ని మన టాబ్లెట్లలో ఎలా పొందాలో ఈవీడియోలో చూడవచ్చు.

కంప్యూటర్ నెట్ పోర్ట్ పనిచేయడంలేదా?

 మన కంప్యూటర్ ని ఇంటర్ నెట్ ప్రపంచంతో అనుసంధానించే నెట్ పోర్ట్ పని చేయకపోతే మనం పిసిఐ నెట్ కార్డులను వాడుతుంటాము. మన ఆపరేటింగ్ సిస్టలో పనిచేసే నెట్ కార్డు మనకి దొరకనపుడు, లాప్‌టాప్ నెట్ పోర్ట్ చెడిపోయినపుడు లేదా మన కంప్యూటర్‌ యొక్క మధర్‌బోర్డ్ లో పిసిఐ స్లాట్‌లు అందుబాటులో లేనపుడు ఈ పిసిఐ కార్డులు మనకి ఉపయోగపడవు. ఈ పిసిఐ నెట్ కార్డులకి చవకైన,సులభమైన ప్రత్యామ్నాయాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఎటువంటి కంప్యూటరు పరిజ్ఞానం లేనివారుకూడా వాడుకోవచ్చు.
   

సిపియు డబ్బాలో ఉండే భాగాలు

 కంప్యూటరు లో అతి ముఖ్యమైన భాగం సిపియుగా మనం పిలుచుకొనే రేకు డబ్బా. దీనిని కాబినెట్ అంటారు. ఇది రేకు డబ్బా అయినప్పటికీ దీనిలో మన కంప్యూటరు పనిచేయడానికి కావలసిన అన్ని పరికరాలు అమర్చబడి ఉంటాయి కనుక అది అతిముఖ్యమైనది, ఖరీధైనది. అందువలన దీని గురించి తెలుసుకోవడం తప్పనిసరి. మనం సిపియుని అప్పుడప్పుడు శుభ్రం చేయడానికి సిపియు డబ్బాకి ఒక వైపు ఉన్న రేకుని తొలగించినపుడు క్రింది చిత్రంలో వలే కనిపిస్తుంది. మొదటిసారి చూసేవారికి కొంత కొత్తగా అనిపించినప్పటికి ఒకటి రెండు సార్లు చూస్తే మనమే మన సిపియు డబ్బాని విప్పి శుభ్రం చేసుకోవచ్చు.

కంప్యూటరు సిపియు లోపలి బాగాలు

 మధర్ బోర్డ్:

మన సిపియు లో ఉన్న పెద్దబాగం మధర్ బోర్డ్ లేదా మెయిన్ బోర్డ్. కంప్యూటరులో ఉన్న అన్ని పరికరాలు (కొన్ని నేరుగా కొన్ని కేబుళ్ళ ద్వారా)దీనికి కలుపబడి ఉంటాయి.

యస్‌యమ్‌పియస్:

ఇది కంప్యూటరులోని అన్ని బాగాలకు కరెంటును సరఫరా చేస్తుంది. దీనిని నుండి వచ్చిన వివిధ రకాల కేబుళ్ళు వివిధ కంప్యూటరు భాగాలకు కలుపబడి ఉంటాయి.

హార్డ్‌డిస్క్:

మన సమాచారం ఫైళ్ళ రూపంలో దీనిలో బధ్రపరచబడి ఉంటుంది. దీనికి యస్‌యమ్‌పియస్ నుండి ఒక పవర్ కేబుల్ దీనినుండి మధర్ బోర్డుకు ఒక డాటా కేబుల్ కలుపబడి ఉంటాయి. మన కంప్యూటరులో మధర్ బోర్డులో ఉన్న పోర్టులను బట్టి మరిన్ని హార్డ్‌డిస్క్‌లు పెట్టుకోవడానికి కాబినెట్‌లో స్థలం ఉంటుంది.

సిపియు ఫ్యాన్:

మధర్‌బోర్డులో ప్రాససర్ పైన ఇది అమర్చబడి ఉంటుంది. ప్రాససర్ వేడెక్కకుండా చూడడం దీని పని. ఎక్కువగా దుమ్ము దీనికే పడుతుంది.

డివిడీడ్రైవ్:

డివిడీ/సీడీ లు చదవడానికి, వ్రాయడానికి ఉపయోగపడుతుంది. దీనికి యస్‌యమ్‌పియస్ నుండి ఒక పవర్ కేబుల్ దీనినుండి మధర్ బోర్డుకు ఒక డాటా కేబుల్ కలుపబడి ఉంటాయి. మన కంప్యూటరులో మధర్ బోర్డులో ఉన్న పోర్టులను బట్టి మరిన్ని డివీడీ డ్రైవ్‌లు పెట్టుకోవడానికి కాబినెట్‌లో స్థలం ఉంటుంది.


రామ్‌:

మధర్ బోర్డులో సాధారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ రామ్‌ పెట్టుకోవడానికి కావలసిన స్లాటులు ఉంటాయి. ఎక్కువగా కంప్యూటర్ల సమస్యలు ఈ రామ్‌ వలన వస్తుంటాయి. చాలాసార్లు రామ్‌ తీసి వేరొక స్లాట్ లో పెట్టడం వలన కాని ఒకటి కంటే ఎక్కువ రామ్‌లు ఉన్నపుడు ఒకటి తీసివేయడం వలన సమస్య పరిష్కారం అవుతుంది.

ఆరోగ్యవంతమైన కంప్యూటర్‌కి ఐదు సూత్రాలు

 మన కంప్యూటరు మన జేబుకి చిల్లు పెట్టకుండా ఉండాలంటే మనం కంప్యూటర్‌పై గడిపే సమయంలో కొంత సమయం అప్పుడప్పుడు కేటాయిస్తే మన కంప్యూటర్ ఆరోగ్యకరంగా సమస్యలు లేకుండా ఉంటుంది. దాని ఫలితంగా మనం సమయాన్ని మరియు డబ్బుని ఆధా చేసుకోవచ్చు.  కంప్యూటర్ కి ప్రధాన శత్రువులు అయిన వాటిపై మనం జాగ్రత్తగా ఉంటే మన కంప్యూటర్ జీవితకాలాన్ని పెంచుకోవడమే కాకుండా తరచు చదివింపులనుండి తప్పించుకోవచ్చు. చాలా రోగాల విషయంలో చెప్పినట్టు చికిత్స కన్నా నివారణ మేలు అని కంప్యూటరు విషయంలో కూడా దీనిని వర్తించుకోవచ్చు. సమస్య వచ్చాకా దాన్ని బాగు చేసుకొనేకన్నా రాకముందే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకొంటే మన కంప్యూటరుని మంచి కండీషన్‌లో ఉంచుకోవచ్చు. క్రింద చెప్పిన ఐదు విషయాలు మనం పాటిస్తే కంప్యూటరు సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

శుభ్రంగా ఉంచుకోవడం: 

కంప్యూటరుకు దుమ్ము ప్రధాన శత్రువుల్లో ఒకటి దుమ్ము. ఇది మన కంప్యూటరులో చేరి పనితీరును దెబ్బతీయడమే కాకుండా కంప్యూటరు చల్లబరచడానికి గల ఫ్యాన్‌లపై చేరి మిగిలిన అన్ని బాగాలను వేడెక్కేటట్లు చేస్తుంది. మన కంప్యూటర్ ని అప్పుడప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి లేదా కనీసం కంప్యూటరు నుండి శబ్ధం వచ్చినపుడు అయినా తప్పక శుభ్రంచేయాలి.

వేడెక్కకుండా ఉంచుకోవాలి:

కంప్యూటర్ సిపియు అన్నిటికన్నా ప్రధానమైనది అయినప్పటికి దానిని ఎక్కడో ఏదో ఒక మూలలో ఉంచడం మనం సాధారణంగా చూస్తుంటాము. సిపియుని సరిగా గాలి తగిలే, ఎండ తగలని, తడిలేని  స్థలంలో ఉంచుకోవాలి. సిపియు ఫ్యాన్‌లు అన్న వైపు అడ్డంకులు ఉంచగూడదు. కొన్ని రోజులకి ప్రాససర్ ఫ్యాన్ క్రింద ఉన్న పేస్ట్ ఆరిపోతుంది కనుక అప్పుడప్పుడు దాన్ని చూసి లేకపోతే కొత్త పేస్టు పెట్టుకోవాలి. అలాగే కంప్యూటరు శుభ్ర పరిచినప్పుడు ఎక్కువగా దుమ్ము ఉండే ప్రదేశంగా మనం సిపియు ఫ్యాన్ ని గుర్తించవచ్చు. అందువలన సిపియు ఫ్యాన్ని కూడా తప్పకుండా శుభ్రపరుచుకోవాలి.

కరెంటు :

కంప్యూటరుకు మరో ప్రధాన శత్రువు తరచు కరెంటు పోవడం. ఇది మన చేతుల్లో లేనప్పటికి యూపియస్ వాడడం ద్వారా మనం దీనిని అరికట్టవచ్చు. మనం కంప్యూటర్లో ఏదైనా ఏదైనా పనిచేస్తున్నప్పుడు కరెంటు పోవడం వలన ర్యామ్‌, హార్డ్ డిస్క్ వంటివి చెడిపోతుంటాయి. సాధారణంగా కంప్యూటర్లో ఏదైనా విడిభాగం చెడిపోతే అది కచ్చితంగా కరెంటు పోయినప్పుడూ కాని, కరెంటు వస్తూపోతూఉన్నపుడు ఓల్టేజి హెచ్చుతగ్గుల వలన కాని జరుగుతుంటుంది. అందువలన కరెంటు వస్తూపోతూ ఉన్నపుడు కంప్యూటరును ఆన్ చెయ్యకపోవడమే మంచిది. ఎర్తింగ్ కూడా తప్పకుండా ఉండేటట్లు చూసుకోవాలి. యూపియస్ తప్పకుండా వాడడం వలన కరెంటు ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చు. కంప్యూటరు అకస్మాత్తుగా మనం ఆపకుండా ఆగిపోవడాన్ని నివారిస్తే హార్డ్‌డిస్క్ బ్యాడ్ సెక్టార్లు రావడం, ఆపరేటింగ్ సిస్టం కరెప్టెడ్, ఫైల్ మిస్సింగ్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

వైరస్:

తరచు కంప్యూటర్లు బాగుచేయించడానికి వచ్చే వాటిలో ఎక్కువ గా వైరస్ సమస్యలతో వస్తుంటాయి. మొత్తంగా వాటిని వైరస్‌లు అని మనం పిలుచుకున్నప్పటికి వాటిలో మాల్‌వేర్లు, ట్రోజాన్, స్పైవేర్లు అని చాలా‌రకాలు సిస్టంకి హాని కలిగించే సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి. ఈ వైరస్‌ల వలన ఆపరేటింగ్ సిస్టం చెడిపోవడంకాని సిస్టం నెమ్మదిగా పనిచేయడం గాని జరుగుతుంది. వైరస్ అన్నది మన కంప్యూటరికి నెట్ నుండి గాని పెన్‌డ్రైన్ వలన గాని వస్తుంది. కనుక ఒక మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని తరచు దానితో మన సిస్టంని స్కాన్ చేసుకోవాలి. అన్నట్టు యాంటీ వైరస్ ని ఎల్లపుడు అప్‌డేట్‌గా ఉంచుకోవాలి ఎందుకంటే యాంటీవైరస్‌కి వైరస్‌లను గుర్తుపట్టి వాటిని నిర్వీర్యం చేసే శక్తి అప్‌డేట్ల ద్వారానే అందుతుంది. సిస్టంకి పెన్‌డ్రైవ్ తగిలించినపుడు ముందుగా దాన్ని యాంటీవైరస్‌తో స్కాన్ చేసిన తరువాతనే తెరవాలి. అంతేకాకుండా అడ్డమైన సైట్స్‌ని తెరవకుండా ఉండడం కూడా నెట్ నుండి వైరస్‌లు రాకుండా ఉండడానికి చక్కని పరిష్కారం.

అప్‌డేట్:

ఆపరేటింగ్ సిస్టం లో ఉన్న బధ్రతా పరమైన లోపాలను సవరించడానికి తయారీదారు సమస్యని గుర్తించినపుడు ఆసమస్యకి సంబంధించిన పరిష్కారాన్ని అప్‌డేట్స్‌ రూపంలో విడుదల చేస్తుంటారు. కనుక మనం వాడే ఆపరేటింగ్ సిస్టం,డ్రైవర్ల  మరియు సాఫ్ట్‌వేర్ల అప్‌డేట్స్ ని తప్పకుండా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మనం చేయవలసిందల్లా అప్‌డేట్స్ అందుబాటులో ఉన్నాయి ఇన్‌స్టాల్ చెయ్యాలా అని అడిగినప్పుడు ఒకే అని నొక్కడమే.

కంప్యూటర్ ఉంటే ఇవి తప్పనిసరి

 ఈ రోజుల్లో కంప్యూటర్ లేని వారు చాలా అరుదు. చాలా వరకు అందరి ఇళ్ళలో, చిన్న పెద్దా దుకాణాలలో, పాఠశాలలలో ఇలా అన్ని చోట్లా కంప్యూటరు పాగా వేసింది. ఇంత ప్రాచుర్యం పొందినప్పటికి ఇప్పటికి చాలా మంది కంప్యూటరు తో ఉండవలసిన అత్యవసర సామాగ్రి మాత్రం కలిగి ఉండడం లేదు. ఈ సామాగ్రి ఉంటే మనమే చాలా వరకు సమస్యలను అధిగమించవచ్చు లేదా సమస్య ఏమిటో తెలుసుకొని అదనపు వ్యయాన్ని అరికట్టవచ్చు. ఆ సామాగ్రి కూడా పెద్ద ఖరీదైనవేం కాదు. మనం ఒకసారి చదివించుకున్న డబ్బులతో వీటిని కొనుక్కోవచ్చు. చాలా రోజులు పాటు వాడుకోవచ్చు.

 దుమ్ము దులపడానికి:

కంప్యూటరు లో వచ్చే చాలా సమస్యలకి పరిష్కారం దుమ్ము దులపడం. కంప్యూటరులో ఉండే పరికరాలు చాలా సున్నితమైనవి కనుక మనం ఈ పని చాలా జాగ్రత్తగా చేయాలి. బట్టతో తుడవడం వంటివి చేయగూడదు. మనం ఈ పనికి బ్లోయర్ కాని మెత్తని రంగులేసే బ్రష్‌ని కాని ఉపయోగించవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా రంగులేసే బ్రష్‌తో సున్నితంగా దుమ్ముని తొలగించుకోవచ్చు.

బ్లోయర్


రంగులేసే బ్రష్

స్క్రూడ్రైవర్:

మనం సాధారణంగా‌ వాడే స్క్రూడ్రైవర్ కాకుండా నక్షత్రాకార స్క్రూడ్రైవర్ కంప్యూటర్ లో చాలా భాగాలను విప్పడానికి పనికొస్తుంది. కనీసం మనం శుభ్రం చేసుకోవాడానికి డబ్బాని విప్పడానికి ఒక స్టార్ స్క్రూడ్రైవర్ ఉండాలి. లేదా మూడొందలు మనవి కావనుకుంటే వివిధ రకాల పరిమాణాలున్న స్క్రూడ్రైవర్ సెట్ వస్తుంది. 

స్టార్ స్క్రూడ్రైవర్

కంప్యూటర్ బాగుచేయడానికి ఉపయోగపడే వేరువేరు పరిమాణాలున్న స్క్రూడ్రైవర్ సెట్టు

యాంటీస్టాటిక్ రిస్ట్ బేండ్:

 మన కంప్యూటరులో ఉండే విడిభాగాలు అన్ని చిన్న చిన్న సున్నితమైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లను కలిగి ఉంటాయి. అవి చాలా తక్కువ ఓల్టేజితో పనిచేస్తాయి. మన కదలికల ద్వారా ఉత్పత్తి అయిన స్టాటిక్ ఎలెక్ట్రసిటి ఓల్టేజి వలన కూడా అవి పాడయిపోయే ప్రమాదం ఉంది కనుక స్టాటిక్ ఎలెక్ట్రసిటి ని డిస్చార్జి చేయడానికి యాంటీస్టాటిక్ రిస్ట్ బేండ్ ధరించాలి.

కంప్యూటరుని బాగు చేస్తున్నపుడు యాంటీస్టాటిక్ రిస్ట్ బేండ్ తప్పనిసరి

హీట్ సింక్ కాంపౌండ్:

మనం కంప్యూటరు వాడుతున్నపుడు ఎక్కునగా పనిచేసే భాగం, మరియు వేడిని ఉత్పత్తి చేసే బాగం ప్రాససర్. దీనికి ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ ఉండి దీనిని చల్లబరుస్తు ఉంటుంది. ఆ ఫ్యానుకి ప్రాససర్‌కి మధ్య పేస్టులాంటిది ఉంటుంది. ఇది కొన్నిరోజులకి అయిపోతుంది. అలాంటప్పుడు ప్రాససర్ వేడెక్కి కంప్యూటర్ ఆగిపోతుంది. అందువలన కంప్యూటర్ శుభ్రపరిచినప్పుడల్లా కాకుండా కనీసం సంవత్సరానికొకసారి అయినా ఈ హీట్ సింక్ పేస్టుని పెట్టుకోవాలి. ఇది మనకి చిన్న డబ్బా, ట్యూబు, చిన్న పాకెట్, సిరంజిలో లభిస్తుంది.

హీట్‌సింక్ కాంపౌండ్

డయాగ్నసిస్ టూల్:

మన కంప్యూటర్లో ఉన్న వివిధ పరికరాలలో సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఈ అధ్బుతమైన టూల్ ఉపయోగపడుతుంది. అల్టిమేట్ బూట్ సిడి అను ఈ టూల్ ని ఉపయోగించి హార్డ్ డిస్క్ డయాగ్నసిస్, రామ్‌ మరియు ప్రాససర్ ఇలా అన్ని పరికరాలను పరిక్షించవచ్చు.

అల్టిమేట్ బూట్ సిడి

ఆపరేటింగ్ సిస్టం :

మనం కంప్యూటర్ కొన్నప్పుడు వచ్చే ఆపరేటింగ్ సిస్టం సిడి లేదా మన సిస్టం యొక్క రికవరీ డిస్క్ తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఆ సిడి లేదా డీవీడీ మీ దగ్గర లేకపోతే ఉచితంగా దొరికే ఆపరేటింగ్ సిస్టం సిడి ఇమేజిని ఇక్కడ నుండి దింపుకోని సీడీలలో వ్రాసుకోవచ్చు. అవసరమయినప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు లేదా సీడీ నుండే లైవ్‌గా వాడుకోవచ్చు. ఈ లైవ్ సీడీని ఉపయోగించి సులభంగా పాడయిపోయిన సిస్టం నుండి డాటాని రికవరీ చెయ్యవచ్చు. ఈ లినక్స్ ఉచిత ఆపరేటింగ్ సిస్టం లను పెన్‌డ్రైవ్ నుండి కూడా ఇక్కడ చెప్పినట్లు తయారుచేసుకొని వాడుకోవచ్చు.

డెబియన్ సిడి
పెన్‌డ్రైవ్ లో ఉబుంటు

డ్రైవర్లకి పరిష్కారం:

 విండోస్ వాడేవారు తప్పక ఉంచుకోవలసిన సిడీ డ్రైవర్ పేక్ సొల్యూషన్ డివీడి. విండోస్ ఇన్‌స్టాల్ చేసిన తరువాత డైవర్ల గురించి వెతకనవసరం దీని ద్వారా మనం తప్పించుకోవచ్చు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.

తరచు కంప్యూటరు కొట్టు వాడికి డబ్బులు చదివించుకొని విసిగిపోయారా?

 మనం సాధారణంగా కంప్యూటర్ ఆన్ చేసి డెస్క్‌టాప్ రాగానే మన పనులు చేసుకొని పని అయిపోగానే తిరిగి కంప్యూటరును ఆపివేస్తాము. ప్రతిరోజు బాగానే ఆన్ అయినప్పటికి ఒకొక్కసారి కంప్యూటర్ ఆన్ కాకుండా సతాయిస్తు ఉంటుంది. దానితో మనం కంప్యూటరును దగ్గరలో ఉన్న కంప్యూటరు బాగుచేసే వాడి దగ్గరకు తీసుకొని వెళ్ళడం లేదా వాడినే ఇంటికి పిలిపించి బాగు చేయిస్తాము. సాధారణంగా కంప్యూటర్లు బాగుచేసే వాళ్ళు మన ముందు బాగు చేయడానికి ఇష్టపడరు. తరువాత రమ్మని చెప్పి పంపించి వేస్తుంటారు. సమస్య ఏదైనప్పటికి సాధారణంగా ఫార్మాటు చెయ్యాలి అని, చేసి తొందరగా మనకి డెస్క్‌టాప్ చూపించి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. లేదా అది పోయింది ఇది పోయిందని చెప్పి నిలువు దోపిడి చేస్తుంటారు. సాధారణంగా కంప్యూటరు బాగు చేయడానికి వచ్చే వాటిలో చాలా కంప్యూటర్లు చిన్న చిన్న సమస్యల కారణంగా వస్తుంటాయి. వాటిని మనం ఇంటి దగ్గరే మనమే పరిష్కరించుకోవచ్చు. మన తెలియని తనాన్ని వాడు సొమ్ము చేసుకుంటాడు. మనం కొంత ఆశక్తి చూపిస్తే అది గొప్ప విద్యేంకాదు. 
 వదులుగా ఉన్న కనెక్షన్‌ల వలన, సిపియు డబ్బాలో దుమ్ముచేరడం, ప్రాససర్ వేడెక్కడం, రామ్‌ సరిగా పెట్టకపోవడం, కరెంటు ఓల్టేజిలో హెచ్చుతగ్గులవల్ల, వైరస్ వలన సిస్టం పనితీరు మందగించడం, తరచు రీస్టార్ట్ అవడం, మనం పనిచేస్తున్నపుడు తరచు కరెంటు పోవడం వలన రామ్‌ పోవడం, హార్డ్‌డిస్క్ బ్యాడ్ సెక్టార్‌లు ఏర్పడడం వంటి సాధారణ సమస్యలు. అసలు సమస్య ఏమిటో తెలుసు కుంటే మనం సగం దోపిడినీ అడ్డుకున్నట్టే. నిజంగా ఏదైనా విడి బాగం పోతే సమస్య తెలిస్తే మనమే ఆ విడిబాగాన్ని నాణ్యమైన దానితో మార్చుకోవచ్చు. అదే కంప్యూటరు బాగు చేసేవాళ్ళయితే తక్కువ రకం  వాటిని అమర్చి ఎక్కువ డబ్బు తీసుకోవచ్చు. అందువలన మనకి సంబంధం లేని విషయం అయినప్పటికి తెలుసుకొని ఉంటే అత్యవసర సమయాల్లో చేతిచమురు వదలకుండా ఉండడమే కాకుండా ఇతరులకి కూడా సహాయం చేయవచ్చు. అంతేకాకుండా కొంత తెలిసినవాళ్ళ దగ్గర కంప్యూటరు కొట్టువాడు కూడా జాగ్రత్తగానే ఉంటాడు.  



 ఇలా కంప్యూటర్లలో తరచు వచ్చే సమస్యలు వాటికి పరిష్కారాలు మనం తరువాతి టపాలలో చూద్దాం.