మన కంప్యూటరు మన జేబుకి చిల్లు పెట్టకుండా ఉండాలంటే మనం కంప్యూటర్‌పై గడిపే సమయంలో కొంత సమయం అప్పుడప్పుడు కేటాయిస్తే మన కంప్యూటర్ ఆరోగ్యకరంగా సమస్యలు లేకుండా ఉంటుంది. దాని ఫలితంగా మనం సమయాన్ని మరియు డబ్బుని ఆధా చేసుకోవచ్చు. కంప్యూటర్ కి ప్రధాన శత్రువులు అయిన వాటిపై మనం జాగ్రత్తగా ఉంటే మన కంప్యూటర్ జీవితకాలాన్ని పెంచుకోవడమే కాకుండా తరచు చదివింపులనుండి తప్పించుకోవచ్చు. చాలా రోగాల విషయంలో చెప్పినట్టు చికిత్స కన్నా నివారణ మేలు అని కంప్యూటరు విషయంలో కూడా దీనిని వర్తించుకోవచ్చు. సమస్య వచ్చాకా దాన్ని బాగు చేసుకొనేకన్నా రాకముందే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకొంటే మన కంప్యూటరుని మంచి కండీషన్‌లో ఉంచుకోవచ్చు. క్రింద చెప్పిన ఐదు విషయాలు మనం పాటిస్తే కంప్యూటరు సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
శుభ్రంగా ఉంచుకోవడం:
కంప్యూటరుకు దుమ్ము ప్రధాన శత్రువుల్లో ఒకటి దుమ్ము. ఇది మన కంప్యూటరులో చేరి పనితీరును దెబ్బతీయడమే కాకుండా కంప్యూటరు చల్లబరచడానికి గల ఫ్యాన్‌లపై చేరి మిగిలిన అన్ని బాగాలను వేడెక్కేటట్లు చేస్తుంది. మన కంప్యూటర్ ని అప్పుడప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి లేదా కనీసం కంప్యూటరు నుండి శబ్ధం వచ్చినపుడు అయినా తప్పక శుభ్రంచేయాలి.
వేడెక్కకుండా ఉంచుకోవాలి:
కంప్యూటర్ సిపియు అన్నిటికన్నా ప్రధానమైనది అయినప్పటికి దానిని ఎక్కడో ఏదో ఒక మూలలో ఉంచడం మనం సాధారణంగా చూస్తుంటాము. సిపియుని సరిగా గాలి తగిలే, ఎండ తగలని, తడిలేని స్థలంలో ఉంచుకోవాలి. సిపియు ఫ్యాన్‌లు అన్న వైపు అడ్డంకులు ఉంచగూడదు. కొన్ని రోజులకి ప్రాససర్ ఫ్యాన్ క్రింద ఉన్న పేస్ట్ ఆరిపోతుంది కనుక అప్పుడప్పుడు దాన్ని చూసి లేకపోతే కొత్త పేస్టు పెట్టుకోవాలి. అలాగే కంప్యూటరు శుభ్ర పరిచినప్పుడు ఎక్కువగా దుమ్ము ఉండే ప్రదేశంగా మనం సిపియు ఫ్యాన్ ని గుర్తించవచ్చు. అందువలన సిపియు ఫ్యాన్ని కూడా తప్పకుండా శుభ్రపరుచుకోవాలి.
కరెంటు :
కంప్యూటరుకు మరో ప్రధాన శత్రువు తరచు కరెంటు పోవడం. ఇది మన చేతుల్లో లేనప్పటికి యూపియస్ వాడడం ద్వారా మనం దీనిని అరికట్టవచ్చు. మనం కంప్యూటర్లో ఏదైనా ఏదైనా పనిచేస్తున్నప్పుడు కరెంటు పోవడం వలన ర్యామ్, హార్డ్ డిస్క్ వంటివి చెడిపోతుంటాయి. సాధారణంగా కంప్యూటర్లో ఏదైనా విడిభాగం చెడిపోతే అది కచ్చితంగా కరెంటు పోయినప్పుడూ కాని, కరెంటు వస్తూపోతూఉన్నపుడు ఓల్టేజి హెచ్చుతగ్గుల వలన కాని జరుగుతుంటుంది. అందువలన కరెంటు వస్తూపోతూ ఉన్నపుడు కంప్యూటరును ఆన్ చెయ్యకపోవడమే మంచిది. ఎర్తింగ్ కూడా తప్పకుండా ఉండేటట్లు చూసుకోవాలి. యూపియస్ తప్పకుండా వాడడం వలన కరెంటు ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చు. కంప్యూటరు అకస్మాత్తుగా మనం ఆపకుండా ఆగిపోవడాన్ని నివారిస్తే హార్డ్‌డిస్క్ బ్యాడ్ సెక్టార్లు రావడం, ఆపరేటింగ్ సిస్టం కరెప్టెడ్, ఫైల్ మిస్సింగ్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
వైరస్:
తరచు కంప్యూటర్లు బాగుచేయించడానికి వచ్చే వాటిలో ఎక్కువ గా వైరస్ సమస్యలతో వస్తుంటాయి. మొత్తంగా వాటిని వైరస్‌లు అని మనం పిలుచుకున్నప్పటికి వాటిలో మాల్‌వేర్లు, ట్రోజాన్, స్పైవేర్లు అని చాలారకాలు సిస్టంకి హాని కలిగించే సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి. ఈ వైరస్‌ల వలన ఆపరేటింగ్ సిస్టం చెడిపోవడంకాని సిస్టం నెమ్మదిగా పనిచేయడం గాని జరుగుతుంది. వైరస్ అన్నది మన కంప్యూటరికి నెట్ నుండి గాని పెన్‌డ్రైన్ వలన గాని వస్తుంది. కనుక ఒక మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని తరచు దానితో మన సిస్టంని స్కాన్ చేసుకోవాలి. అన్నట్టు యాంటీ వైరస్ ని ఎల్లపుడు అప్‌డేట్‌గా ఉంచుకోవాలి ఎందుకంటే యాంటీవైరస్‌కి వైరస్‌లను గుర్తుపట్టి వాటిని నిర్వీర్యం చేసే శక్తి అప్‌డేట్ల ద్వారానే అందుతుంది. సిస్టంకి పెన్‌డ్రైవ్ తగిలించినపుడు ముందుగా దాన్ని యాంటీవైరస్‌తో స్కాన్ చేసిన తరువాతనే తెరవాలి. అంతేకాకుండా అడ్డమైన సైట్స్‌ని తెరవకుండా ఉండడం కూడా నెట్ నుండి వైరస్‌లు రాకుండా ఉండడానికి చక్కని పరిష్కారం.
అప్‌డేట్:
ఆపరేటింగ్ సిస్టం లో ఉన్న బధ్రతా పరమైన లోపాలను సవరించడానికి తయారీదారు సమస్యని గుర్తించినపుడు ఆసమస్యకి సంబంధించిన పరిష్కారాన్ని అప్‌డేట్స్ రూపంలో విడుదల చేస్తుంటారు. కనుక మనం వాడే ఆపరేటింగ్ సిస్టం,డ్రైవర్ల మరియు సాఫ్ట్‌వేర్ల అప్‌డేట్స్ ని తప్పకుండా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మనం చేయవలసిందల్లా అప్‌డేట్స్ అందుబాటులో ఉన్నాయి ఇన్‌స్టాల్ చెయ్యాలా అని అడిగినప్పుడు ఒకే అని నొక్కడమే.