తరచు కంప్యూటరు కొట్టు వాడికి డబ్బులు చదివించుకొని విసిగిపోయారా?

 మనం సాధారణంగా కంప్యూటర్ ఆన్ చేసి డెస్క్‌టాప్ రాగానే మన పనులు చేసుకొని పని అయిపోగానే తిరిగి కంప్యూటరును ఆపివేస్తాము. ప్రతిరోజు బాగానే ఆన్ అయినప్పటికి ఒకొక్కసారి కంప్యూటర్ ఆన్ కాకుండా సతాయిస్తు ఉంటుంది. దానితో మనం కంప్యూటరును దగ్గరలో ఉన్న కంప్యూటరు బాగుచేసే వాడి దగ్గరకు తీసుకొని వెళ్ళడం లేదా వాడినే ఇంటికి పిలిపించి బాగు చేయిస్తాము. సాధారణంగా కంప్యూటర్లు బాగుచేసే వాళ్ళు మన ముందు బాగు చేయడానికి ఇష్టపడరు. తరువాత రమ్మని చెప్పి పంపించి వేస్తుంటారు. సమస్య ఏదైనప్పటికి సాధారణంగా ఫార్మాటు చెయ్యాలి అని, చేసి తొందరగా మనకి డెస్క్‌టాప్ చూపించి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. లేదా అది పోయింది ఇది పోయిందని చెప్పి నిలువు దోపిడి చేస్తుంటారు. సాధారణంగా కంప్యూటరు బాగు చేయడానికి వచ్చే వాటిలో చాలా కంప్యూటర్లు చిన్న చిన్న సమస్యల కారణంగా వస్తుంటాయి. వాటిని మనం ఇంటి దగ్గరే మనమే పరిష్కరించుకోవచ్చు. మన తెలియని తనాన్ని వాడు సొమ్ము చేసుకుంటాడు. మనం కొంత ఆశక్తి చూపిస్తే అది గొప్ప విద్యేంకాదు. 
 వదులుగా ఉన్న కనెక్షన్‌ల వలన, సిపియు డబ్బాలో దుమ్ముచేరడం, ప్రాససర్ వేడెక్కడం, రామ్‌ సరిగా పెట్టకపోవడం, కరెంటు ఓల్టేజిలో హెచ్చుతగ్గులవల్ల, వైరస్ వలన సిస్టం పనితీరు మందగించడం, తరచు రీస్టార్ట్ అవడం, మనం పనిచేస్తున్నపుడు తరచు కరెంటు పోవడం వలన రామ్‌ పోవడం, హార్డ్‌డిస్క్ బ్యాడ్ సెక్టార్‌లు ఏర్పడడం వంటి సాధారణ సమస్యలు. అసలు సమస్య ఏమిటో తెలుసు కుంటే మనం సగం దోపిడినీ అడ్డుకున్నట్టే. నిజంగా ఏదైనా విడి బాగం పోతే సమస్య తెలిస్తే మనమే ఆ విడిబాగాన్ని నాణ్యమైన దానితో మార్చుకోవచ్చు. అదే కంప్యూటరు బాగు చేసేవాళ్ళయితే తక్కువ రకం  వాటిని అమర్చి ఎక్కువ డబ్బు తీసుకోవచ్చు. అందువలన మనకి సంబంధం లేని విషయం అయినప్పటికి తెలుసుకొని ఉంటే అత్యవసర సమయాల్లో చేతిచమురు వదలకుండా ఉండడమే కాకుండా ఇతరులకి కూడా సహాయం చేయవచ్చు. అంతేకాకుండా కొంత తెలిసినవాళ్ళ దగ్గర కంప్యూటరు కొట్టువాడు కూడా జాగ్రత్తగానే ఉంటాడు.  



 ఇలా కంప్యూటర్లలో తరచు వచ్చే సమస్యలు వాటికి పరిష్కారాలు మనం తరువాతి టపాలలో చూద్దాం.