సిపియు డబ్బాలో ఉండే భాగాలు

 కంప్యూటరు లో అతి ముఖ్యమైన భాగం సిపియుగా మనం పిలుచుకొనే రేకు డబ్బా. దీనిని కాబినెట్ అంటారు. ఇది రేకు డబ్బా అయినప్పటికీ దీనిలో మన కంప్యూటరు పనిచేయడానికి కావలసిన అన్ని పరికరాలు అమర్చబడి ఉంటాయి కనుక అది అతిముఖ్యమైనది, ఖరీధైనది. అందువలన దీని గురించి తెలుసుకోవడం తప్పనిసరి. మనం సిపియుని అప్పుడప్పుడు శుభ్రం చేయడానికి సిపియు డబ్బాకి ఒక వైపు ఉన్న రేకుని తొలగించినపుడు క్రింది చిత్రంలో వలే కనిపిస్తుంది. మొదటిసారి చూసేవారికి కొంత కొత్తగా అనిపించినప్పటికి ఒకటి రెండు సార్లు చూస్తే మనమే మన సిపియు డబ్బాని విప్పి శుభ్రం చేసుకోవచ్చు.

కంప్యూటరు సిపియు లోపలి బాగాలు

 మధర్ బోర్డ్:

మన సిపియు లో ఉన్న పెద్దబాగం మధర్ బోర్డ్ లేదా మెయిన్ బోర్డ్. కంప్యూటరులో ఉన్న అన్ని పరికరాలు (కొన్ని నేరుగా కొన్ని కేబుళ్ళ ద్వారా)దీనికి కలుపబడి ఉంటాయి.

యస్‌యమ్‌పియస్:

ఇది కంప్యూటరులోని అన్ని బాగాలకు కరెంటును సరఫరా చేస్తుంది. దీనిని నుండి వచ్చిన వివిధ రకాల కేబుళ్ళు వివిధ కంప్యూటరు భాగాలకు కలుపబడి ఉంటాయి.

హార్డ్‌డిస్క్:

మన సమాచారం ఫైళ్ళ రూపంలో దీనిలో బధ్రపరచబడి ఉంటుంది. దీనికి యస్‌యమ్‌పియస్ నుండి ఒక పవర్ కేబుల్ దీనినుండి మధర్ బోర్డుకు ఒక డాటా కేబుల్ కలుపబడి ఉంటాయి. మన కంప్యూటరులో మధర్ బోర్డులో ఉన్న పోర్టులను బట్టి మరిన్ని హార్డ్‌డిస్క్‌లు పెట్టుకోవడానికి కాబినెట్‌లో స్థలం ఉంటుంది.

సిపియు ఫ్యాన్:

మధర్‌బోర్డులో ప్రాససర్ పైన ఇది అమర్చబడి ఉంటుంది. ప్రాససర్ వేడెక్కకుండా చూడడం దీని పని. ఎక్కువగా దుమ్ము దీనికే పడుతుంది.

డివిడీడ్రైవ్:

డివిడీ/సీడీ లు చదవడానికి, వ్రాయడానికి ఉపయోగపడుతుంది. దీనికి యస్‌యమ్‌పియస్ నుండి ఒక పవర్ కేబుల్ దీనినుండి మధర్ బోర్డుకు ఒక డాటా కేబుల్ కలుపబడి ఉంటాయి. మన కంప్యూటరులో మధర్ బోర్డులో ఉన్న పోర్టులను బట్టి మరిన్ని డివీడీ డ్రైవ్‌లు పెట్టుకోవడానికి కాబినెట్‌లో స్థలం ఉంటుంది.


రామ్‌:

మధర్ బోర్డులో సాధారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ రామ్‌ పెట్టుకోవడానికి కావలసిన స్లాటులు ఉంటాయి. ఎక్కువగా కంప్యూటర్ల సమస్యలు ఈ రామ్‌ వలన వస్తుంటాయి. చాలాసార్లు రామ్‌ తీసి వేరొక స్లాట్ లో పెట్టడం వలన కాని ఒకటి కంటే ఎక్కువ రామ్‌లు ఉన్నపుడు ఒకటి తీసివేయడం వలన సమస్య పరిష్కారం అవుతుంది.