సయనోజెన్‌మోడ్ ఇన్‌స్టాలర్‌ గూగుల్ ప్లేస్టోర్ నుండి తొలగించబడింది

 ప్రముఖ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ యొక్క ఒపెన్‌సోర్స్ రామ్‌ అయిన సయనోజెన్‌మోడ్ ఈ మధ్యే సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి అనువుగా ఇన్‌స్టాలర్‌ని విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే అనుకున్నట్టుగానే గూగులోడు ప్లేస్టోర్ నుండి సయనోజెన్‌మోడ్ ఇన్‌స్టాలర్‌ని నిబంధనలను అతిక్రమించినందుకు అంటూ తొలగించాడు. సైనోజెన్‌మోడ్ ఎంతగా ప్రాచూర్యం పొందుతుందో ఇక్కడ ఇవ్వబడిన గణాంకాలను చూస్తే తెలుస్తుంది. ఇకనుండి ఎవరైన సైనోజెన్ మోడ్ ఇన్‌స్టాలర్ ని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ నుండి .apk ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. .apk ఫైల్‌ని ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఇక్కడ చూడవచ్చు.

సిపియు డబ్బాలో ఉండే భాగాలు

 కంప్యూటరు లో అతి ముఖ్యమైన భాగం సిపియుగా మనం పిలుచుకొనే రేకు డబ్బా. దీనిని కాబినెట్ అంటారు. ఇది రేకు డబ్బా అయినప్పటికీ దీనిలో మన కంప్యూటరు పనిచేయడానికి కావలసిన అన్ని పరికరాలు అమర్చబడి ఉంటాయి కనుక అది అతిముఖ్యమైనది, ఖరీధైనది. అందువలన దీని గురించి తెలుసుకోవడం తప్పనిసరి. మనం సిపియుని అప్పుడప్పుడు శుభ్రం చేయడానికి సిపియు డబ్బాకి ఒక వైపు ఉన్న రేకుని తొలగించినపుడు క్రింది చిత్రంలో వలే కనిపిస్తుంది. మొదటిసారి చూసేవారికి కొంత కొత్తగా అనిపించినప్పటికి ఒకటి రెండు సార్లు చూస్తే మనమే మన సిపియు డబ్బాని విప్పి శుభ్రం చేసుకోవచ్చు.

కంప్యూటరు సిపియు లోపలి బాగాలు

 మధర్ బోర్డ్:

మన సిపియు లో ఉన్న పెద్దబాగం మధర్ బోర్డ్ లేదా మెయిన్ బోర్డ్. కంప్యూటరులో ఉన్న అన్ని పరికరాలు (కొన్ని నేరుగా కొన్ని కేబుళ్ళ ద్వారా)దీనికి కలుపబడి ఉంటాయి.

యస్‌యమ్‌పియస్:

ఇది కంప్యూటరులోని అన్ని బాగాలకు కరెంటును సరఫరా చేస్తుంది. దీనిని నుండి వచ్చిన వివిధ రకాల కేబుళ్ళు వివిధ కంప్యూటరు భాగాలకు కలుపబడి ఉంటాయి.

హార్డ్‌డిస్క్:

మన సమాచారం ఫైళ్ళ రూపంలో దీనిలో బధ్రపరచబడి ఉంటుంది. దీనికి యస్‌యమ్‌పియస్ నుండి ఒక పవర్ కేబుల్ దీనినుండి మధర్ బోర్డుకు ఒక డాటా కేబుల్ కలుపబడి ఉంటాయి. మన కంప్యూటరులో మధర్ బోర్డులో ఉన్న పోర్టులను బట్టి మరిన్ని హార్డ్‌డిస్క్‌లు పెట్టుకోవడానికి కాబినెట్‌లో స్థలం ఉంటుంది.

సిపియు ఫ్యాన్:

మధర్‌బోర్డులో ప్రాససర్ పైన ఇది అమర్చబడి ఉంటుంది. ప్రాససర్ వేడెక్కకుండా చూడడం దీని పని. ఎక్కువగా దుమ్ము దీనికే పడుతుంది.

డివిడీడ్రైవ్:

డివిడీ/సీడీ లు చదవడానికి, వ్రాయడానికి ఉపయోగపడుతుంది. దీనికి యస్‌యమ్‌పియస్ నుండి ఒక పవర్ కేబుల్ దీనినుండి మధర్ బోర్డుకు ఒక డాటా కేబుల్ కలుపబడి ఉంటాయి. మన కంప్యూటరులో మధర్ బోర్డులో ఉన్న పోర్టులను బట్టి మరిన్ని డివీడీ డ్రైవ్‌లు పెట్టుకోవడానికి కాబినెట్‌లో స్థలం ఉంటుంది.


రామ్‌:

మధర్ బోర్డులో సాధారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ రామ్‌ పెట్టుకోవడానికి కావలసిన స్లాటులు ఉంటాయి. ఎక్కువగా కంప్యూటర్ల సమస్యలు ఈ రామ్‌ వలన వస్తుంటాయి. చాలాసార్లు రామ్‌ తీసి వేరొక స్లాట్ లో పెట్టడం వలన కాని ఒకటి కంటే ఎక్కువ రామ్‌లు ఉన్నపుడు ఒకటి తీసివేయడం వలన సమస్య పరిష్కారం అవుతుంది.

మీ పిల్లల కోసం సరైన స్కూల్ ఎంచుకోవడానికి

 మానవుని అభివృధ్దిలో విద్యదే ఎంతో కీలక పాత్ర. పిల్లలకు బాల్యంలో ఉన్నపుడు మంచి విద్యను అందిస్తే వారిని తప్పకుండా మంచిపౌరులుగా తీర్చిదిద్దినట్లే. వారిని మంచి పౌరులుగా మలచడంలో ఉపాద్యాయులు పాత్ర తల్లిదండ్రులు కన్నా కొంచెం ఎక్కువే. అలాగే పాఠశాల వాతావరణం కూడా పిల్లల ఎదుగుదలపై చాలా ప్రభావం చూపింస్తుందనడం అతిశయోక్తికాదు. ఈ రోజుల్లో ఉన్న వేగవంతమైన జీవనంలో మన పిల్లలకు మంచి పాఠశాల వెతకడం కత్తి మీద సాము లాంటిదే. ఇప్పుడు చాలా వరకు జనాభా పట్టణాలకి వలస రావడం వలన ఇక్కడ పాఠశాలలకి డిమాండ్ ఎక్కువైంది. ప్రధాన నగరాలయిన హైదరాబాదు, డిల్లి, చెన్నై మరియు బెంగళూరు వంటి పెద్ద నగరాలలో ఉద్యోగాల నిమిత్తం తాత్కాలికంగా చాలా మంది నివాసాన్ని ఏర్పరుచుకుంటున్నారు. మనం కొత్తగా వెళ్ళబోతున్న చోట పాఠశాలల గురించి మనం ముందే తెలుసుకొని మనం అక్కడికి వెళ్ళే సరికి పిల్లల స్కూలు కూడా నిర్ణయించుకుంటే ఎంతబాగుంటుంది. 
 మనం వెళ్ళబోతున్న నగరం అక్కడ ఉన్న స్కూళ్ళు వాటిలో పీజులు వాటి గురించి ఇప్పటికే చదువుతున్న వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు వంటివి ముందే తెలుసుకోగలిగితే మన పిల్లలకు కూడా మంచి స్కూల్ ని ఎంచుకోవచ్చుకదా. దానికోసం మనం ఎక్కడో తిరగనవసరం లేదు. ఇంట్లోనే ఉండి అందుబాటులో ఉన్న వివిధ స్కూళ్ళ గురించి తెలుసుకోవడానికి పేరెంట్రీ అన్న వెబ్ సైటు మనకి ఉపయోగపడుతుంది. పేరెంట్రీ అనేది వివిధ నగరాల్లో స్కూళ్ళ గురించి సమాచారాన్ని పంచుకోవడానికి ఓ మంచి వేధిక. ఇక్కడ ఫోరమ్‌ రూపంలో ఆయా స్కూళ్ళు, అడ్మిషన్ తేధి, పీజులు, అభిప్రాయాలు మరియు రవాణా వంటి పాఠశాలలకు సంబంధించిన విషయాలు మన లాంటివారు పంచుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ తల్లిదండ్రులకు ఉపయోగపడు చాలా విషయాలు మనం చూడవచ్చు. 


ఆరోగ్యవంతమైన కంప్యూటర్‌కి ఐదు సూత్రాలు

 మన కంప్యూటరు మన జేబుకి చిల్లు పెట్టకుండా ఉండాలంటే మనం కంప్యూటర్‌పై గడిపే సమయంలో కొంత సమయం అప్పుడప్పుడు కేటాయిస్తే మన కంప్యూటర్ ఆరోగ్యకరంగా సమస్యలు లేకుండా ఉంటుంది. దాని ఫలితంగా మనం సమయాన్ని మరియు డబ్బుని ఆధా చేసుకోవచ్చు.  కంప్యూటర్ కి ప్రధాన శత్రువులు అయిన వాటిపై మనం జాగ్రత్తగా ఉంటే మన కంప్యూటర్ జీవితకాలాన్ని పెంచుకోవడమే కాకుండా తరచు చదివింపులనుండి తప్పించుకోవచ్చు. చాలా రోగాల విషయంలో చెప్పినట్టు చికిత్స కన్నా నివారణ మేలు అని కంప్యూటరు విషయంలో కూడా దీనిని వర్తించుకోవచ్చు. సమస్య వచ్చాకా దాన్ని బాగు చేసుకొనేకన్నా రాకముందే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకొంటే మన కంప్యూటరుని మంచి కండీషన్‌లో ఉంచుకోవచ్చు. క్రింద చెప్పిన ఐదు విషయాలు మనం పాటిస్తే కంప్యూటరు సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

శుభ్రంగా ఉంచుకోవడం: 

కంప్యూటరుకు దుమ్ము ప్రధాన శత్రువుల్లో ఒకటి దుమ్ము. ఇది మన కంప్యూటరులో చేరి పనితీరును దెబ్బతీయడమే కాకుండా కంప్యూటరు చల్లబరచడానికి గల ఫ్యాన్‌లపై చేరి మిగిలిన అన్ని బాగాలను వేడెక్కేటట్లు చేస్తుంది. మన కంప్యూటర్ ని అప్పుడప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి లేదా కనీసం కంప్యూటరు నుండి శబ్ధం వచ్చినపుడు అయినా తప్పక శుభ్రంచేయాలి.

వేడెక్కకుండా ఉంచుకోవాలి:

కంప్యూటర్ సిపియు అన్నిటికన్నా ప్రధానమైనది అయినప్పటికి దానిని ఎక్కడో ఏదో ఒక మూలలో ఉంచడం మనం సాధారణంగా చూస్తుంటాము. సిపియుని సరిగా గాలి తగిలే, ఎండ తగలని, తడిలేని  స్థలంలో ఉంచుకోవాలి. సిపియు ఫ్యాన్‌లు అన్న వైపు అడ్డంకులు ఉంచగూడదు. కొన్ని రోజులకి ప్రాససర్ ఫ్యాన్ క్రింద ఉన్న పేస్ట్ ఆరిపోతుంది కనుక అప్పుడప్పుడు దాన్ని చూసి లేకపోతే కొత్త పేస్టు పెట్టుకోవాలి. అలాగే కంప్యూటరు శుభ్ర పరిచినప్పుడు ఎక్కువగా దుమ్ము ఉండే ప్రదేశంగా మనం సిపియు ఫ్యాన్ ని గుర్తించవచ్చు. అందువలన సిపియు ఫ్యాన్ని కూడా తప్పకుండా శుభ్రపరుచుకోవాలి.

కరెంటు :

కంప్యూటరుకు మరో ప్రధాన శత్రువు తరచు కరెంటు పోవడం. ఇది మన చేతుల్లో లేనప్పటికి యూపియస్ వాడడం ద్వారా మనం దీనిని అరికట్టవచ్చు. మనం కంప్యూటర్లో ఏదైనా ఏదైనా పనిచేస్తున్నప్పుడు కరెంటు పోవడం వలన ర్యామ్‌, హార్డ్ డిస్క్ వంటివి చెడిపోతుంటాయి. సాధారణంగా కంప్యూటర్లో ఏదైనా విడిభాగం చెడిపోతే అది కచ్చితంగా కరెంటు పోయినప్పుడూ కాని, కరెంటు వస్తూపోతూఉన్నపుడు ఓల్టేజి హెచ్చుతగ్గుల వలన కాని జరుగుతుంటుంది. అందువలన కరెంటు వస్తూపోతూ ఉన్నపుడు కంప్యూటరును ఆన్ చెయ్యకపోవడమే మంచిది. ఎర్తింగ్ కూడా తప్పకుండా ఉండేటట్లు చూసుకోవాలి. యూపియస్ తప్పకుండా వాడడం వలన కరెంటు ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చు. కంప్యూటరు అకస్మాత్తుగా మనం ఆపకుండా ఆగిపోవడాన్ని నివారిస్తే హార్డ్‌డిస్క్ బ్యాడ్ సెక్టార్లు రావడం, ఆపరేటింగ్ సిస్టం కరెప్టెడ్, ఫైల్ మిస్సింగ్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

వైరస్:

తరచు కంప్యూటర్లు బాగుచేయించడానికి వచ్చే వాటిలో ఎక్కువ గా వైరస్ సమస్యలతో వస్తుంటాయి. మొత్తంగా వాటిని వైరస్‌లు అని మనం పిలుచుకున్నప్పటికి వాటిలో మాల్‌వేర్లు, ట్రోజాన్, స్పైవేర్లు అని చాలా‌రకాలు సిస్టంకి హాని కలిగించే సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి. ఈ వైరస్‌ల వలన ఆపరేటింగ్ సిస్టం చెడిపోవడంకాని సిస్టం నెమ్మదిగా పనిచేయడం గాని జరుగుతుంది. వైరస్ అన్నది మన కంప్యూటరికి నెట్ నుండి గాని పెన్‌డ్రైన్ వలన గాని వస్తుంది. కనుక ఒక మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని తరచు దానితో మన సిస్టంని స్కాన్ చేసుకోవాలి. అన్నట్టు యాంటీ వైరస్ ని ఎల్లపుడు అప్‌డేట్‌గా ఉంచుకోవాలి ఎందుకంటే యాంటీవైరస్‌కి వైరస్‌లను గుర్తుపట్టి వాటిని నిర్వీర్యం చేసే శక్తి అప్‌డేట్ల ద్వారానే అందుతుంది. సిస్టంకి పెన్‌డ్రైవ్ తగిలించినపుడు ముందుగా దాన్ని యాంటీవైరస్‌తో స్కాన్ చేసిన తరువాతనే తెరవాలి. అంతేకాకుండా అడ్డమైన సైట్స్‌ని తెరవకుండా ఉండడం కూడా నెట్ నుండి వైరస్‌లు రాకుండా ఉండడానికి చక్కని పరిష్కారం.

అప్‌డేట్:

ఆపరేటింగ్ సిస్టం లో ఉన్న బధ్రతా పరమైన లోపాలను సవరించడానికి తయారీదారు సమస్యని గుర్తించినపుడు ఆసమస్యకి సంబంధించిన పరిష్కారాన్ని అప్‌డేట్స్‌ రూపంలో విడుదల చేస్తుంటారు. కనుక మనం వాడే ఆపరేటింగ్ సిస్టం,డ్రైవర్ల  మరియు సాఫ్ట్‌వేర్ల అప్‌డేట్స్ ని తప్పకుండా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మనం చేయవలసిందల్లా అప్‌డేట్స్ అందుబాటులో ఉన్నాయి ఇన్‌స్టాల్ చెయ్యాలా అని అడిగినప్పుడు ఒకే అని నొక్కడమే.

వేరే వాళ్ళ కంప్యూటర్లో వెబ్ బ్రౌజింగ్ చేస్తుంటే ఇది మీకు తప్పక ఉపయోగపడుతుంది

 మనం వెబ్ బ్రౌజింగ్ చేసేటప్పుడు మనం చూసిన వెబ్ పేజిలు, మరియు వివిధ సైట్లలో మన సెట్టింగులు వంటి సమాచారం కంప్యూటర్లో దాయబడుతుంది. ముఖ్యంగా మనం వేరే వాళ్ళ కంప్యూటర్లు లేదా ఇంటర్‌నెట్ సెంటర్‌లో మనం వెబ్ బ్రౌజింగ్ చేసిన తరువాత ఎవరైనా మన బ్రౌజింగ్ చరిత్రని సులభంగా తెలుసుకోవచ్చు. మనం వేరేవాళ్ళ కంప్యూటర్లో నెట్ వాడవలసినపుడు ఈ చిన్న చిట్కా అనుసరిస్తే మన బ్రౌజింగ్ సమాచారాన్ని ఇతరులు చూడకుండా చేయవచ్చు. మనం తాత్కాలికంగా వాడబోతున్న కంప్యూటర్లో ఫైర్‌ఫాక్స్ వెబ్ బ్రౌజర్ని ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌లో ఒపెన్ చేసి వెబ్ బ్రౌజింగ్ చేస్తే మనం చూసిన వెబ్ సైట్ల తాలుకు సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ చెయ్యబడదు. క్రింది చిత్రంలో చూపించినట్లు లేదా ఫైర్‌ఫాక్స్ ఐకాన్‌ని రైట్ క్లిక్ చేసి ఈ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ లోకి వెళ్ళవచ్చు. ఈ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ కూడా మనం మామూలుగా వాడే ఫైర్‌ఫాక్స్ లాగే ఉంటు అన్ని ఫైర్‌ఫాక్స్ ఫీచర్లు పనిచేస్తాయి. రెండిటికి తేడా కేవలం ఎటువంటి బ్రౌజింగ్ డాటాని కంప్యూటర్లో సేవ్ చెయ్యకపోవడమే. అందువలన బయటి సిస్టంలు అనగా ఇంటర్ నెట్ సెంటర్లు మరియు కార్యాలయాలు వంటి చోట మన సమాచారం సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ ప్రైవేట్ బ్రౌజింగ్ ని వాడుకోవచ్చు.

ఫైర్‌ఫాక్స్ లో పైవేట్ బ్రౌజింగ్ మోడ్‌ని తెరవడం
 
ఫైర్‌ఫాక్స్ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ విండో