వేరే వాళ్ళ కంప్యూటర్లో వెబ్ బ్రౌజింగ్ చేస్తుంటే ఇది మీకు తప్పక ఉపయోగపడుతుంది

 మనం వెబ్ బ్రౌజింగ్ చేసేటప్పుడు మనం చూసిన వెబ్ పేజిలు, మరియు వివిధ సైట్లలో మన సెట్టింగులు వంటి సమాచారం కంప్యూటర్లో దాయబడుతుంది. ముఖ్యంగా మనం వేరే వాళ్ళ కంప్యూటర్లు లేదా ఇంటర్‌నెట్ సెంటర్‌లో మనం వెబ్ బ్రౌజింగ్ చేసిన తరువాత ఎవరైనా మన బ్రౌజింగ్ చరిత్రని సులభంగా తెలుసుకోవచ్చు. మనం వేరేవాళ్ళ కంప్యూటర్లో నెట్ వాడవలసినపుడు ఈ చిన్న చిట్కా అనుసరిస్తే మన బ్రౌజింగ్ సమాచారాన్ని ఇతరులు చూడకుండా చేయవచ్చు. మనం తాత్కాలికంగా వాడబోతున్న కంప్యూటర్లో ఫైర్‌ఫాక్స్ వెబ్ బ్రౌజర్ని ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌లో ఒపెన్ చేసి వెబ్ బ్రౌజింగ్ చేస్తే మనం చూసిన వెబ్ సైట్ల తాలుకు సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ చెయ్యబడదు. క్రింది చిత్రంలో చూపించినట్లు లేదా ఫైర్‌ఫాక్స్ ఐకాన్‌ని రైట్ క్లిక్ చేసి ఈ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ లోకి వెళ్ళవచ్చు. ఈ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ కూడా మనం మామూలుగా వాడే ఫైర్‌ఫాక్స్ లాగే ఉంటు అన్ని ఫైర్‌ఫాక్స్ ఫీచర్లు పనిచేస్తాయి. రెండిటికి తేడా కేవలం ఎటువంటి బ్రౌజింగ్ డాటాని కంప్యూటర్లో సేవ్ చెయ్యకపోవడమే. అందువలన బయటి సిస్టంలు అనగా ఇంటర్ నెట్ సెంటర్లు మరియు కార్యాలయాలు వంటి చోట మన సమాచారం సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ ప్రైవేట్ బ్రౌజింగ్ ని వాడుకోవచ్చు.

ఫైర్‌ఫాక్స్ లో పైవేట్ బ్రౌజింగ్ మోడ్‌ని తెరవడం
 
ఫైర్‌ఫాక్స్ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ విండో

కంప్యూటర్ ఉంటే ఇవి తప్పనిసరి

 ఈ రోజుల్లో కంప్యూటర్ లేని వారు చాలా అరుదు. చాలా వరకు అందరి ఇళ్ళలో, చిన్న పెద్దా దుకాణాలలో, పాఠశాలలలో ఇలా అన్ని చోట్లా కంప్యూటరు పాగా వేసింది. ఇంత ప్రాచుర్యం పొందినప్పటికి ఇప్పటికి చాలా మంది కంప్యూటరు తో ఉండవలసిన అత్యవసర సామాగ్రి మాత్రం కలిగి ఉండడం లేదు. ఈ సామాగ్రి ఉంటే మనమే చాలా వరకు సమస్యలను అధిగమించవచ్చు లేదా సమస్య ఏమిటో తెలుసుకొని అదనపు వ్యయాన్ని అరికట్టవచ్చు. ఆ సామాగ్రి కూడా పెద్ద ఖరీదైనవేం కాదు. మనం ఒకసారి చదివించుకున్న డబ్బులతో వీటిని కొనుక్కోవచ్చు. చాలా రోజులు పాటు వాడుకోవచ్చు.

 దుమ్ము దులపడానికి:

కంప్యూటరు లో వచ్చే చాలా సమస్యలకి పరిష్కారం దుమ్ము దులపడం. కంప్యూటరులో ఉండే పరికరాలు చాలా సున్నితమైనవి కనుక మనం ఈ పని చాలా జాగ్రత్తగా చేయాలి. బట్టతో తుడవడం వంటివి చేయగూడదు. మనం ఈ పనికి బ్లోయర్ కాని మెత్తని రంగులేసే బ్రష్‌ని కాని ఉపయోగించవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా రంగులేసే బ్రష్‌తో సున్నితంగా దుమ్ముని తొలగించుకోవచ్చు.

బ్లోయర్


రంగులేసే బ్రష్

స్క్రూడ్రైవర్:

మనం సాధారణంగా‌ వాడే స్క్రూడ్రైవర్ కాకుండా నక్షత్రాకార స్క్రూడ్రైవర్ కంప్యూటర్ లో చాలా భాగాలను విప్పడానికి పనికొస్తుంది. కనీసం మనం శుభ్రం చేసుకోవాడానికి డబ్బాని విప్పడానికి ఒక స్టార్ స్క్రూడ్రైవర్ ఉండాలి. లేదా మూడొందలు మనవి కావనుకుంటే వివిధ రకాల పరిమాణాలున్న స్క్రూడ్రైవర్ సెట్ వస్తుంది. 

స్టార్ స్క్రూడ్రైవర్

కంప్యూటర్ బాగుచేయడానికి ఉపయోగపడే వేరువేరు పరిమాణాలున్న స్క్రూడ్రైవర్ సెట్టు

యాంటీస్టాటిక్ రిస్ట్ బేండ్:

 మన కంప్యూటరులో ఉండే విడిభాగాలు అన్ని చిన్న చిన్న సున్నితమైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లను కలిగి ఉంటాయి. అవి చాలా తక్కువ ఓల్టేజితో పనిచేస్తాయి. మన కదలికల ద్వారా ఉత్పత్తి అయిన స్టాటిక్ ఎలెక్ట్రసిటి ఓల్టేజి వలన కూడా అవి పాడయిపోయే ప్రమాదం ఉంది కనుక స్టాటిక్ ఎలెక్ట్రసిటి ని డిస్చార్జి చేయడానికి యాంటీస్టాటిక్ రిస్ట్ బేండ్ ధరించాలి.

కంప్యూటరుని బాగు చేస్తున్నపుడు యాంటీస్టాటిక్ రిస్ట్ బేండ్ తప్పనిసరి

హీట్ సింక్ కాంపౌండ్:

మనం కంప్యూటరు వాడుతున్నపుడు ఎక్కునగా పనిచేసే భాగం, మరియు వేడిని ఉత్పత్తి చేసే బాగం ప్రాససర్. దీనికి ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ ఉండి దీనిని చల్లబరుస్తు ఉంటుంది. ఆ ఫ్యానుకి ప్రాససర్‌కి మధ్య పేస్టులాంటిది ఉంటుంది. ఇది కొన్నిరోజులకి అయిపోతుంది. అలాంటప్పుడు ప్రాససర్ వేడెక్కి కంప్యూటర్ ఆగిపోతుంది. అందువలన కంప్యూటర్ శుభ్రపరిచినప్పుడల్లా కాకుండా కనీసం సంవత్సరానికొకసారి అయినా ఈ హీట్ సింక్ పేస్టుని పెట్టుకోవాలి. ఇది మనకి చిన్న డబ్బా, ట్యూబు, చిన్న పాకెట్, సిరంజిలో లభిస్తుంది.

హీట్‌సింక్ కాంపౌండ్

డయాగ్నసిస్ టూల్:

మన కంప్యూటర్లో ఉన్న వివిధ పరికరాలలో సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఈ అధ్బుతమైన టూల్ ఉపయోగపడుతుంది. అల్టిమేట్ బూట్ సిడి అను ఈ టూల్ ని ఉపయోగించి హార్డ్ డిస్క్ డయాగ్నసిస్, రామ్‌ మరియు ప్రాససర్ ఇలా అన్ని పరికరాలను పరిక్షించవచ్చు.

అల్టిమేట్ బూట్ సిడి

ఆపరేటింగ్ సిస్టం :

మనం కంప్యూటర్ కొన్నప్పుడు వచ్చే ఆపరేటింగ్ సిస్టం సిడి లేదా మన సిస్టం యొక్క రికవరీ డిస్క్ తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఆ సిడి లేదా డీవీడీ మీ దగ్గర లేకపోతే ఉచితంగా దొరికే ఆపరేటింగ్ సిస్టం సిడి ఇమేజిని ఇక్కడ నుండి దింపుకోని సీడీలలో వ్రాసుకోవచ్చు. అవసరమయినప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు లేదా సీడీ నుండే లైవ్‌గా వాడుకోవచ్చు. ఈ లైవ్ సీడీని ఉపయోగించి సులభంగా పాడయిపోయిన సిస్టం నుండి డాటాని రికవరీ చెయ్యవచ్చు. ఈ లినక్స్ ఉచిత ఆపరేటింగ్ సిస్టం లను పెన్‌డ్రైవ్ నుండి కూడా ఇక్కడ చెప్పినట్లు తయారుచేసుకొని వాడుకోవచ్చు.

డెబియన్ సిడి
పెన్‌డ్రైవ్ లో ఉబుంటు

డ్రైవర్లకి పరిష్కారం:

 విండోస్ వాడేవారు తప్పక ఉంచుకోవలసిన సిడీ డ్రైవర్ పేక్ సొల్యూషన్ డివీడి. విండోస్ ఇన్‌స్టాల్ చేసిన తరువాత డైవర్ల గురించి వెతకనవసరం దీని ద్వారా మనం తప్పించుకోవచ్చు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.

తరచు కంప్యూటరు కొట్టు వాడికి డబ్బులు చదివించుకొని విసిగిపోయారా?

 మనం సాధారణంగా కంప్యూటర్ ఆన్ చేసి డెస్క్‌టాప్ రాగానే మన పనులు చేసుకొని పని అయిపోగానే తిరిగి కంప్యూటరును ఆపివేస్తాము. ప్రతిరోజు బాగానే ఆన్ అయినప్పటికి ఒకొక్కసారి కంప్యూటర్ ఆన్ కాకుండా సతాయిస్తు ఉంటుంది. దానితో మనం కంప్యూటరును దగ్గరలో ఉన్న కంప్యూటరు బాగుచేసే వాడి దగ్గరకు తీసుకొని వెళ్ళడం లేదా వాడినే ఇంటికి పిలిపించి బాగు చేయిస్తాము. సాధారణంగా కంప్యూటర్లు బాగుచేసే వాళ్ళు మన ముందు బాగు చేయడానికి ఇష్టపడరు. తరువాత రమ్మని చెప్పి పంపించి వేస్తుంటారు. సమస్య ఏదైనప్పటికి సాధారణంగా ఫార్మాటు చెయ్యాలి అని, చేసి తొందరగా మనకి డెస్క్‌టాప్ చూపించి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. లేదా అది పోయింది ఇది పోయిందని చెప్పి నిలువు దోపిడి చేస్తుంటారు. సాధారణంగా కంప్యూటరు బాగు చేయడానికి వచ్చే వాటిలో చాలా కంప్యూటర్లు చిన్న చిన్న సమస్యల కారణంగా వస్తుంటాయి. వాటిని మనం ఇంటి దగ్గరే మనమే పరిష్కరించుకోవచ్చు. మన తెలియని తనాన్ని వాడు సొమ్ము చేసుకుంటాడు. మనం కొంత ఆశక్తి చూపిస్తే అది గొప్ప విద్యేంకాదు. 
 వదులుగా ఉన్న కనెక్షన్‌ల వలన, సిపియు డబ్బాలో దుమ్ముచేరడం, ప్రాససర్ వేడెక్కడం, రామ్‌ సరిగా పెట్టకపోవడం, కరెంటు ఓల్టేజిలో హెచ్చుతగ్గులవల్ల, వైరస్ వలన సిస్టం పనితీరు మందగించడం, తరచు రీస్టార్ట్ అవడం, మనం పనిచేస్తున్నపుడు తరచు కరెంటు పోవడం వలన రామ్‌ పోవడం, హార్డ్‌డిస్క్ బ్యాడ్ సెక్టార్‌లు ఏర్పడడం వంటి సాధారణ సమస్యలు. అసలు సమస్య ఏమిటో తెలుసు కుంటే మనం సగం దోపిడినీ అడ్డుకున్నట్టే. నిజంగా ఏదైనా విడి బాగం పోతే సమస్య తెలిస్తే మనమే ఆ విడిబాగాన్ని నాణ్యమైన దానితో మార్చుకోవచ్చు. అదే కంప్యూటరు బాగు చేసేవాళ్ళయితే తక్కువ రకం  వాటిని అమర్చి ఎక్కువ డబ్బు తీసుకోవచ్చు. అందువలన మనకి సంబంధం లేని విషయం అయినప్పటికి తెలుసుకొని ఉంటే అత్యవసర సమయాల్లో చేతిచమురు వదలకుండా ఉండడమే కాకుండా ఇతరులకి కూడా సహాయం చేయవచ్చు. అంతేకాకుండా కొంత తెలిసినవాళ్ళ దగ్గర కంప్యూటరు కొట్టువాడు కూడా జాగ్రత్తగానే ఉంటాడు.  



 ఇలా కంప్యూటర్లలో తరచు వచ్చే సమస్యలు వాటికి పరిష్కారాలు మనం తరువాతి టపాలలో చూద్దాం.

ఫైర్‌ఫాక్స్ కొత్త రూపం

విండోస్,మాక్ మరియు ఉబుంటు లో ఫైర్‌ఫాక్స్ కొత్తరూపం ఆస్ట్రాలిస్

 సాధారణంగా ఫైర్‌ఫాక్స్ వాడుతున్నవారు వెర్షన్‌కి వెర్షన్‌కి రూపంలో పెద్దగా మార్పులు లేకపోవడం గమనించే ఉంటారు. నిజానికి ఫైర్‌ఫాక్స్ కొంత వెనకబడడానికి ఇది కూడా కొంత కారణం కావచ్చు. దానిని అధికమించడానికి తొదరలో మొజిల్లా ఫౌండేషన్ వారు కొత్త రూపంతో ఫైర్‌ఫాక్స్‌ని విడుదలచేయబోతున్నారు. ఈ కొత్త రూపం ఇప్పుడు ఎక్కువగా వాడుతున్న తాకేతెరలకు అనుగుణంగా ఆధునికంగా ఉండడమే కాకుండా ఆకర్షణీయంగాను ఉండబోతుంది. అభివృద్ది దశలో ఉన్న ఈ ఫైర్‌ఫాక్స్ కొత్త రూపాన్ని అస్ట్రాలిస్ గా వ్యవహరిస్తున్నారు. కొత్త రూపంతో ఉన్న ఫైర్‌ఫాక్స్ ని ఇప్పుడే ఇక్కడ నుండి దింపుకొని ప్రయత్నించవచ్చు. అస్ట్రాలిస్ యొక్క ఫీచర్లను రూపాన్ని క్రింది వీడియోలో చూడవచ్చు.

క్రెడిట్ కార్డు అంత చిన్న కంప్యూటర్

 కంప్యూటర్ వచ్చిన తొలిరోజులలో పెద్ద గది అంత ఉండేది. శాస్త్రవేత్తల కృషి ఫలితంగా క్రమంగా రూపు మార్చుకొంటూ చిన్నదవుతూ వచ్చింది. డెస్క్‌టాప్, లాప్‌టాప్ చివరకి అరచేతిలో పట్టే మొబైల్ ఫోన్ ఇలా చిన్నది తయారయింది. ఇప్పుడు మరింత చిన్నదిగా అంటే మనం వాడే క్రెడిట్/ఏటియం కార్డు పరిమాణంలో మారిపోయింది. అలా క్రెడిట్ కార్డు అంత ఉన్న కంప్యూటర్ పేరే రాస్ప్‌బెర్రి పై. 
యస్‌డి కార్డు ప్రక్కన రాస్ప్‌బెర్రి పై
 రాస్ప్‌బెర్రి పై ని కంప్యూటర్ సైన్స్ మూలాల గురించి తక్కువ ఖరీదులో పాఠశాలలలో బోధించడాన్ని ప్రోత్సహించడానికి ఇంగ్లాండు లో ఉన్న రాస్ప్‌బెర్రి పై ఫౌండేషన్ వారు తయారుచేసారు. దీనిని వాణిజ్య పరంగా తయారుచేసి అమ్మడానికి న్యూఆర్క్ ఎలిమెంట్ 14, ఆర్‌యస్ కాంపోనెంట్స్ మరియు ఇగొమెన్ అన్న సంస్థలకి అనుమతి గలదు. రాస్ప్‌బెర్రి పై లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి 25 డాలర్లు, ఇంకొకటి 35 డాలర్లు. ఆ సంస్థలు రాస్ప్‌బెర్రి పై ని తయారుచేసి ఆన్‌లైన్‌లో అమ్మకాలు కొనసాగిస్తారు.
 రాస్ప్‌బెర్రి పై లో క్రెడిట్ కార్డు పరిమాణం ఉన్న బోర్డులో కంప్యూటరుగా పనిచేయడానికి కావలసిన అన్ని పరికరాలు అమర్చినారు. దీనిలో 700 మెగా హెర్ట్‌జ్ ప్రాససర్, 250 మెగా హెర్ట్‌జ్ జిపియు, 256 లేదా 512 యంబి రామ్‌, ఒకటి లేదా రెండు యుయస్‌బి పోర్టులు, ఇథర్‌నెట్ పోర్టు, హెచ్‌డియమ్‌ఐ పోర్టు, 3.5 యమ్‌యమ్‌ జాక్, పవర్ కోసం ఒక మైక్రో యుయస్‌బి పోర్టు మరియు యస్‌డి కార్డు స్లాటు ఉన్న ఈ కంప్యూటరు 45 గ్రాములు ఉంటుంది. 
రాస్ప్‌బెర్రి పై మోడల్ బి నమూనా చిత్రం
 
  రాస్ప్‌బెర్రి పై లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి రాస్ప్‌బియన్ అను డెబియన్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉచితంగా అందిస్తున్నారు. రాస్ప్‌బియన్ కాకుండా ఈ చిన్ని కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వివిధ ఆపరేటింగ్ సిస్టంలు అందుబాటులో ఉన్నాయి. వాటికి ఇక్కడ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిలో మనం ఆపరేటింగ్ సిస్టమును యస్‌డి కార్డులో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.