కంప్యూటర్ వచ్చిన తొలిరోజులలో పెద్ద గది అంత ఉండేది. శాస్త్రవేత్తల కృషి ఫలితంగా క్రమంగా రూపు మార్చుకొంటూ చిన్నదవుతూ వచ్చింది. డెస్క్‌టాప్, లాప్‌టాప్ చివరకి అరచేతిలో పట్టే మొబైల్ ఫోన్ ఇలా చిన్నది తయారయింది. ఇప్పుడు మరింత చిన్నదిగా అంటే మనం వాడే క్రెడిట్/ఏటియం కార్డు పరిమాణంలో మారిపోయింది. అలా క్రెడిట్ కార్డు అంత ఉన్న కంప్యూటర్ పేరే రాస్ప్‌బెర్రి పై.
యస్‌డి కార్డు ప్రక్కన రాస్ప్‌బెర్రి పై |
రాస్ప్‌బెర్రి పై ని కంప్యూటర్ సైన్స్ మూలాల గురించి తక్కువ ఖరీదులో పాఠశాలలలో బోధించడాన్ని ప్రోత్సహించడానికి ఇంగ్లాండు లో ఉన్న రాస్ప్‌బెర్రి పై ఫౌండేషన్ వారు తయారుచేసారు. దీనిని వాణిజ్య పరంగా తయారుచేసి అమ్మడానికి న్యూఆర్క్ ఎలిమెంట్ 14, ఆర్‌యస్ కాంపోనెంట్స్ మరియు ఇగొమెన్ అన్న సంస్థలకి అనుమతి గలదు. రాస్ప్‌బెర్రి పై లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి 25 డాలర్లు, ఇంకొకటి 35 డాలర్లు. ఆ సంస్థలు రాస్ప్‌బెర్రి పై ని తయారుచేసి ఆన్‌లైన్‌లో అమ్మకాలు కొనసాగిస్తారు.
రాస్ప్‌బెర్రి పై లో క్రెడిట్ కార్డు పరిమాణం ఉన్న బోర్డులో కంప్యూటరుగా పనిచేయడానికి కావలసిన అన్ని పరికరాలు అమర్చినారు. దీనిలో 700 మెగా హెర్ట్‌జ్ ప్రాససర్, 250 మెగా హెర్ట్‌జ్ జిపియు, 256 లేదా 512 యంబి రామ్, ఒకటి లేదా రెండు యుయస్‌బి పోర్టులు, ఇథర్‌నెట్ పోర్టు, హెచ్‌డియమ్‌ఐ పోర్టు, 3.5 యమ్‌యమ్ జాక్, పవర్ కోసం ఒక మైక్రో యుయస్‌బి పోర్టు మరియు యస్‌డి కార్డు స్లాటు ఉన్న ఈ కంప్యూటరు 45 గ్రాములు ఉంటుంది.
రాస్ప్‌బెర్రి పై మోడల్ బి నమూనా చిత్రం |
రాస్ప్‌బెర్రి పై లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి రాస్ప్‌బియన్ అను డెబియన్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉచితంగా అందిస్తున్నారు. రాస్ప్‌బియన్ కాకుండా ఈ చిన్ని కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వివిధ ఆపరేటింగ్ సిస్టంలు అందుబాటులో ఉన్నాయి. వాటికి ఇక్కడ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిలో మనం ఆపరేటింగ్ సిస్టమును యస్‌డి కార్డులో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.