మన కంప్యూటర్లో కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు

      సాధారణంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఫోన్‌లు మరియు టాబ్లెట్లలో వస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కి అందుబాటులో ఉన్న అప్లికేషన్‌ల వలన ఆండీ, బ్లూస్టాక్ వంటి సాఫ్ట్వేర్లు ఉపయోగించి మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం లోనే మనకు కావలసిన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు నడుపుకోవచ్చు. మరొక విధానం ద్వారా వర్చువల్ బాక్స్ అను సాఫ్ట్వేర్‌ని ఉపయోగించి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ని వర్చువల్ ఆపరేటింగ్ సిస్టంగా మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం లోనే వాడుకోవచ్చు. ఈ పద్దతులన్ని మరొక ఆపరేటింగ్ సిస్టంపై ఆధారపడి పని చేస్తుంటాయి. అంటే ఇవి పని చేయడానికి మన కంప్యూటరులో అప్పటికే మరొక ఆపరేటింగ్ సిస్టం పని చేస్తుండాలి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న పద్దతి ద్వారా మనం విండోస్ లేదా లినక్స్ ఆపరేటింగ్ సిస్టం మనం ఎలా అయితే మన కంప్యూటరులో ఇన్‌స్టాల్ చేసుకుంటామో అదేవిధంగా (మరొక ఆపరేటింగ్ సిస్టం పై ఆధారపడకుండా) ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 
       మొబైళ్ళు మరియు టాబ్లెట్లలో వాడబడుతున్న ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంని లాప్‌టాప్ మరియు డెస్క్‌టాప్ కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వీలుగా తయారుచేసారు. ఇది ఒపెన్ సోర్స్ఆపరేటింగ్ సిస్టం. దీనిని ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ ప్రాజెక్ట్ నుండి కోడ్‌ని తీసుకొని ఆండ్రాయిడ్ -x86గా పోర్ట్ చేసారు. ఇది కూడా ఒపెన్ సోర్స్ఆపరేటింగ్ సిస్టం.

లాప్‌టాప్‌లో నేరుగా ఇన్‌స్టాల్ చెయ్యబడిన ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం
  

           ఈ ఆండ్రాయిడ్ -x86 ఆపరేటింగ్ సిస్టంని క్రింది లంకె నుండి ఉచితంగా దింపుకోవచ్చు. 
       దింపుకున్న ఇమేజి ఫైల్ ని యూనెట్‌బూటిన్ మరియు లినక్స్ లైవ్ యూయస్‌బి క్రియేటర్ వంటి సాఫ్ట్‌వేర్లని ఉపయోగించి ఇన్‌స్టాలేషన్‌ డిస్క్‌ని తయారుచేసుకోవచ్చు లేదా సీడీలోకి వ్రాసుకొని ఆపరేటింగ్ సిస్టంను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీనిని వేరొక ఆపరేటింగ్ సిస్టం తొ డ్యూయల్ బూట్ గా కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

మీ కంప్యూటరులో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టంలు వాడుతున్నారా?

  
  • విండోస్ యొక్క రిఈన్‌స్టాల్ డిస్క్ మరియు ఆపరేటింగ్ సిస్టం అలాగే మన ఫైళ్ళు బ్యాకప్ తీసుకున్న తరువాత మాత్రమే ప్రయత్నించవలసి ఉంటుంది. 
  • విండోస్ లో ఉండగా ఉబుంటు, ఉబుంటులో ఉండగా విండోస్ ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్ లను మనం తొలగించడం లేదా మార్చడంచేయకుడదు. దానివలన రెండు ఆపరేటింగ్ సిస్టంలు పనిచేయకుండా పోతాయి.  
  • విండోస్‌లో కనిపించని రికవరీ మరియు తయారీదారుకి సంభందించిన పార్టీషియన్‌లు ఉబుంటులో కనిపించినప్పటికి మనం వాటిలోని పైళ్ళను మార్చడం కాని డ్రైవ్ ని తొలగించడం కాని చేయరాదు. 
  • ఉచిత ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ముందే విండోస్ అప్‌డేట్లు అన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది.
  • ఒకొకసారి విండోస్ అప్‌డేట్ అయిన తరువాత ఉబుంటు అసలు కనిపించకుండా పోతుంది. అటువంటప్పుడు మనం ఉబుంటు లైవ్ డిస్క్ ని ఉపయోగించి మనం మునుపటిలా ఉబుంటు మరియు విండోస్ 8 డ్యూయల్ బూట్ అయ్యేవిధంగా చేసుకోవచ్చు.
  • పొరపాటు జరిగి రెండుఆపరేటింగ్ సిస్టంలు బూట్ కానప్పటికి కంగారుపడి తిరిగి ఇన్‌స్టాల్ చెయ్యకండి. రెండిటిని కూడా యధాస్థితిలో రికవరీ చేయ్యడానికి మనకి నెట్‌లో పలు ఉపాయాలు దొరుకుతాయి. 

మీ కొత్త లినొవొ లాప్‌టాప్‌లో ఇతర ఆపరేటింగ్ సిస్టంలు ఇన్‌స్టాల్ కావట్లేదా?

                    ఇప్పుడు కొత్తగా వస్తున్న లినొవొ లాప్‌టాప్‌లో మరొక ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేయడం వీలుకాకుండా ఉండడమే కాకుండా లైవ్‌ సిడి కూడా పనిచేయట్లేదు. అంతేకాకుండా సిస్టం ఆన్ చేయగానే నేరుగా విండోస్‌ లోకి వెళ్ళిపోతుంది. కనీసం బయోస్ సెట్టింగ్స్ లోకి వెళ్లడానికి మరియు బూట్ డివైజ్ ని ఎంచుకోవడానికి కూడా మనకి ఆప్షన్లు కనిపించవు. మరి అటువంటప్పుడు మనం ఏవిధంగా మనకు కావలసిన ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవాలి అదేవిధంగా విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలు కలిపి డ్యుయల్ బూట్‌గా ఎలా ఇంస్టాల్ చేసుకోవాలి. 
                
ఉబుంటు ఇన్‌స్టాల్ చేయబడిన లినొవొ లాప్‌టాప్
                   
                      మొదట మనం మన లాప్‌టాప్ బయోస్ సెటప్ లోకి వెళ్ళాలి. అది ఎలాగంటే లాప్‌టాప్ ని షట్‌డౌన్ చేసి తరువాత పవర్ బటన్ ప్రక్కన ఉన్న వన్ టచ్ రికవరీకీని పది సెకన్లు వత్తి పట్టుకొని వదిలివేయాలి.
                        
                     అప్పుడు మనకి తెరమీద క్రింది చిత్రంలో వలే బయోస్ సెటప్‌కి వెళ్ళడానికి మరియు బూట్‌ డివైజ్ ఎంచుకోవడానికి ఆప్షన్‌లు కనిపిస్తాయి.
                    
                                 ఇప్పుడు మనం బూట్ మెనూలోకి వెళ్ళి ఏదైనా లినక్స్ లైవ్ ఆపరేటింగ్ సిస్టం ప్రయత్నించడానికి ముందు బయోస్ సెటప్ లోనికి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ టాబ్‌లో ఉన్న సెక్యూర్‌బూట్ అన్న ఆప్షన్‌ని డిసేబుల్ చెయ్యలి. 

     
                 సెక్యూర్ బూట్ డిసేబుల్ చేసిన తరువాత మన కంప్యూటరులో వివిధ ఉచిత ఆపరేటింగ్ సిస్టముల లైవ్ డిస్కులు మామూలుగా ఎప్పటిలాగే పనిచేస్తాయి. కాని అన్ని ఆపరేటింగ్ సిస్టములు ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కుదరదు, కేవలం యుఇఐయఫ్ బూట్‌ని సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టంలు మాత్రమే ఇన్‌స్టాల్ అవుతాయి. ఉబుంటు 64 బిట్ వంటి కొన్ని ఆపరేటింగ్ సిస్టములు మాత్రం సెక్యూర్ బూట్ అనేబుల్ చేసి ఉన్నప్పటికి లైవ్ డిస్క్ పనిచేయడమే కాకుండా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. మనం ఉబుంటు 32 బిట్ మరియు మిగిలిన ఏదైనా ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే మనం తప్పనిసరిగా బయోస్ సెటప్ లో బూట్ టాబ్ లో ఉన్న యుఇఐయఫ్ బూట్‌ని లెగసిగా మార్చవలసి ఉంటుంది.
 
                            కానీ లెగసీ సపోర్ట్ అనేబుల్ చేసిఉన్నపుడు మిగిలిన అన్ని ఆపరేటింగ్ సిస్టంలు బాగానే పనిచేస్తున్నప్పటికి లినొవొ లాప్‌టాప్‌లో విండోస్ 8 బూటింగ్ సమస్య వస్తుంది కనుక ఉచిత ఆపరేటింగ్ సిస్టంతో పాటు విండోస్ 8 కూడా వాడుకోవాలనుకునేవారు తప్పని సరిగా యుఇఐయఫ్ బూట్‌ని సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టం అయిన ఉబుంటు64 బిట్ ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. మనం ఉబుంటు ఇన్‌స్టాల్ చేసిన తరువాత మనకి ఈవిధంగా కంప్యూటరు ఆన్ చేయగానే బూట్ మెను కనిపిస్తుంది. మనకు కావలసిన ఆపరేటింగ్ సిస్టంని ఎంచుకోవడం ద్యారా మనం ఉబుంటు లేదా విండోస్ లోకి బూట్ కావచ్చు. మన ఫైళ్ళని రెండు ఆపరేటింగ్ సిస్టంలలో నుండి వాడుకోవచ్చు.

మీరు కూడా సులభంగా కంప్యూటర్ ట్యుటోరియళ్ళు తయారుచేయవచ్చు

                 మనం సాధారణంగా కంప్యూటరు లేదా వివిధ సాఫ్ట్‌వేర్ల గురించి నెట్ లో అందుబాటులో ఉన్న ట్యుటోరియళ్ళను చూసి తెలుసుకుంటాము. మొదట్లో వివరణాత్మక వ్యాసాల రూపంలోను తరువాత చిత్రాలతొ కూడిన వ్యాసాల రూపంలోను ఈ ట్యుటోరియళ్ళు ఉండేవి. కొంతకాలంగా మనకి నెట్లో ఎక్కువగా వీడియో ట్యుటోరియళ్ళు అందుబాటులోకి వచ్చాయి. అవి వ్యాసరూపంలో ఉన్న వాటికన్నా ఎక్కువగా ఆదరణ పొందాయి దానికి కారణం అవి ఎటువంటి పరిజ్ఞానం లేనివారికి కూడా సులభంగా అర్ధం కావడమే. 
                     వీడియో ట్యుటోరియళ్ళు పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే ఎవరైనా సులభంగా తయారు చేయవచ్చు. మనం కంప్యూటర్లో చేస్తున్న పనిని రికార్డ్ చేస్తూ దానికి తగిన వాఖ్యానాన్ని జోడిస్తే చాలు వీడియో ట్యుటోరియల్ పూర్తి అయినట్లే. మన కంప్యూటరు తెరని చిత్రీకరిస్తూ మన మాటలను రికార్డు చేయడానికి మనకి అందుబాటులో ఉన్న ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ కామ్‌ స్టూడియో. ఉచితంగా లభించే ఈ సాఫ్ట్‌వేరు కంప్యూటరు నిపూణులకి, ఒత్సాహిక బ్లాగర్లకి, ఉపాధ్యాయులకి మరియు విద్యార్ధులకి ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. 


                        తక్కువ పరిమాణం కలిగి తక్కువ కంప్యూటరు వనరులని వాడుకుంటూ పనిచేసే కామ్‌ స్టూడియోని ఉపయోగించి విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న కంప్యూటర్లలో మనం వివిధ సాఫ్ట్‌వేర్, ఇంటర్ నెట్ మరియు కంప్యూటరు చిట్కాలను రికార్డ్ చేయవచ్చు. రికార్డ్ చేయబడిన వీడియోలు మంచి నాణ్యతతో కూడి ఉండడమే కాకుండా వీడియో షేరింగ్ సైట్లలో  అప్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా తక్కువ పరిమాణం తో ఉండడం కూడా దీని ప్రత్యేకత. అంతేకాకుండా తక్కువ పరిజ్ఞానం కలవారు వాడుకోవడానికి వీలుగా సరళంగా ఉంటూనే నిపూణులకి కోసం వివిధ ఆప్షన్‌లు దీని సొంతం.
 

కామ్‌స్టూడియోని క్రింది నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
                            http://camstudio.org/                                                                     

మొట్టమొదటి తెలుగు మొబైల్ వెబ్ బ్రౌజర్

      ఇప్పుడు వస్తున్న కొత్త ఫోన్‌లలో అన్ని మొబైల్ వెబ్ బ్రౌజర్‌లలో తెలుగు సరిగానే కనిపిస్తుంది. దీనికి కారణం ఆండ్రాయిడ్ 4.2.2 వెర్షనులో తెలుగు ఫాంట్‌ ఉండడం. 4.2.2 తరువాత వస్తున్న వెర్షన్‌లలో కూడా తెలుగు బాగానే కనిపిస్తుంది. తక్కువ ధరలో లభిస్తున్న ఫోన్‌లలో కూడా ఇప్పుడు 4.2.2 లేదా తరువాతి వెర్షన్‌లు ఉండడం మనం గమనించవచ్చు. పాత ఫోన్‌లలో ఇప్పటికి తెలుగు చూడాలంటే తయారీదారు ఫాంటు ఇవ్వడంకాని మనం రూట్ చేసుకొని ఫాంట్ ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. 
         ఇప్పుడు తెలుగులో మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ రాబోతుంది. మనం ఫైర్‌ఫాక్స్ డెస్క్‌టాప్ బ్రౌజర్‌ని గమనిస్తే మనకు వివిధ భాషలలో అందుబాటులో ఉంది. అలాగే ఆండ్రాయిడ్ ఫైర్‌ఫాక్స్ కూడా ఇప్పుడు తెలుగుతో సహా పలుభాషలలో రాబోతుంది. అయితే విడుదలకు ముందే మనం ఇప్పుడే వాడుకోవచ్చు. అభివృద్ది దశలో ఉన్న ఈ వెర్షనును అరోరా అంటారు. దీనిని ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ apk ఫైల్‌ని మనం ఆండ్రాయిడ్ ఫోన్‌లు మొబైళ్ళలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలుంటే మొజిల్లా వారికి ఇక్కడ చెప్పినట్లు నివేదించడం ద్వారా మంచి విడుదలకు మనం కూడా సహాయపడవచ్చు. మరింకెందుకు ఆలస్యం తెలుగు భాషాభిమానులారా మీ వంతు సహాయం చెయ్యండి. మొదటి తెలుగుమొబైల్ వెబ్ బ్రౌజర్ స్క్రీన్‌షాట్లు క్రింద చూడండి.