రాష్ట్ర విభజన - యక్స్‌పి సపోర్ట్ నిలిపివేత

 యక్స్‌పి సపోర్ట్ నిలిపివేయబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ సుమారు రెండు సంవత్సరాల క్రితమే ప్రకటించింది. దానికి అనుగుణంగా అప్పటి నుండి ప్రజలను ప్రత్యామ్నాయాల వైపు మళ్ళించడానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తూనే ఉంది. ఇప్పటికే చాలా సంస్థలు, ప్రజలు ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు. అయినప్పటికి ఇప్పటికి చాలా మంది యక్స్‌పిని వాడుతున్నారు. వారిలో సాధారణ ప్రజలే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. వారు ఆదిశగా చర్యలను తీసుకుంటున్నట్లు ఏ పత్రికలోను రాలేదు. బహుషా వారు ఇప్పటికే యక్స్‌పి తరువాతి వెర్షన్‌లతో వచ్చే కంప్యూటర్లను కొనడానికి గుత్తేదారులను సిద్దం చేసుకొనే ఉండవచ్చు. టెండర్ల రూపం లో ప్రజాధనాన్ని అయినవారికి దోచిపెట్టే పందేరం మొదలైపోయి ఉండొచ్చు. మన ప్రక్క రాష్ట్రం తమిళనాడు విషయానికొస్తే ఆ ప్రభుత్వం యక్స్‌పి సపోర్ట్ నిలిచిపోతున్న సందర్భంగా వివిధ శాఖలను ఉచితంగా లభించే ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్టం లను వాడమని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.
 ఇక మన రాష్ట్రాని కొస్తే రాష్ట్ర విభజన నేపధ్యంలో యక్స్‌పి సపోర్ట్ నిలిచిపోవడం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లే ముఖ్యంగా నిర్మాణం కావలసిన సీమాంధ్ర ప్రాంతం. మనం ఇక్కడ సరిగా ఆలోచిస్తే విభజన నేపధ్యంలో అన్ని శాఖలు పునర్‌వ్యవస్థికరణ జరగనుండడం, యక్స్‌పి సపోర్ట్ నిలిపివేయడం ఒకేసారి రావడం వలన మన రాష్ట్రాలకి మంచి అవకాశం వచ్చినట్లే. ఇప్పుడు ఉన్న కంప్యూటర్లలో యక్స్‌పికి బదులుగా మరో ఆపరేటింగ్ సిస్టంను కొనుగోలు చేయడం, తక్కువ సామర్ధ్యం గల కంప్యూటర్లని తొలగించి వాటి స్థానంలో ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న కొత్త కంప్యూటర్లను కొనుగోలు చేయడం వంటి ఖరీదైన ప్రయామ్నాయాలతో పాటు ఉన్న కంప్యూటర్లలోనే ఉచితంగా లభించే ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలు మరియు సాఫ్ట్‌వేర్లను వాడుకోవడం వంటి ఉచిత ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉంది. విభజన నేపధ్యంలో నిధుల కొరత రెండు ప్రాంతాలలోను తప్పదు. మన ప్రభుత్వం ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్లను వాడుకలోకి తీసుకువచ్చి విలువైన ప్రజాధనాన్ని ఆధా చేసినచో ఆ నిధులను నిర్మాణ,పునర్‌నిర్మాణ పనులకి కేటాయించుకోవచ్చు. 
 ప్రభుత్వానికి మంచి అవకాశం ఉన్నట్లే ఇప్పుడు ప్రజలకి కూడా ఎన్నికల రూపంలో మంచి అవకాశం వచ్చింది. ప్రజాధనాన్ని స్వాహా చేసే నాయకులను కాకుండా ప్రజాధనాన్ని కాపు కాసే నేతలను ఎన్నుకోవలసిన అవసరం ఉంది. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కనుక ఆలోచించి మానసిక, భౌతిక ప్రలోభాలకు గురి కాకుండా సరైన నిర్ణయం తీసుకోవాలి.

యక్స్‌పిని ఎందుకు సమాధి కట్టి సంతాపం?

 ఏ వార్తా పత్రిక చూసినా యక్స్‌పి ఇక లేదు, యక్స్‌పికి సెలవు, సపోర్ట్ నిలిపివేత అని సంచలనాత్మక వార్తలు. సామాజిక అనుసంధాన వేదికలలో (పేస్‌బుక్,గూగుల్+,ట్విట్టర్ మొదలైన వాటిలో) అయితే మరి విపరీతంగా సమాధి కట్టి సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ ప్రచారం వెనుక అసలు కారణాలు, వచ్చే సమస్యలు, తాత్కాలిక మరియు శాశ్వత పరిష్కారాలు మనం ఈ రోజు తెలుసుకోవలసిందే.

యక్స్‌పికి మైక్రోసాఫ్ట్ సపోర్ట్ నిలిపివేయడంతో పేస్‌బుక్‌లో ప్రచారంలో ఉన్న ఒక చిత్రం

 యక్స్‌పి ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం. దాని తయారీదారు అయిన మైక్రోసాఫ్ట్ వాడు అధికారికంగా సపోర్ట్ నిలిపివేయడం వలన దానికి ఉన్న ప్రాచుర్యం మరియు ఆదరణ కారణంగా ఈ విధంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. అంటే ఇక నుండి మైక్రోసాఫ్ట్ నుండి దానికి సెక్యూరిటీ అప్‌డేట్స్ రావన్నమాట. దానివలన సగటు కంప్యూటరు వాడుకరికి వచ్చే ఇబ్బంది ఏమిటి? మనకు కనిపించే కధనాలలో అయితే బధ్రత మరియు కొత్త ఫీచర్లు దానికి కారణంగా చెపుతున్నారు. మన శ్రేయస్సుకోరి ఈవిధంగా ప్రచారం జరుగుతుందా? లేక మనల్ని బయభ్రాంతులకి గురిచేసి మరో ఆపరేటింగ్ సిస్టం లేదా మరో ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న లాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కొనుక్కోనే  దిశగా మనల్ని తయారుచేయడానికా?
 చిన్నారి పొన్నారి యక్స్‌పి నిన్నెవరు చంపారమ్మా అని యక్స్‌పిని అడిగితే అది కచ్చితంగా మైక్రో సాఫ్ట్ వాడు నన్ను చంపాడు, కంప్యూటరు తయారీదారులు నా పీక నొక్కారని అంటుందేమో. ఎందుకంటే సాంకేతికంగా యక్స్‌పి కి ఇప్పుడు సపోర్ట్ నిలిపివేసి ఉండవచ్చు, కాని మనం కొన్ని విషయాలు గమనిస్తే మనకి ఎప్పుడో నిలిపివేసినట్లు అర్ధమవుతుంది. మైక్రోసాఫ్ట్ వాడి ఆస్థాన వెబ్ బ్రౌసర్, ఆఫీస్, మీడియా ప్లేయర్, ఇ మెయిల్ క్లయింట్ మరియు వివిధ సాఫ్ట్వేర్లకి వాటి కొత్త వెర్షన్‌లను యక్స్‌పికి విడుదలచేయడం ఎప్పుడో నిలిపివేసింది. అదేవిధంగా మనం కంప్యూటరు తయారీదారు వేబ్ సైటులో యక్స్‌పికి డ్రైవర్ల గురించి వెతికితే యక్స్‌పి తరువాతి ఆపరేటింగ్ సిస్టంలకు దొరుకుతాయి, కాని యక్స్‌పికి దొరకవు. అదేవిధంగా ఎప్పటి నుండో యక్స్‌పితో కంప్యూటర్లు అమ్మడంలేదు. యక్స్‌పికి మైక్రోసాఫ్ట్ సేవలు ఇప్పటికే క్రమక్రమంగా ఎప్పుడో నిలిపివేసింది. కొత్తగా నిలిపివేయడానికి ఏమిలేదు. ఇప్పటి యక్స్‌పి వాడుకర్లు ఎక్కువ మంది ఉండడం వలన మిగిలిన సాఫ్ట్వేర్ తయారీదారులు వారివారి సాఫ్ట్వేర్లను విడుదలచేస్తూనే ఉన్నారు. కేవలం మైక్రోసాఫ్ట్ మరియు కంప్యూటరు తయారీదారులు ఇరువురు పరస్పర సహకారంతో మనల్ని మరో కంప్యూటరు లేదా మరో ఆపరేటింగ్ సిస్టం కొనుగోలు చేయించడానికి సిద్దం చేస్తున్నారు. ఇక్కడ మనం వాళ్ళను తప్పుపట్టనవసరం లేదు ఎందుకంటే వాళ్ళు వ్యాపారులే కాని స్వచ్చంధ సంస్థలేమీ కాదుకదా.

సపోర్ట్ నిలిపివేయడం వలన మరి ఎవరికి నష్టం?

ఎవరైతే డబ్బులు పెట్టి యక్స్‌పిని కొనుక్కొని ఇప్పటికి దాని మీద ఆధారపడ్డారో వాళ్ళకి మాత్రమే. 

మరి ఈ ప్రచారం వలన ఎవరికి లాభం?

మైక్రోసాఫ్ట్ మరియు కంప్యూటరు తయారీదారులకి

   పెద్దపెద్ద కంపెనీలు యక్స్‌పి నుండి మరొక ఆపరేటింగ్ సిస్టం కు వెళ్ళడానికి పూర్తిగా కంప్యూటర్లని మార్చవలసి రావడంతో ఖర్చుకి వెనకాడి మైక్రోసాఫ్ట్ నుండి యక్స్‌పికి డబ్బులిచ్చి సపోర్ట్ని కొనుక్కోవడానికి సిద్దపడ్డాయి. ముందుచూపు గల కొన్ని సంస్థలయితే ఇప్పటికే ఉచిత సాఫ్ట్‌వేర్లను వాడడం ఉద్యోగులకి అలవాటు చేసాయి.  డబ్బున్న సంస్థలయితే ఇప్పటికే వేరే ఆపరేటింగ్ సిస్టంతో కొత్త కంప్యూటర్లను కొనుక్కున్నాయి. గూగులోడయితే తెలివిగా ముందునుండే ఉచిత ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నాడు. అయితే మరి సగటు యక్స్‌పి వాడుకరి పరిస్థితి ఏమిటి? తప్పని సరిగా వేరే ఆపరేటింగ్ సిస్టం లేదా కొత్త ఆపరేటింగ్ సిస్టం పనిచేసే కంప్యూటరు కొనుక్కోవలసిందేనా?
 అవసరం లేదు. యక్స్‌పి మునుపటిలాగే పనిచేస్తుంది. కొంపలేం అంటుకోవు, మనం బేషుగ్గా వాడుకోవచ్చు. బద్రతా కారణాలరీత్యా యక్స్‌పి ఎప్పుడో బలహీనమయిపోయింది. కొత్తగా అప్‌డేట్స్ రాకపోవడం వలన మనం కోల్పోవడానికి ఏమిలేదు. మనం చేయ్యాల్సిందల్లా మనం ఇప్పటిలాగే మన కంప్యూటరును మంచి యాంటీవైరస్ తో తరచు స్కాన్ చేసుకోవడం,ఆ యాంటివైరస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, నమ్మకం కలిగిన సైట్లనుండి మాత్రమే సాఫ్ట్‌వేర్లను డౌన్‌లోడ్ చేసుకోవడం, పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు ముందు తప్పక స్కాన్ చేసి తెరవడం వంటి ప్రాధమిక విషయాలు పాటించడం ద్వారా మనం ఎప్పుడూ వాడుక్కున్నట్లే వాడుకోవచ్చు. ఈ ప్రచారం అంతా మన జేబు చిల్లు పెట్టదానికే. ఒకవేళ మనం వేరే ఆపరేటింగ్ సిస్టం కొన్నామనుకోండి రాబోవు రోజుల్లో దానికి కూడా సపోర్ట్ నిలిపివేస్తాడు కదా? మరి దానికి శాశ్వత పరిషారం లేదా?
 లేకేం మనం మారడానికి సిద్దంగా ఉంటే మనకి ఉచితంగా ఎన్నో మార్గాలున్నాయి. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటరులోనే వాడుకోవడానికి ఎటువంటి ఖర్చు పెట్టనవసరం లేకుండానే దొరికే ఉచిత ఆపరేటింగ్ సిస్టం లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. మొదట కంప్యూటరు అంటే యక్స్‌పి లేదా విండోస్ అన్న బావన నుండి మనం బయటపడితే చాలు.
 ఇప్పటికే ఉచిత సాఫ్ట్వేర్ల దెబ్బకి పలు సాఫ్ట్వేర్ల ధరలు తగ్గడం మనం చూసాం. ఈ విధంగా మనం ఉచిత సాఫ్ట్వేర్లను వాడితే తొదరలోనే మైక్రోసాఫ్ట్ నుండి కూడా ఉచిత ఆపరేటింగ్ సిస్టం మనం చూడగలం.

పాత కంప్యూటరు హార్డ్‌డిస్కును ఇలా సద్వినియోగించుకోండి

 మన వద్దనున్న పాత డెస్క్‌టాప్ కంప్యూటర్ లేదా లాప్‌టాప్ యొక్క హార్డ్‌డిస్క్‌ను ఎలా ఎటువంటి నైపుణ్యం లేకుండానే సులువుగా తక్కువ ఖర్చుతో పెన్‌డ్రైవ్ మరియు ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్ లా వాడుకోవడానికి అనువుగా మార్చుకొని ఎలా సద్వినియోగపరుచు కోవచ్చునో ఈ వీడియోలో చూడవచ్చును. ఈ పద్దతి ద్వారా పాక్షికంగా పాడయిపోయిన అంటే మన కంప్యూటరు గుర్తించని, ఒకవేళ గుర్తించినప్పటికి ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసేటప్పుడు సమస్యలు వచ్చేటువంటి కొన్ని హార్డ్‌డిస్కులు కూడా ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్కుగా బ్రహ్మాండంగా పనిచేయడం విశేషం. ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర పనిచేయని హార్డ్‌డిస్కులని ఈ వీడియోలో చూపించినట్లు పరిక్షించుకోండి.

మంచి డాక్టర్‌ని వెతికి సులభంగా అపాయింట్‌మెంట్ పొందండిలా!

 మహానగరాల్లో మంచి వైద్యులను గుర్తించడం కత్తిమీద సామే. మంచి వైద్యులను గుర్తించి మనకు వీలున్న సమయంలో అపాయింట్‌మెంట్ పొందడం కూడా ప్రయాసతో కూడిన పనే. అదే మన నగరంలో ఉన్న ఆసుపత్రుల మరియు వైద్యుల సమాచారం మనకి ఒకేచోట ఉంచి వారి అపాయింట్‌మెంట్ కూడా సులభంగా లభించేటట్లు ఉచిత సేవ అందుబాటులో ఉంటే బాగుంటుంది కదూ. హైదరాబాదు, డిల్లీ, ముంబాయి మరియు బెంగళూరు వంటి మహానగారాల్లో ప్రముఖులైన వైద్యులను, ఆసుపత్రులను గురించిన సమాచారం ఒక చోట ఉంచి, సులభంగా వారి అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి మనకి డాక్‌సజెస్ట్ అను వెబ్ సైటు ఉపయోగపడుతుంది. ఇక్కడ 13686 డాక్టర్ల మరియు 4627 ఆసుపత్రుల సమాచారం మనకి అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనం సమస్య లేదా డాక్టర్ ఆధారంగా మరియు మనం ఉన్న ప్రదేశానికి దగ్గరగా ఉన్న వారిగురించి వెతకవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యమైనది డాక్టర్ల గురించి మనలాంటి వారి రివ్యూలు అందుబాటులో ఉంచడం. వాటిని ఆధారంగాచేసుకొని మనం సరైన వైద్యుడిని ఎంచుకోవడం సులభమవుతుంది. మనం డాక్టరు అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి గూగుల్ లేదా ఫేస్‌బుక్ అకౌంట్ ఉపయోగించుకోవచ్చు లేదా రిజిస్టరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి మనం డాక్టరు అపాయింట్‌మెంట్ తీసుకోగానే మనకి ఒక మెసేజ్ వస్తుంది. ఆ తరువాత మనకి ఫోన్‌ చేసి మనకి, డాక్టరుకి  అందుబాటులో ఉన్న సమయంలో అపాయింట్‌మెంట్ కుదురుస్తారు. అలాగే ఈ సైటులో వివిధ ఆసుపత్రులలో ఉన్న హెల్థ్ ప్యాకేజిలు, వాటివివరాలు, ధరలు వాటిగురించి ప్రజల అభిప్రాయాలు అందుబాటులో ఉండడం వలన మనకి ఎంపిక కూడా సులభమవుతుంది.


మీ కంప్యూటర్‌కి సౌండ్ డ్రైవర్లు దొరక్కపోతే

  ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆపరేటింగ్ సిస్టములకి మీ కంప్యూటరు యొక్క సౌండ్ డివైజ్ పనిచేయకపోతే లేదా వాటికి సంబందించిన ఆడియో డ్రైవర్లు దొరక్కపోతే మొదట క్రింది లంకెలో చెప్పిన విధంగా డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ పయత్నించండి.

http://spveerapaneni.blogspot.in/2013/09/blog-post_7.html

అయినప్పటికి  సౌండ్ డ్రైవర్లు దొరక్కపోతే అందుబాటులో ఉన్న మిగతా ప్రత్యామ్నాయాలను ఈవీడియోలో చూడవచ్చు.