తెలుగు వీర లేవరా..

 ఏ దేశమేగినా,ఎందు కాలిడినా మన తెలుగువారు లేని ప్రదేశము లేదంటే అతిశయోక్తి కాదేమో.జీవన అవకాశాల కోసం వివిధ దేశాలకు వెళ్ళి,వెళ్ళిన చోట తమ కష్టించే తత్వం మరియు ప్రతిభా పాటవాలతో అనతి కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో తెలుగు వారికి సాటి లేదు.ఈరోజుల్లో ప్రపంచంలో ప్రసిధ్ధి చెందిన ఏ ప్రాజెక్టును తీసుకున్నా వాటిలో తెలుగు వారి పాత్ర లేని ప్రాజెక్టు మనకు కనిపించదు.అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కూడా మన వారు ఎన్నో ఉన్నత శిఖరాలని అధిరోహించినారు.మన వారు తయారు చేసిన సాఫ్ట్వేర్లు,వారి సేవలు లేని దేశాలు బహుషా లేకపోవచ్చు.ఇన్ని విశిష్టతలు గల మనం స్వేచ్చా సాఫ్ట్వేర్ల వినియోగం మరియు వాటి అభివృధ్ధిలో గణనీయంగా వెనకబడి ఉన్నాం అని చెప్పడంలో సంధేహం లేదు.ఎందుకో మనలో స్వేచ్చా,ఉచిత సాఫ్ట్వేర్లంటే కొంత చిన్న చూపు ఉందని అనిపిస్తుంది.సమాజం కొరకు సమాజమే సాఫ్ట్వేర్లు తయారు చేసుకొని తిరిగిసమాజమే వాటిని ఉచితంగా వాడుకోవడం వలన ప్రజల,ప్రభుత్వాల సొమ్ము ఎంత ఆదా అవుతుంది.ఒక్క కేరళ లోనే కేవలం పాఠశాలల విషయం లోనే స్వేచ్చా,ఉచిత సాఫ్ట్వేర్లు వాడడం వలన కొన్ని కోట్ల విలువైన ప్రజాధనం ఆదా అయితే ఇక పూర్తి భారతదేశం విషయానికి వస్తే మరెంత ఆదా అవుతుంది.కేవలం అవగాహన లేకపోవడం వలన చాలా మంది వ్యక్తిగత ధనం కూడా వృధా చేసుకుంటున్నారు. నిధానంగా సాగుతున్న  స్వేచ్చా,ఉచిత సాఫ్ట్వేర్ల అభివృద్ధి తెలుగువారి ప్రవేశంతో వేగవంతమవుతుందని నా బలమైన నమ్మకం.కనుక తెలుగు సాఫ్ట్వేర్ వీరులారా సొంత లాభం కొంత మానుకోకుండా కొంత సమయం మాత్రమే కేటాయించి సరికొత్త సాఫ్ట్వేర్ విప్లవంలో మీరుకూడా పాలుపంచుకోండి.

ఇది మన సంగతి

 మన రాష్ట్రంలో ప్రభుత్వం కంప్యూటర్ విధ్యను వాణిజ్య సాఫ్ట్వేర్లతో అందిస్తుంది. ఒక కంప్యూటర్‌ను కొనటానికయ్యే ఖర్చుతో సమాంతరంగా సాఫ్ట్వేర్ కొనటానికి కూడా ఖర్చు కావడం వలన ప్రభుత్వ వ్యయంలో సగానికి సగం కేవలం సాఫ్ట్వేర్ కొనటానికి ఖర్చవుతున్నది. ఇలా సాఫ్ట్వేర్ల కోసం కోట్ల విలువైన ప్రజాధనం వృధా అవుతుంది. వీటి నిర్వహణను కొందరు గుత్తేదారులకు అప్పగించి వారికి డబ్బును చెల్లిస్తున్నది. అక్కడ టీచర్లుగా పని చేస్తున్న వారికి జీత బత్యాలు సైతం సరిగా ఇవ్వట్లేదు, ఇస్తున్నవి కూడా మరీ తక్కువగా ఉన్నాయి. అందువలన వారు తరచుగా సమ్మె చేయడం కూడా జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా వాణిజ్య సాఫ్ట్వేర్ల స్థానంలో స్వేచ్ఛా సాఫ్ట్వేర్లను ఉపయోగించి విలువైన ప్రజాధనం వృధా కాకుండా చేయవచ్చు. సాఫ్ట్వేర్ల కొరకు ఖర్చు చేస్తున్న  కోట్లాది రూపాయిల వ్యయాన్ని ఉపాధి కల్పనకు కంప్యుటర్ టీచర్ల జీత భత్యాలకొరకు ఖర్చు చేస్తే బాగుంటుంది. ఈ పద్దతిని అభివృద్ది చెందిన దేశాలైన జర్మనీ,ఫ్రాన్సు, అభివృద్ది చెందుతున్న దేశాలయిన బ్రెజిల్, వెనిజూలా, చైనా వంటి దేశాలే అమలు చేస్తున్నాపుడు, నిత్యం నిధుల కొరతతో సతమవుతున్న మన దేశ,రాష్ట్రా ప్రభుత్వాలు  ఎందుకు అమలు జరపలేక పోతున్నాయన్నదే సందేహం.

కేరళ కధ

 కేరళలో స్వేచ్ఛా సాఫ్ట్వేర్లతోనే కంప్యూటర్ విద్యా పాఠాలను నేర్పుతున్నారు. తొలుత మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్లతో పాఠాలు చెప్పేవారు. అక్కడి టీచర్ల సంఘమైన కేరళ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ కృషి ఫలితంగా మాత్రమే ఇది సాధ్యమైంది. అక్కడ టీచర్లు స్వేచ్ఛా సాఫ్ట్వేర్లను అధ్యయనం చేసి ఇతర టీచర్లకు తర్ఫీదిచ్చారు. పాఠశాలకి అవసరమయ్యే సాఫ్ట్వేర్లతో కూడిన ఒక సి.డి ని స్వేచ్ఛా సాఫ్ట్వేర్ ఉద్యమకారులు తయారు చేసి ఇచ్చారు. ఈ ప్రక్రియని ఆపటానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేక ఎత్తుగడలేసింది. టీచర్లను ట్రెయిన్ చేసిన మాస్టర్ ట్రెయెనర్లకు అమెరికావెళ్ళే అవకాశంతో పాటు భారీ మొత్తంలో నగదు బహుమతులను కూడా ప్రకటించింది. వీటినన్నింటినీ తిరస్కరించి ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టటంలో ఒక ముఖ్య పాత్ర పోషించింది కేరళ స్కూల్ టీచర్స్ అసోసియేషన్. నేడు కేరళలో 1,10,000 మంది టీచర్లు  తర్ఫీదు పొంది ఉన్నారు,మొత్తం 6000 స్కూళ్ళకు గానూ 4000 స్కూళ్ళలో 90000 కంప్యూటర్లున్నాయి. వీరు కేవలం కంప్యూటర్ విద్యనందిస్తున్నారనుకుంటే పొరపాటే,కంప్యూటర్ ఆధారిత విధ్యాబోధనా పద్దతులను ప్రారంభించారు. గణితంలో థేల్స్  థియరం కానీ, పైథాగరస్ థియరం కానీ ఏ థియరం అయినా దానిని ప్రదర్శన చేయటానికి సాఫ్ట్వేర్లున్నాయి. విశ్వాన్ని కంప్యూటర్లో చూపగల స్టెల్లారియం సాఫ్ట్ వేర్‌తో ఏకంగా మన పాల పుంతని, సౌర కుటుంబాన్ని, అంతరిక్షంలోని అన్ని నక్షత్రాలను, అఖరుకి సూర్యుని తర్వాత అతి సమీపంలో ఉన్న అల్ఫా సెంటౌరీ నక్షత్రాన్ని సైతం చూపగలరు. విద్యార్థులకు ఒక కొత్త ఒరవడిని, విజ్ఞాన్ని పంచుకునే సాంప్రదాయాన్ని నేర్పటమే కకుండా వీరు ఆదా చేసిన ప్రజల డబ్బు ను షుమారు 180 కోట్ల వరకు ఆదా చేయకలిగారు. ఒక సారి కంప్యూటర్ కొన్నాక దానిని ప్రతి మూడు లేదా నాలుగు సంవత్సరాలకోసారి మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి మూడు లేదా నాలుగు సంవత్సరాలకొకసారి ఇంత డబ్బును దుబారాకాకుండా చూస్తున్నారు.బాధ్యతతో భావి తరం నిర్మించే టీచర్లము మేమే అనే సాంప్రదాయానికి ఆదర్శంగా నిలచి, జాతీయోద్యమంలోనే కాదు, సమాచార విప్లవంలో సైతం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తాం అంటూ నడిచింది కేరళ స్కూల్ టీచర్స్ అసోసియేషన్. వీరందిస్తున్న విద్య నాణ్యమైనది కావటంతో బ్రెజిల్, వినిజూలా వంటి అనేక దేశాలు దీనిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రక్రియనంతా  IT@schools ద్వారా నడుపుతున్నారు. గత నాలుగు సంవత్సరాల్లో నాలుగు అవర్డులు సాధించింది IT@schools. నేషనల్ ఈ గవర్నేన్స్  అవార్డు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ODF అవార్డును కూడా కైవసం చేసుకున్నారు.


మరి మన సంగతి?

మనకు నచ్చినట్లు సొంతంగా ఆపరేటింగ్ సిస్టము తయారుచేసుకోగలిగితే

 సాధారణంగా స్వేచ్ఛా సాఫ్ట్వేర్లను గురించి మాట్లాడుకొనేటప్పుడు ఉచితంగా లభించును,నచ్చిన వారితో  పంచుకోవచ్చు, ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు అని విని ఉంటాము. మొదటి రెండు పనులు సాధారణంగా జరుగును.కానీ చివరిదైన ఇష్టం వచ్చినట్లు మార్చుకోవడం కొంత శ్రమతో కూడిన పని కానీ కష్టమేమి కాదు.ఇక ఉబుంటు విషయానికొస్తే మనం చాల సులభంగా ఉబుంటుని లేదా లినక్స్ మింట్ ఆధారంగా చేసుకొని మరొక ఆపరేటింగ్ సిస్టమును తయారుచేసుకోని ఎవరితోనైనా పంచుకోవచ్చు. లినక్స్ ఆపరేటింగ్ సిస్టములను మార్చుకోవడానికి పలురకాల అనువర్తనాలు ఉన్నప్పటికిని ఉబుంటు బిల్డర్ అను అనువర్తనము సులభంగా ఉంటుంది.తక్కువ సాంకేతిక నైపుణ్యము కలవారు కూడా దీనిని సులభంగా ఉపయోగించవచ్చు. ఉబుంటు బిల్డర్ వాడే విధానమును ఇక్కడ తెలుసుకోండి.





కావలసినవి:

  • ఉబుంటు బిల్డర్ ఇన్ స్టాల్ చేయబడిన ఉబుంటు కంప్యూటర్.
  • ఉబుంటు ఇన్స్టాలేషన్ iso.
  • అంతర్జాల అనుసంధానము.
  • కొంత కమాండ్ లైన్ పరిజ్ఞానము.

ఉపయోగాలు:

  • మనమే సొతంగా ఒక లినక్స్ పంపిణీని విడుదల చేయవచ్చు.
  • మన సహచరులకి ఉపయేగపడే అనువర్తనలన్ని కలిపి ఒక ఆపరేటింగ్ సిస్టము తయారుచేసి వారితో పంచుకోవచ్చు.
  • ముందే కావలసిన అన్ని అనువర్తనలన్ని(మల్టీ మీడియా కోడాక్ లను కూడా) ఉంచి తయారు చేస్తే అంతర్జాల అనుసంధానము లేనివారు కూడా అన్ని అనువర్తనలు వాడుకోవచ్చు.
  • స్తానిక భాషలలో కూడా ఆపరేటింగ్ సిస్టము తయారుచేసుకోవచ్చు.
  • వాడుకరి ప్రాధాన్యతలను బట్టి(పాఠశాలలకు,సంస్థలకు,ప్రోగ్రామర్లకు ఇవిధంగా ఎవరి అవసరాన్ని బట్టి వారికీ తగిన అనువర్తనాలను ఉంచి)ఆపరేటింగ్ సిస్టము తయారుచేయవచ్చు.

తెలుగు చదవలేక పోతున్నారా?

 తెలుగు మరియు ఇతర భారతీయ భాషలకి సంభందించిన వెబ్ సైట్లు అర్ధంకాని అక్షరాలతో గజిబిజిగా కనిపించినపుడు మనం చాలా సులభంగా ఆ సమస్యని పరిష్కరించుకోవచ్చు.పద్మ అను ఫైర్ ఫాక్స్ యాడ్ అన్ ని మనం ఇన్ స్టాల్ చేసుకొని అటువంటి సైట్లను ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు.ఈ యాడ్ అన్ వాణిజ్య ఫాంట్లలో ఉన్న భారతీయ భాషల అక్షరాలను యునికోడ్ రూపంలోకి మార్చి మనకి చూపించును.ఈ యాడ్ అన్ తెలుగు ,తమిళం ,మలయాళం, దేవనాగరి,గుజరాతి ,బెంగాలి మరియు గుర్మికి లిపులకు మద్దతునిచ్చును.దీనిని తెలుగువాడయిన నాగార్జున వెన్న తయారుచేయడం విశేషం.

పద్మ ఫైర్ ఫాక్స్ యాడ్ అన్