సపోర్ట్ నిలిపి వేయబడిన పాత కంప్యూటర్లకు జీవం పొయ్యండిలా

   మనం ఇప్పుడు వాడుతున్న పాత కంప్యూటర్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ నిలిపివేయడం వలన ఇక పై ఆ ఆపరేటింగ్ సిస్టంకు సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు కనుక ప్రత్యామ్నాయాల కోసం చూడవలసిన అవసరం ఏర్పడింది. మనం డబ్బులు పెట్టి కొత్త ఆపరేటింగ్ సిస్టం కొన్నప్పటికి అది మన పాత కంప్యూటర్ యొక్క సామర్ధ్యం తక్కువగా ఉండడం వలన దానిలో పని చేయకపోవచ్చు. అందువలన మనం తప్పనిసరిగా మన కంప్యూటరు యొక్క సామర్ధ్యాన్ని విడిబాగాలను మార్చుకోవడం లేదా రామ్‌ వంటి విడిబాగాలను అధనంగా చేర్చడం ద్వారా పెంచుకోవలసి రావచ్చు. వీలుకాని పరిస్థితులలో పూర్తిగా కంప్యూటరుని మార్చవలసి రావడం కూడా జరుగుతుంది. దీనికి కారణం ఆపరేటింగ్ సిస్టం తయారీదారు మరియు కంప్యూటర్ల తయారీదారులు కలిసి టెక్నాలజీ మెరుగుదల పేరుతో కొంతకాలానికి కంప్యూటర్లు మార్చడాన్ని తప్పనిసరి అవసరంగా తయారుచేయడం. దానివలన మనకి ఏవో కొన్ని ప్రయోజనాలున్నప్పటికిని ఆర్ధికంగా (కంప్యూటర్లను మరియు ఆపరేటింగ్ సిస్టం మార్చడానికి పెట్టుబడి) మరియు పర్యావరణపరంగా చాలా (కంప్యూటర్ వ్యర్ధాలు పర్యావరణానికి అతి పెద్ద ముప్పుగా పరిణమించ బోవడం) నష్టదాయకం.
   మన పాత కంప్యూటరును మార్చకుండానే సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించబడే ఆపరేటింగ్ సిస్టం మనకు అందుబాటులో ఉంటే దానికి పరిష్కారం దొరికినట్లే. అదీ ఉచితంగా దొరికితే ఇంకా బాగుంటుంది కదా. అవే ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలు. ఇవి లాభాపేక్షలేని కొన్ని సంస్థలచే మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లచే స్వచ్చందంగా అభివృద్ది చేయబడుతున్నాయి. పాత కంప్యూటర్లలో పనిచేయడానికి మనకు చాలా ఆపరేటింగ్ సిస్టంలు ఇప్పుడు మనకు ఇంటర్‌నెట్‌ లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది నిరంతరం కొత్త పీచర్లతో అప్‌డేట్ అవుతూ, మనం చూడడానికి ఇప్పుడు వాడే ఆపరేటింగ్ సిస్టం లానే ఉండే లుబుంటు.
    ఇది తక్కువ సామర్ధ్యం గల పాత డెస్క్‌టాప్, లాప్‌టాప్ మరియు మాక్ కంప్యూటర్లలో పనిచేయడానికి అనుగుణంగా వేగంగా, తేలికగా ఉండేటట్లు తయారుచేయబడింది. పెన్‌టియం 2, సెల్‌రాన్ వంటి పాత ప్రాససర్లతో ఉన్నటు వంటి కంప్యూటర్లలో కూడా పనిచేస్తుంది. తక్కువ వనరులని వాడుకొని వేగంగా పనిచేయడం దీని ప్రత్యేకత. అదే విధంగా కొత్త కంప్యూటర్ల కోసం 64బిట్ వెర్షను కూడా అందుబాటులో ఉంది. లుబుంటు ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇక్కడ నుండి దింపుకోవచ్చు. దీనిని పెద్దగా పరిజ్ఞానం లేనివారు కూడా సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బాగా పాత సిస్టంలలో సీడీ ద్వారా లాప్‌టాప్‌లు కొత్త కంప్యూటర్లలో పెన్‌డ్రైవ్ ద్వారాను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
లుబుంటు 14.04 డెస్క్‌టాప్

ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాలేషన్ డిస్క్ తయారుచేయడం ఎలా?

 ఇంటర్‌నెట్ లో ఉచితంగా లభించే ఆపరేటింగ్ సిస్టం యొక్క ఇమేజి ఫైల్ ని డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత దాన్ని సిడీ లేదా డివిడీ మరియు పెన్ డ్రైవ్ ఉపయోగించి ఇన్‌స్టాలేషన్ డిస్క్ తయారుచేయడం ఎలాగో ఈ వీడియోలో చూడవచ్చు.

ఉచితంగా ఆపరేటింగ్ సిస్టం డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

 ఉచిత ఆపరేటింగ్ సిస్టంలను(ఎక్కువ పరిమాణం గల ఫైళ్ళను) సులభంగా, వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూడవచ్చు. 

మీరు వాడుతున్న ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ నిలిచిపోయిందా? ఇదిగో మంచి అవకాశం ఉచితంగా!

మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ నిలిపివేయబడితే మన ఆపరేటింగ్ సిస్టం కి సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు కనుక మనం కొత్త ఆపరేటింగ్ సిస్టం కొనుక్కోవలసి ఉంటుంది. అదేవిధంగా పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టం వాడుతూ ఉంటే అప్‌డేట్ చేస్తే మీరు వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం నఖిలి అని చూపించబడడం వలన మీరు అప్‌డేట్ చేసుకోలేక పోతుండవచ్చు. ఈ సమస్యలకి పరిష్కారంగా ఇప్పుడు మనకి చక్కని, ఖర్చు లేని అవకాశం అందుబాటులో ఉంది.
 ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ల మంది వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం సరికొత్త వెర్షను విడుదల అయినది. విశేషం ఏమిటంటే వీటిని ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. చట్టపరంగానే డబ్బులు కట్టకుండా ఎన్ని కంప్యూటర్లలో అయిన ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఎటువంటి లైసెన్స్ కీలు అవసరం లేదు. మీ ఆపరేటింగ్ సిస్టం నకిలీదని పదేపదే విసిగించదు. పైరేటెడ్ఆపరేటింగ్ సిస్టంలు వాడుతూ బధ్రతా పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మంచి అవకాశం. అప్‌డేట్ల విషయానికి వచ్చినపుడు దీనిలో కూడా మనం కొనుక్కొన్న ఆపరేటింగ్ సిస్టం వలే నిరంతరం సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తుంటాయి. అదేవిధంగా తరువాతి వెర్షను విడుదలైనపుడు ఉచితంగానే మనకు అందించబడుతుంది.


 అన్ని రకాల కంప్యూటర్లలో పని చేసే ఈ ఆపరేటింగ్ సిస్టం పేరు ఉబుంటు. మనందరికి సుపరిచితమైన ఆండ్రాయిడ్ తయారుచేయబడిన లినక్స్ ని ఉపయోగించి దీనిని కూడా తయారుచేసారు. ఇప్పుడు విడుదలైన వెర్షను 14.04. మన అభిరుచికి తగిన విధంగా ఈ ఉబుంటు పలురూపాల్లో అందుబాటులో ఉంది. వాటిని కూడా మనం ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు(క్రింద ఇవ్వబడిన లంకెల ద్వారా).







రాష్ట్ర విభజన - యక్స్‌పి సపోర్ట్ నిలిపివేత

 యక్స్‌పి సపోర్ట్ నిలిపివేయబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ సుమారు రెండు సంవత్సరాల క్రితమే ప్రకటించింది. దానికి అనుగుణంగా అప్పటి నుండి ప్రజలను ప్రత్యామ్నాయాల వైపు మళ్ళించడానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తూనే ఉంది. ఇప్పటికే చాలా సంస్థలు, ప్రజలు ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు. అయినప్పటికి ఇప్పటికి చాలా మంది యక్స్‌పిని వాడుతున్నారు. వారిలో సాధారణ ప్రజలే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. వారు ఆదిశగా చర్యలను తీసుకుంటున్నట్లు ఏ పత్రికలోను రాలేదు. బహుషా వారు ఇప్పటికే యక్స్‌పి తరువాతి వెర్షన్‌లతో వచ్చే కంప్యూటర్లను కొనడానికి గుత్తేదారులను సిద్దం చేసుకొనే ఉండవచ్చు. టెండర్ల రూపం లో ప్రజాధనాన్ని అయినవారికి దోచిపెట్టే పందేరం మొదలైపోయి ఉండొచ్చు. మన ప్రక్క రాష్ట్రం తమిళనాడు విషయానికొస్తే ఆ ప్రభుత్వం యక్స్‌పి సపోర్ట్ నిలిచిపోతున్న సందర్భంగా వివిధ శాఖలను ఉచితంగా లభించే ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్టం లను వాడమని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.
 ఇక మన రాష్ట్రాని కొస్తే రాష్ట్ర విభజన నేపధ్యంలో యక్స్‌పి సపోర్ట్ నిలిచిపోవడం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లే ముఖ్యంగా నిర్మాణం కావలసిన సీమాంధ్ర ప్రాంతం. మనం ఇక్కడ సరిగా ఆలోచిస్తే విభజన నేపధ్యంలో అన్ని శాఖలు పునర్‌వ్యవస్థికరణ జరగనుండడం, యక్స్‌పి సపోర్ట్ నిలిపివేయడం ఒకేసారి రావడం వలన మన రాష్ట్రాలకి మంచి అవకాశం వచ్చినట్లే. ఇప్పుడు ఉన్న కంప్యూటర్లలో యక్స్‌పికి బదులుగా మరో ఆపరేటింగ్ సిస్టంను కొనుగోలు చేయడం, తక్కువ సామర్ధ్యం గల కంప్యూటర్లని తొలగించి వాటి స్థానంలో ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న కొత్త కంప్యూటర్లను కొనుగోలు చేయడం వంటి ఖరీదైన ప్రయామ్నాయాలతో పాటు ఉన్న కంప్యూటర్లలోనే ఉచితంగా లభించే ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలు మరియు సాఫ్ట్‌వేర్లను వాడుకోవడం వంటి ఉచిత ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉంది. విభజన నేపధ్యంలో నిధుల కొరత రెండు ప్రాంతాలలోను తప్పదు. మన ప్రభుత్వం ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్లను వాడుకలోకి తీసుకువచ్చి విలువైన ప్రజాధనాన్ని ఆధా చేసినచో ఆ నిధులను నిర్మాణ,పునర్‌నిర్మాణ పనులకి కేటాయించుకోవచ్చు. 
 ప్రభుత్వానికి మంచి అవకాశం ఉన్నట్లే ఇప్పుడు ప్రజలకి కూడా ఎన్నికల రూపంలో మంచి అవకాశం వచ్చింది. ప్రజాధనాన్ని స్వాహా చేసే నాయకులను కాకుండా ప్రజాధనాన్ని కాపు కాసే నేతలను ఎన్నుకోవలసిన అవసరం ఉంది. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కనుక ఆలోచించి మానసిక, భౌతిక ప్రలోభాలకు గురి కాకుండా సరైన నిర్ణయం తీసుకోవాలి.