మీరు వాడుతున్న ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ నిలిచిపోయిందా? ఇదిగో మంచి అవకాశం ఉచితంగా!

మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ నిలిపివేయబడితే మన ఆపరేటింగ్ సిస్టం కి సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు కనుక మనం కొత్త ఆపరేటింగ్ సిస్టం కొనుక్కోవలసి ఉంటుంది. అదేవిధంగా పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టం వాడుతూ ఉంటే అప్‌డేట్ చేస్తే మీరు వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం నఖిలి అని చూపించబడడం వలన మీరు అప్‌డేట్ చేసుకోలేక పోతుండవచ్చు. ఈ సమస్యలకి పరిష్కారంగా ఇప్పుడు మనకి చక్కని, ఖర్చు లేని అవకాశం అందుబాటులో ఉంది.
 ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ల మంది వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం సరికొత్త వెర్షను విడుదల అయినది. విశేషం ఏమిటంటే వీటిని ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. చట్టపరంగానే డబ్బులు కట్టకుండా ఎన్ని కంప్యూటర్లలో అయిన ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఎటువంటి లైసెన్స్ కీలు అవసరం లేదు. మీ ఆపరేటింగ్ సిస్టం నకిలీదని పదేపదే విసిగించదు. పైరేటెడ్ఆపరేటింగ్ సిస్టంలు వాడుతూ బధ్రతా పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మంచి అవకాశం. అప్‌డేట్ల విషయానికి వచ్చినపుడు దీనిలో కూడా మనం కొనుక్కొన్న ఆపరేటింగ్ సిస్టం వలే నిరంతరం సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తుంటాయి. అదేవిధంగా తరువాతి వెర్షను విడుదలైనపుడు ఉచితంగానే మనకు అందించబడుతుంది.


 అన్ని రకాల కంప్యూటర్లలో పని చేసే ఈ ఆపరేటింగ్ సిస్టం పేరు ఉబుంటు. మనందరికి సుపరిచితమైన ఆండ్రాయిడ్ తయారుచేయబడిన లినక్స్ ని ఉపయోగించి దీనిని కూడా తయారుచేసారు. ఇప్పుడు విడుదలైన వెర్షను 14.04. మన అభిరుచికి తగిన విధంగా ఈ ఉబుంటు పలురూపాల్లో అందుబాటులో ఉంది. వాటిని కూడా మనం ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు(క్రింద ఇవ్వబడిన లంకెల ద్వారా).