తరచు కంప్యూటరు కొట్టు వాడికి డబ్బులు చదివించుకొని విసిగిపోయారా?

 మనం సాధారణంగా కంప్యూటర్ ఆన్ చేసి డెస్క్‌టాప్ రాగానే మన పనులు చేసుకొని పని అయిపోగానే తిరిగి కంప్యూటరును ఆపివేస్తాము. ప్రతిరోజు బాగానే ఆన్ అయినప్పటికి ఒకొక్కసారి కంప్యూటర్ ఆన్ కాకుండా సతాయిస్తు ఉంటుంది. దానితో మనం కంప్యూటరును దగ్గరలో ఉన్న కంప్యూటరు బాగుచేసే వాడి దగ్గరకు తీసుకొని వెళ్ళడం లేదా వాడినే ఇంటికి పిలిపించి బాగు చేయిస్తాము. సాధారణంగా కంప్యూటర్లు బాగుచేసే వాళ్ళు మన ముందు బాగు చేయడానికి ఇష్టపడరు. తరువాత రమ్మని చెప్పి పంపించి వేస్తుంటారు. సమస్య ఏదైనప్పటికి సాధారణంగా ఫార్మాటు చెయ్యాలి అని, చేసి తొందరగా మనకి డెస్క్‌టాప్ చూపించి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. లేదా అది పోయింది ఇది పోయిందని చెప్పి నిలువు దోపిడి చేస్తుంటారు. సాధారణంగా కంప్యూటరు బాగు చేయడానికి వచ్చే వాటిలో చాలా కంప్యూటర్లు చిన్న చిన్న సమస్యల కారణంగా వస్తుంటాయి. వాటిని మనం ఇంటి దగ్గరే మనమే పరిష్కరించుకోవచ్చు. మన తెలియని తనాన్ని వాడు సొమ్ము చేసుకుంటాడు. మనం కొంత ఆశక్తి చూపిస్తే అది గొప్ప విద్యేంకాదు. 
 వదులుగా ఉన్న కనెక్షన్‌ల వలన, సిపియు డబ్బాలో దుమ్ముచేరడం, ప్రాససర్ వేడెక్కడం, రామ్‌ సరిగా పెట్టకపోవడం, కరెంటు ఓల్టేజిలో హెచ్చుతగ్గులవల్ల, వైరస్ వలన సిస్టం పనితీరు మందగించడం, తరచు రీస్టార్ట్ అవడం, మనం పనిచేస్తున్నపుడు తరచు కరెంటు పోవడం వలన రామ్‌ పోవడం, హార్డ్‌డిస్క్ బ్యాడ్ సెక్టార్‌లు ఏర్పడడం వంటి సాధారణ సమస్యలు. అసలు సమస్య ఏమిటో తెలుసు కుంటే మనం సగం దోపిడినీ అడ్డుకున్నట్టే. నిజంగా ఏదైనా విడి బాగం పోతే సమస్య తెలిస్తే మనమే ఆ విడిబాగాన్ని నాణ్యమైన దానితో మార్చుకోవచ్చు. అదే కంప్యూటరు బాగు చేసేవాళ్ళయితే తక్కువ రకం  వాటిని అమర్చి ఎక్కువ డబ్బు తీసుకోవచ్చు. అందువలన మనకి సంబంధం లేని విషయం అయినప్పటికి తెలుసుకొని ఉంటే అత్యవసర సమయాల్లో చేతిచమురు వదలకుండా ఉండడమే కాకుండా ఇతరులకి కూడా సహాయం చేయవచ్చు. అంతేకాకుండా కొంత తెలిసినవాళ్ళ దగ్గర కంప్యూటరు కొట్టువాడు కూడా జాగ్రత్తగానే ఉంటాడు.  



 ఇలా కంప్యూటర్లలో తరచు వచ్చే సమస్యలు వాటికి పరిష్కారాలు మనం తరువాతి టపాలలో చూద్దాం.

ఫైర్‌ఫాక్స్ కొత్త రూపం

విండోస్,మాక్ మరియు ఉబుంటు లో ఫైర్‌ఫాక్స్ కొత్తరూపం ఆస్ట్రాలిస్

 సాధారణంగా ఫైర్‌ఫాక్స్ వాడుతున్నవారు వెర్షన్‌కి వెర్షన్‌కి రూపంలో పెద్దగా మార్పులు లేకపోవడం గమనించే ఉంటారు. నిజానికి ఫైర్‌ఫాక్స్ కొంత వెనకబడడానికి ఇది కూడా కొంత కారణం కావచ్చు. దానిని అధికమించడానికి తొదరలో మొజిల్లా ఫౌండేషన్ వారు కొత్త రూపంతో ఫైర్‌ఫాక్స్‌ని విడుదలచేయబోతున్నారు. ఈ కొత్త రూపం ఇప్పుడు ఎక్కువగా వాడుతున్న తాకేతెరలకు అనుగుణంగా ఆధునికంగా ఉండడమే కాకుండా ఆకర్షణీయంగాను ఉండబోతుంది. అభివృద్ది దశలో ఉన్న ఈ ఫైర్‌ఫాక్స్ కొత్త రూపాన్ని అస్ట్రాలిస్ గా వ్యవహరిస్తున్నారు. కొత్త రూపంతో ఉన్న ఫైర్‌ఫాక్స్ ని ఇప్పుడే ఇక్కడ నుండి దింపుకొని ప్రయత్నించవచ్చు. అస్ట్రాలిస్ యొక్క ఫీచర్లను రూపాన్ని క్రింది వీడియోలో చూడవచ్చు.

క్రెడిట్ కార్డు అంత చిన్న కంప్యూటర్

 కంప్యూటర్ వచ్చిన తొలిరోజులలో పెద్ద గది అంత ఉండేది. శాస్త్రవేత్తల కృషి ఫలితంగా క్రమంగా రూపు మార్చుకొంటూ చిన్నదవుతూ వచ్చింది. డెస్క్‌టాప్, లాప్‌టాప్ చివరకి అరచేతిలో పట్టే మొబైల్ ఫోన్ ఇలా చిన్నది తయారయింది. ఇప్పుడు మరింత చిన్నదిగా అంటే మనం వాడే క్రెడిట్/ఏటియం కార్డు పరిమాణంలో మారిపోయింది. అలా క్రెడిట్ కార్డు అంత ఉన్న కంప్యూటర్ పేరే రాస్ప్‌బెర్రి పై. 
యస్‌డి కార్డు ప్రక్కన రాస్ప్‌బెర్రి పై
 రాస్ప్‌బెర్రి పై ని కంప్యూటర్ సైన్స్ మూలాల గురించి తక్కువ ఖరీదులో పాఠశాలలలో బోధించడాన్ని ప్రోత్సహించడానికి ఇంగ్లాండు లో ఉన్న రాస్ప్‌బెర్రి పై ఫౌండేషన్ వారు తయారుచేసారు. దీనిని వాణిజ్య పరంగా తయారుచేసి అమ్మడానికి న్యూఆర్క్ ఎలిమెంట్ 14, ఆర్‌యస్ కాంపోనెంట్స్ మరియు ఇగొమెన్ అన్న సంస్థలకి అనుమతి గలదు. రాస్ప్‌బెర్రి పై లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి 25 డాలర్లు, ఇంకొకటి 35 డాలర్లు. ఆ సంస్థలు రాస్ప్‌బెర్రి పై ని తయారుచేసి ఆన్‌లైన్‌లో అమ్మకాలు కొనసాగిస్తారు.
 రాస్ప్‌బెర్రి పై లో క్రెడిట్ కార్డు పరిమాణం ఉన్న బోర్డులో కంప్యూటరుగా పనిచేయడానికి కావలసిన అన్ని పరికరాలు అమర్చినారు. దీనిలో 700 మెగా హెర్ట్‌జ్ ప్రాససర్, 250 మెగా హెర్ట్‌జ్ జిపియు, 256 లేదా 512 యంబి రామ్‌, ఒకటి లేదా రెండు యుయస్‌బి పోర్టులు, ఇథర్‌నెట్ పోర్టు, హెచ్‌డియమ్‌ఐ పోర్టు, 3.5 యమ్‌యమ్‌ జాక్, పవర్ కోసం ఒక మైక్రో యుయస్‌బి పోర్టు మరియు యస్‌డి కార్డు స్లాటు ఉన్న ఈ కంప్యూటరు 45 గ్రాములు ఉంటుంది. 
రాస్ప్‌బెర్రి పై మోడల్ బి నమూనా చిత్రం
 
  రాస్ప్‌బెర్రి పై లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి రాస్ప్‌బియన్ అను డెబియన్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉచితంగా అందిస్తున్నారు. రాస్ప్‌బియన్ కాకుండా ఈ చిన్ని కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వివిధ ఆపరేటింగ్ సిస్టంలు అందుబాటులో ఉన్నాయి. వాటికి ఇక్కడ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిలో మనం ఆపరేటింగ్ సిస్టమును యస్‌డి కార్డులో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

మానీటర్/టీవీలకి ఉండే పోర్టులు వాటి కేబుళ్ళు

 ఇప్పుడు వస్తున్న టీవీలు, మానీటర్లు వివిధ పరికరాలు అనుసంధానించడానికి వివిధ రకాల పోర్టులతో వస్తున్నాయి. అవి ఎలా ఉంటాయి వాటి వలన ఉపయోగాలు చూద్దాం.

హెచ్‌డియమ్‌ఐ పోర్ట్:

హెచ్‌డియమ్‌ఐ అంటే హై డెపినేషన్ మల్టిమీడియా ఇంటర్‌ఫేజ్. ఇప్పుడు వస్తున్న టీవీ, మానీటర్, కంప్యూటర్, లాప్‌టాప్, సెటాప్ బాక్స్, డీవిడీ ప్లేయర్, గేమింగ్ బాక్సులు ప్రొజెక్టర్లు మరియు మొబైళ్ళు, టాబ్లెట్లు, కెమేరాలు (మిని లేదా మైక్రో హెచ్‌డియమ్‌ఐ) అన్ని హెచ్‌డియమ్‌ఐ పోర్టులతో వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పరిజ్ఞానంలో ఇదే అత్యంత నాణ్యత కలిగినది. దీనిని ఉపయోగించి అధిక నాణ్యతతో కూడిన సినిమాలు నాటి నాణ్యత తగ్గకుండా వేరే పరికరాల నుండి టీవీ మరియు మానీటర్లలో చూడవచ్చు. మానీటర్లలో ఒకటి లేదా రెండు టీవీలలో ఒకటి నుండి నాలుగైదు హెచ్‌డియమ్‌ఐ పోర్టులు ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మనం కంప్యూటర్, లాప్‌టాప్, సెటాప్ బాక్స్, డీవిడీ ప్లేయర్, కెమేరా, ఫోను మరియు టాబ్లెట్లను నేరుగా టీవీ/మానీటర్లకి కనెక్ట్ చేసుకోవచ్చు.

హెచ్‌డియమ్‌ఐ కేబుల్

హెచ్‌డియమ్‌ఐ పోర్టు
వివిధ రకాల హెచ్‌డియమ్‌ఐ పోర్టులు
 మైక్రో లేదా మిని హెచ్‌డియమ్‌ఐ ఉన్న డివైస్లను టీవీలతో కలపడానికి ఒక ప్రక్క మామూలు హెచ్‌డియమ్‌ఐ మరొక ప్రక్క  మైక్రో లేదా మిని హెచ్‌డియమ్‌ఐ ఉన్న కేబుళ్ళు కూడా మనకు దొరుకుతున్నాయి. చాలా కంపెనీలు మనం డివైస్ కొన్న పుడు వాటితో టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి తప్పనిసరిగా హెచ్‌డియమ్‌ఐ కేబుల్‌ని కూడా ఇస్తున్నాయి.

డివీఐ పోర్టు:

డివీఐ అంటే డిజిటల్ విజువల్ ఇంటర్‌ఫేజ్. ఇది హెచ్‌డియమ్‌ఐ కి ముందు వచ్చిన పరిజ్ఞానం. ఇది దాని ముందు వచ్చిన విజిఎ తో కంపెటబుల్ గా ఉంటునే దానిని మించిన నాణ్యత నివ్వడం దీని ప్రత్యేకత. ఇది కూడా వివిధ పరికరాలను మానీటర్ లేదా టీవీ లకు అనుసందానించడానికి ఉపయోగపడుతుంది. గేమింగ్ బాక్సులు, కంప్యూటర్లు, మానీటర్లు, లాప్‌టాప్‌లలో విరివిగా కనిపించే ఈ పోర్టు టీవీ, డివీడి ప్లేయర్లలో  తక్కువగా కనిపిస్తుంటుంది. 


డివీఐ పోర్ట్

డివీఐ కేబుల్

విజిఎ పోర్టు:

విజిఎ అంటే విడియో గ్రాఫిక్స్ యరే. ఇది హెచ్‌డియమ్‌ఐ,డివీఐ కన్నా ముందు వచ్చిన ఎక్కువగా వాడిన వాడబడుతున్న పరిజ్ఞానం. ఇది ఇంచుమించు అన్ని కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు,మానీటర్లు మరియు ఇప్పుడు వస్తున్న టీవీలలో చూడవచ్చు. దీనిని కంప్యూటర్ సిపియుని లేదా లాప్‌టాప్‌ని మానీటర్ లేదా టీవీకి అనుసందానించడానికి ఉపయోగిస్తాము. నిన్నటి తరం టీవీ ట్యునర్ లలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

విజిఎ పోర్టు

విజిఎ కేబుల్

యుయస్‌బి పోర్ట్:

యుయస్‌బి అంటే యూనివర్సల్ సిరియల్ బస్. ఇది కంప్యూటర్ వాడేవారికి తప్పకుండా తెలుస్తుంది. కంప్యూటర్ల వాడకం గతిని మార్చిన పోర్టు ఇది. ఇంచుమించు అన్ని పరికరాలకి తప్పకుండా ఉంటుంది. ఫోన్‌లు వంటి చిన్న పరికరాలకి కూడా మైక్రో యుయస్‌బి రూపంలో ఉందుబాటులో ఉంటుంది. ఇక టీవీల విషయాని కొస్తే ఒకటి నుండి నాలుగు పోర్టుల వరకు ఉంటున్నాయి. దీనిని ఉపయోగించి పెన్‌డ్రైవ్ లేదా ఎక్స్‌టర్‌నల్ హార్డ్‌డిస్కులను టీవీకి అనుసంధానించి ఫోటోలు,పాటలు మరియు సినిమాలు చూడడానికి నెట్ లేదా కెమేరా వంటివి టీవీకి అనుసందానించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వస్తున్న డీవీడీ ప్లేయర్లు,సెటాప్ బాక్సులకి కూడా యుయస్‌బి పోర్టులు ఉంటున్నాయి.

యుయస్‌బి కేబుల్ మరియు యుయస్‌బి పోర్ట్

ఆర్‌యఫ్ కనెక్టర్:

ఈ ఆర్‌యఫ్(రేడియో ఫ్రీక్వెన్‌సి) కనెక్టర్ మన టీవీకి యాంటెన్నా వైరు, కేబుల్ టీవీ వైరు, సెటాప్ బాక్సు, వీసిపి మరియు వీసిఆర్ లను కలపడానికి వాడుతుంటాము. ఇది పాత టీవీలు మొదలుకుని ఇప్పుడు వచ్చే ఆధునికమైన టీవీలలో మనం చూడవచ్చును. ఈ మధ్య దీనిని అంతగా వాడడంలేదు.

యాంటెన్నా వైరుని టీవీకి కలిపే ఆర్‌యఫ్ కనెక్టర్

స్టీరియో/కాంపోజిట్ వీడియో:

దీన్ని మనం సాధారణంగా సెటాప్ బాక్స్ లేదా డివీడి ప్లేయర్‌లను టీవీకి కలపడానికి వాడతాము. బాగా పాత టీవీలకు తప్పించి మిగిలిన అన్ని టీవీ లకు ఈ పోర్టులు అందుబాటులో ఉంటాయి. సెటాప్ బాక్స్, డివీడి ప్లేయర్‌, గేమింగ్ బాక్స్, డిగిటల్ కెమేరా, కామ్‌ కోడర్  వీసిపి మరియు వీసిఆర్ వంటి పరికరాలనుటీవీకి కలపడానికి దీనినివాడతారు. ఇప్పటికిదీనిని విరివిగానే వాడుతున్నారు.

స్టీరియో/కాంపోజిట్ వీడియో

యస్-వీడియో:

యస్-వీడియో లేదా సెపరేట్ వీడియో కాంపోజిట్ కేబుల్ కన్నా నాణ్యతతో కూడిన చిత్రాన్ని అందించును. సాధారణంగా టీవీట్యూనర్లు, సెటాప్ బాక్సులు మరియు డీవీడీ ప్లేయర్లలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా అన్ని టీవీలకు అందుబాటులో ఉంటుంది.

యస్-వీడియో

కాంపోనెంట్ వీడియో:

ఇది స్టీరియో/కాంపోజిట్ వీడియో కన్నా మెరుగైన చిత్రాన్ని అందించును. దీనికి హెచ్‌డి సాంకేతాలను మోసుకెళ్ళే సామర్ధ్యం కలదు. ఇది సాధారణంగా డీవీడీ/ బ్లూరే ప్లేయర్లలో ఉంటుంది. ఇప్పుడు వచ్చే అన్ని హెచ్‌డి టీవీలలో ఉంటుంది. ఇది దృశ్యాలను మాత్రమే అందిస్తుంది, ధ్వనికోసం వేరే కనక్టర్ ని వాడాలి.

కాంపోనెంట్ వీడియో

ఈథర్‌నెట్ పోర్ట్:

ఈ మధ్య వచ్చే అన్ని స్మార్ట్ టీవీలు ఈథర్‌నెట్ పోర్టును కలిగి ఉంటున్నాయి. ఇది మన టీవీ లోనే నెట్లో ఉన్న వీడియోలు, ఫొటోలు చూడడానికి ఉపయోగపడుతుంది. స్మార్ట్ టీవీ లలో ఉన్న వివిధ నెట్ ఆధారిత ఆప్లికేషన్‌లు ఉపయోగించుకోవడాకి (వెబ్ బ్రౌజర్, స్కైప్ మొదలైనవి) ఇది తప్పనిసరి. కొన్ని టీవీ లలో అయితే నేరుగా వైఫి చిప్ అమర్చబడి ఉండడం వలన ఎటువంటి వైర్లు లేకుండానే మనం అంతర్జాలానికి అనుసంధానం కావచ్చు.

ఈథర్‌నెట్ పోర్టు

ఆప్టికల్ డిజిటల్ ఆడియో:

దీనిని ఉపయోగించి టీవీ ని హోమ్‌ ధియేటర్ సిస్టంకి అనుసంధానించవచ్చు. ఇది కూడా ఇప్పుడు వచ్చే అన్ని టీవీలలో ఉంటుంది. డీవీడీ ప్లేయర్లలో మరియు గేమింగ్ బాక్సు లలో మనకి కనిపించును.

ఆప్టికల్ డిజిటల్ ఆడియో పోర్ట్

మీ మొబైల్ నెట్ వేగం తెలుసుకోండిలా

 మొబైళ్ళు, టాబ్లెట్లు అందరికి వివిధ ధరలలో అందుబాటులో కి రావడం వలన సెల్యులార్ నెట్‌వర్క్ కంపెనీలు కూడా ఆకర్షణీయమైన ధరలకు డాటాని అందిస్తున్నాయి. ఈ మధ్య అన్ని నెట్‌వర్క్ కంపెనీలు కూడా వివిధ రకాల డాటా పధకాలతో(2G,3G మరియు 4G అని) మన ముందుకు వస్తున్నాయి. పధకం ఏదైనా ఇక్కడ వేగం, డాటా పరిమాణం బట్టి చెల్లింపు ఆధారపడి ఉంటుంది. అసలు మనం మొబైల్లో వాడే నెట్ వేగం ఎంతవుంటుంది. నెట్‌వర్క్ కంపెనీ వాడు చెప్పిన వేగం మనం పొందుతున్నామా అని తెలుసుకోవాలంటే ఎలా? 
 సాధారణంగా మనం కంప్యూటర్ కి ఉన్న నెట్ యొక్క వేగాన్ని తెలుసుకోవడానికి http://www.speedtest.net అన్న సైటులోకి వెళ్ళి తెలుసుకుంటాము. అదే విధంగా మన మొబైళ్ళ నెట్ కనెక్షన్ వేగం తెలుసుకోవాలంటే స్పీడ్‌టెస్ట్ వారి ఈ మొబైల్ ఆప్ మనకి ఉపయోగపడుతుంది. ఫెడరల్ కమ్యూనికేషన్ కమీషన్ వారిచే తయారుచేయబడిన ఈ ఒపెన్ సోర్స్ ఆప్ విండోస్, ఐ ఫోన్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించి 2G,3G మరియు 4G నెట్‌వర్క్‌ల వేగం తో పాటు మనకి అందుబాటులో ఉన్న  వైఫి కనెక్షన్ల వేగం కూడా తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లు వాడుతున్నవారు ఇక్కడ నుండి ఉచితంగా ఈ ఆప్‌ని పొందవచ్చు.

ఆండ్రాయిడ్ లో స్పీడ్‌టెస్ట్ ఆప్