ఉబుంటు లో తెలుగు

 ఉబుంటు కూడా చాలా స్వేచ్చా సాప్ట్ వేర్ ల మాదిరిగానే తెలుగు మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర స్థానిక భాషలకు కూడా మద్దతునిస్తుంది.ఉబుంటు లో తెలుగు చూడవచ్చు,వ్రాయనువచ్చు మరియు ఉబుంటు ను తెలుగు లో వాడుకోవచ్చు.

తెలుగు చూడడానికి:

 చాలా వెబ్ సైట్లు,యునికోడ్ లో ఉన్న వెబ్ సైట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు.కొన్ని వార్త పత్రికలు సొంత ఫాంట్లను వాడుతుంటాయి.వాడుకరి సహాయార్ధం వారు ఫాంట్లను డౌన్ లోడ్ చేసుకోవడానికి అందుబాటు లో ఉంచుతారు.ఆ ఫాంట్ ని డౌన్ లోడ్ చేసుకొని దానిని తెరచినపుడు క్రింది విధంగా కనిపించును.
ఉబుంటు లో ఫాంట్ ఇన్ స్టాల్ చేయడానికి ఉదాహరణ
ఇన్ స్టాల్ ఫాంట్ ని నొక్కినపుడు ఫాంట్ మన కంప్యుటర్ నందు ఇన్ స్టాల్ అవుతుంది.అపుడు ఫైర్ ఫాక్స్ ని తిరిగి ప్రారంభించినపుడు ఆయా సైట్ వెబ్ పేజీలు మనకు సరిగా కనిపించును.

తెలుగు వ్రాయడానికి: 

 మొదట తెలుగు భాషకు మద్దతు ని ఇన్ స్టాల్ చేసుకోవాలి.ఉబుంటు లాంచర్ నందుగల  System Settings ని తెరచి Language Support లోనికి వెళ్లి తెలుగు భాషకు మద్దతు ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

మొదటిసారి Language Support ని తెరచినపుడు క్రిందివిధంగా అడుగుతుంది.

 ఇన్ స్టాల్ ని నొక్కిన తరువాత పాస్ వర్డ్ అడుగును.పాస్ వర్డ్ ని ఇవ్వగానే డౌన్ లోడ్ చేసుకొని,ఇన్ స్టాల్ చేసుకొని క్రింది విండో తెరవబడును.
 Install/Remove Languages ని నొక్కినపుడు మరొక విండో తెరవబడును.అక్కడ తెలుగు ని ఎంచుకొని Apply Changes ని నొక్కినపుడు తెలుగు భాషకు మద్దతు మన కంప్యుటర్ లో స్థాపించబడును.
 తరువాత System Settings లో ఉన్న Keyboard ని తెరిచి Layout Settings లోకి వెళ్ళాలి.  
 + ని నొక్కడం ద్వారా మరొక విండో తెరవబడును.అక్కడ పెట్టెలో తెలుగు అని టైప్ చేసినపుడు పైన పెట్టెలో తెలుగు కనిపించును.Add ని నొక్కినపుడు ప్యానల్ లో కీబోర్డ్ గుర్తుని చూపించును.అక్కడ నుండి మనం ప్రతిసారి కీబోర్డ్ లేఅవుట్ ని మార్చుకోవచ్చు.ప్యానల్ లో కీబోర్డ్ గుర్తుని నొక్కి తెలుగు ను ఎంచుకొని తెలుగు లో టైప్ చేసుకోవచ్చు.
 మనకి అలవాటు అయ్యేవరకు తెలుగు కీబోర్డ్ లేఅవుట్ ని చూసుకొంటూ టైపు చేసుకోవచ్చు.
తెలుగు కీబోర్డ్ లేఅవుట్

తెలుగు లో వాడుకోవడానికి:

 ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంని  తెలుగులో కూడా వాడుకోవచ్చు.పైన చూపించిన విధంగా తెలుగు భాషకు మద్దతు ని ఇన్ స్టాల్ చేసుకోన్న తరువాత System Settings ని తెరచి Language Support లోనికి వెళ్లి అక్కడ చూపించబడిన భాషలలో తెలుగును లాగి (డ్రాగ్ చేసి) ప్రాధాన్యత క్రమం లో మొదట ఉంచవలెను.
 ఆ తరువాత సిస్టం ని లాగ్ అవుట్ చేసి మరలా లాగిన్ కావాలి.అప్పుడు క్రింది చిత్రాలలో చూపించినట్లు మెనూ మరియు డాష్ లో తెలుగు కనిపించును.
తెలుగులో మేనూలు
తెలుగులో డాష్
 ఉబుంటు ని తెలుగులో ఉపయేగిస్తున్నపుడు అక్కడక్కడా ఇంగ్లీష్ లో కనిపించును.ఇంకనూ వాటి అనువాదాలు పుర్తికాకపోవడం వలన ఈవిధంగా కనిపించును.ఈ అనువాద పక్రియలో మీరు కూడా పాలుపంచుకోవచ్చు.ఇక్కడ  మనం ఇప్పటికే అనువాదాలు చేస్తున్న ఒత్సాహికులను చూడవచ్చు,మనం కూడా వీరితో చేరి అనువాదాలు చేయవచ్చు.

వైరస్ బారిన పడ్డారా?

 కంప్యూటర్ బాగా నెమ్మదిగా పనిచేయడం,ఉన్నట్టుండి రిస్టార్ట్ కావడం,మీరు తెరిచిన ప్రతి ఫోల్డర్ లో ఒకే రకమైన ఫైళ్ళు కనిపించడం మరియు మన ప్రమేయం లేకుండానే ఎదో జరిగి పోవడం వంటి లక్షణాలు మీ కంప్యూటరు నందు గమనిస్తే మీ కంప్యూటరు వైరస్ బారిన పడినట్లే.అయితే ఈ టపా మీ కోసమే.ప్రతి కంప్యూటర్ వాడుకరి తప్పక తెలుసుకోవలసిన ఈ విషయాలను క్రింది ఇవ్వబడిన లంకెలలో చదవండి.
 వైరస్ గురించిన సమాచారాన్ని చదివి మీకు తగిన యాంటివైరస్లను వాడి మీ కంప్యుటర్ని మరియు మీ సమాచారాన్ని కాపాడుకోండి.ఈ సమాచారం మీకు ఉపయేగపడినట్లయితే మీకు తెలిసిన వారందరితోనూ పంచుకోండి.

విలువైన బహుమతులు గెలవడానికి సమయం మించిపోలేదు.

 విలువైన బహుమతులు గెలవడానికి సమయం మించిపోలేదు.ఉబుంటు అనువర్తనాల తయారీ పోటి(Ubuntu App Creation Contest) ఇంకా రెండు వారాల సమయం ఉంది.తెలుగు సాఫ్ట్వేర్ వీరులారా త్వరపడండి.మన సత్తా చూపించే అవకాశం మనముందుంది.సమాజానికి సాఫ్ట్వేర్లని ఉచితంగా అందిస్తూనే విలువైన బహుమతులు గెలవవచ్చు.
40 నిమిషాల్లో ఒక వెబ్ విహారిణి తయారు చేస్తూ కొత్త డెవలపర్లకు మార్గనిర్దేశం చేస్తున్న ఈ వీడియో పాఠాన్ని చూడండి.

ఆండ్రాయిడ్ సోదరుడు వస్తున్నాడు

 మొబైల్ ఫోన్ రంగంలో ఆండ్రాయిడ్ ఫోన్ సృష్టించిన సంచలనం అందరికి తెలిసిందే.ఆండ్రాయిడ్ ని గూగుల్ సంస్థ లినక్స్ కర్నెలు పై ఓపెన్ సోర్స్ విధానంలో రూపొందించినది.ఆనతికాలం లోనే జన ప్రాచుర్యం పొంది ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టములలో అగ్రగామిగా నిలిచింది.ఆండ్రాయిడ్ ఇచ్చిన స్పూర్తితో లినక్స్ ఫౌండేషన్ వారి ఆరధ్యంలో ఇంటెల్ , సామ్ సంగ్ వంటి పెద్ద కంపెనీల సహకారంతో  ఓపెన్ సోర్స్ విధానంలో మరో కొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టము ప్రారంభమైనది.దాని పేరు టిజెన్. దీనిని ఒక్క మొబైల్ ఫోన్ల కోసమే కాకుండా టాబ్లెట్లు,నెట్ బుక్,స్మార్ట్ టివి,వాహనాలలో సమాచారాన్ని,వినోదాన్ని అందించే పరికరాలలో పనిచేసే విధంగా రూపొందిస్తున్నారు.ఈమద్యనే మొదటి సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ ని(ఉబుంటు,యక్స్ పి మరియు 7 కొరకు) విడుదలచేసారు.మరిన్ని వివరాలకు టిజెన్ సైటును చూడండి.

ఆడియో,వీడియో ఫైళ్ళు ప్లే చేయడానికి

 సాధారణంగా విండోస్ లో మాత్రమే అన్ని రకాల ఆడియో,వీడియో ఫైళ్ళు ప్లే అవుతాయి ఉబుంటు మరియు మిగిలిన లినక్సు పంపకాలలో ప్లే కావు అని అనుకోవడం వలన ఉబుంటు లాంటి ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలు వాడడానికి వెనకాడతారు.కానీ అది అపోహ మాత్రమే.చక్కగా మనం అన్నిరకాల ఆడియో మరియు వీడియోలు వినవచ్చు, చూడవచ్చు.
 విండోస్ ఇన్ స్టాల్ చేయగానే mp3,విండోస్ మీడియా ఫార్మాట్ లో ఉన్న ఫైళ్ళు మాత్రమే ప్లే అవడం,తరువాత కోడెక్ పేక్ ఇన్ స్టాల్ చేసుకోవడం వలన మిగిలిన ఫార్మాట్ లు(.mkv,.mp4,.avi) కూడా ప్లే కావడం మనం గమనించవచ్చు.అదే విధంగా లినక్సు ఆదారిత ఆపరేటింగ్ సిస్టంలలో కూడా ఇన్ స్టాల్ చేయగానే ఓపెన్ మీడియా ఫార్మాట్ లో ఉన్న ఫైళ్ళు(.ogg) ప్లే అవుతాయి.విండోస్ లో మాదిరిగానే అదనపు కోడెక్ లు ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా అన్ని రకాల ఫార్మాట్ లు కూడా ప్లే చేసుకోవచ్చు.కోడెక్ ల కోసం వెతికే అవసరం లేకుండా నేరుగా ఉబుంటు సాప్ట్వేర్ సెంటర్ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.ఉబుంటు సాప్ట్వేర్ సెంటర్ ని తెరిచి సెర్చ్ బాక్స్ లో Ubuntu restricted  extras అని టైపు చేసినపుడు క్రింది చిత్రంలో వలే Ubuntu restricted  extras అన్న సాప్ట్వేర్ కనిపించును.దానిని ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మనం అన్నిరకాల ఆడియో,వీడియో ఫైళ్ళు ప్లే చేసుకోవచ్చు.