మనం సైతం

ఏ దేశమేగినా, ఎందు కాలిడినా మన తెలుగువారు లేని ప్రధేశము లేదంటే అతిశయోక్తి కాదేమో. జీవన అవకాశాల కోసం వివిధ దేశాలకు వెళ్ళి, వెళ్ళిన చోట తమ కష్టించే తత్వం మరియు ప్రతిభా పాటవాలతో అనతి కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో తెలుగు వారికి సాటి లేదు. ఈరోజుల్లో ప్రపంచంలో ప్రసిధ్ధి చెందిన ఏ ప్రాజెక్టును తీసుకున్నా వాటిలో
తెలుగు వారి పాత్ర లేని ప్రాజెక్టు మనకు కనిపించదు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కూడా మన వారు ఎన్నో ఉన్నత శిఖరాలని అధిరోహించినారు. మన వారు తయారు చేసిన సాఫ్ట్వేర్లు, వారి సేవలు లేని దేశాలు బహుషా లేకపోవచ్చు. ఇన్ని విశిష్టతలు గల మనం స్వేచ్చా సాఫ్ట్వేర్ల వినియోగం మరియు వాటి అభివృధ్ధిలో గణనీయంగా వెనకబడి ఉన్నాం అని చెప్పడంలో సంధేహం లేదు. ఎందుకో మనలో స్వేచ్చా, ఉచిత సాఫ్ట్వేర్లంటే కొంత చిన్న చూపు ఉందని అనిపిస్తుంది. సమాజం కొరకు సమాజమే సాఫ్ట్వేర్లు తయారు చేసుకొని తిరిగిసమాజమే వాటిని ఉచితంగా వాడుకోవడం వలన ప్రజల, ప్రభుత్వాల సొమ్ము ఎంత ఆదా అవుతుంది. ఒక్క కేరళ లోనే కేవలం పాఠశాలల విషయం లోనే స్వేచ్చా, ఉచిత సాఫ్ట్వేర్లు వాడడం వలన కొన్ని కోట్ల విలువైన ప్రజాధనం ఆదా అయితే ఇక పూర్తి భారతదేశం విషయానికి వస్తే మరెంత ఆదా అవుతుంది. కేవలం అవగాహన లేకపోవడం వలన చాలా మంది వ్యక్తిగత ధనం కూడా వృధా చేసుకుంటున్నారు. నిధానంగా సాగుతున్న  స్వేచ్చా,ఉచిత సాఫ్ట్వేర్ల అభివృద్ధి తెలుగువారి ప్రవేశంతో వేగవంతమవుతుందని నా బలమైన నమ్మకం. కనుక తెలుగు సాఫ్ట్వేర్ వీరులారా సొంత లాభం కొంత మానుకోకుండా కొంత సమయం మాత్రమే కేటాయించి సరికొత్త సాఫ్ట్వేర్ విప్లవంలో మీరుకూడా పాలుపంచుకోండి.