ఉబుంటు ఎన్ని రకాలు?

 ప్రముఖ ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం అయిన ఉబుంటు మనకు వివిధ రకాలుగా అందుబాటులో ఉంది. ఉబుంటు డెస్క్ టాప్, ఉబుంటు సర్వర్, ఉబుంటు టచ్(టాబ్లెట్లు,ఫోన్లు) మరియు ఉబుంటు టివి అని ఆయా పరికరాలకు ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం లభిస్తుంది. ఇక ఉబుంటు డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం మనకి 32బిట్ మరియు 64బిట్ లలో లభిస్తుంది. 
 ఇవి కాకుండా ఉబుంటు డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం ని మనం వేరువేరు రూపాలతో వేరువేరు పేర్లతో చూస్తుంటాము. వాటిలో అధికారిక గుర్తింపు పొందినవి.
 ఇవి కాకుండా వివిధ భాషలలో కమ్యూనిటి చే స్థానికీకరణ చేయబడిన, వేరువేరు పనులని ఉద్దేశించి తయారుచేయబడిన వివిధ రూపాంతరాల తో పాటు ఉబుంటు ఆధారిత ఆపరేటింగ్ సిస్టం లు (లినక్స్ మింట్ వంటివి)చాలా ఉన్నాయి. వాటిని గురించి ఇక్కడ చూడవచ్చు.

మీ స్వేచ్ఛను రెట్టింపు చేసుకోండి

 వేలకువేలు వెచ్చించనవసరం లేకుండా ఉచితంగా దొరికే లిబ్రే ఆఫీస్ ప్రముఖ వాణిజ్య ఆఫీస్ అనువర్తనాలకు చక్కని ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు లిబ్రే ఆఫీస్ అందించే అన్ని సదుపాయాలను ఇన్ స్టాల్ చేయనవసరం లేకుండానే వాడుకోవచ్చు. మనకు అవసరం వచ్చినపుడు వాడుకోవడానికి అనువుగా తయారుచేయబడిన లిబ్రే ఆఫీస్ పోర్టబుల్ మనతో పాటు పెన్ డ్రైవ్ లో తీసుకుపోయి ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోవచ్చు. లిబ్రే ఆఫీస్ పోర్టబుల్ కూడా ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్. లిబ్రే ఆఫీస్ పోర్టబుల్ ని క్రింది లంకె నుండి దింపుకోవచ్చు.

అన్నిరకాలైన సందేశాలను తీసుకెళ్ళే ఈ పావురం ఉచితంగా మీకోసం

 మనం సాదారణంగా చాట్ చేయడానికి యాహు మెసెంజర్, గూగుల్ టాక్ మరియు పేస్ బుక్ చాట్ వంటి వివిధ అప్లికేషనలని వాడుతుంటాము. విడివిడిగా వివిధ చాటింగ్ అనువర్తనాలను ఇన్ స్టాల్ చేసుకోవడం వలన సిస్టం నెమ్మదించవచ్చు. అన్ని రకాల చాట్ సర్వీసులని వాడుకోగలిగిన ఒకే మెసెంజర్ అప్లికేషన్ ఉంటే బాగుంటుందికదూ? అది ఉచితంగా దొరికితే ఇంకా బాగుంటుంది కదా?


 దానికి సమాదానమే పిడ్గిన్ యూనివర్సల్ చాట్ క్లయింట్. ఇది మనకు అందుబాటులో ఉన్న దాదాపు అన్ని చాట్ సర్వీసులతో పనిచేస్తుంది. దీనిని ఉపయోగించి పలురకాల చాట్ సర్వీసులలో ఒకేసారి ,ఒకే సర్వీసులో వేరువేరు ఖాతాలను ఉపయోగించి ఒకేసారి చాట్ చేసుకోవచ్చు. మనకు కావలసిన అధనపు విశిష్టతలను అందుబాటులో ఉన్న అనేక ప్లగిన్ లను ఉపయోగించి పొందే అవకాశము కలదు. చాట్ చేయడమే కాకుండా ఫైళ్ళను పంపుకోవడం, బడ్డి చిహ్నాలు, వివిధ రకాల స్మైలీలు, కావలసినట్లు మన స్థితిని చూపించు సందేశాన్ని మార్చుకోవడం మరియు వివిధ చాట్ సర్వీసులలో ఉండు వివిధ విశిష్టతలు కలిగి ఉండుట దీని ప్రత్యేకత.
 విండోసు, మాక్ మరియు అన్ని లినక్స్ ఆపరేటింగ్ సిస్టం లలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఆయా ఆపరేటింగ్ సిస్టం లకి తగినట్లు వాటి సిస్టం ట్రేలో ఒదిగిపోతుంది. ఇంతగా ఉపయోగపడే ఈ అప్లికేషన్ ఎటువంటి ప్రకటనలు లేని పూర్తిగా ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్. ఇది ఒపెన్ సోర్స్ అప్లికేషన్ కావడం వలన ఎవరైనా ఉచితంగా వాడుకోవచ్చు. దీని సోర్స్ కోడ్ ని తమకు తగినట్లుగా మార్చుకొని తిరిగి వేరొకరితో పంచుకోవచ్చు. ఉబుంటు వాడేవారు ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రము నుండి నేరుగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు పలు భాషలలో లభిస్తున్నది. డౌన్లోడ్ చేసుకోవడానికి పైన ఉన్న పిడ్గిన్ బొమ్మని నొక్కండి.

మీరు నకిలీ సాఫ్ట్ వేర్ యొక్క బాధితులా?You may be a victim of software counterfeiting.












పైన చిత్రాలు మనం తరచు చూస్తూనే ఉంటాము. వ్యక్తిగత కంప్యూటర్లు మొదలుకొని దుకాణాలు, కార్యాలయాలు చాలా చోట్ల అందరికి చిరపరిచయమైన ఈ సమస్యకి మరి పరిష్కారం లేదా?
 దీనికి ఇప్పటికే ఎన్నో పరిష్కారాలు అంతర్జాలంలో మనకి లభిస్తున్నాయి. వాటిలో చాలా సులువైనది సిస్టమును అప్ డేట్ చేయకుండా ఉండడం. సాఫ్ట్వేర్ అప్ డేట్ లేకపోతే మన సిస్టం కి బధ్రత కరువైనట్లే. మనకి అందుబాటు లో ఉన్న మిగిలిన మార్గాలలో చట్టబద్దత ఎంత? 
మరి దీనికి పరిష్కారం?
 లేకే నకిలీ సాఫ్ట్వేర్లని వాడకపోవడమే.
చెప్పడానికి బానే ఉంది కాని వేలు పోసి కొనాలి. నాకంత స్థోమత లేదు. మరి మీరిస్తారా?
 సాఫ్ట్వేర్ అంటే కొనాలి/నకిలీదే కాదు ఉచితంగా లభించేవి కూడా ఉన్నాయి. మనం చేయ్యాల్సిందల్లా కేవలం నకిలీ సాఫ్ట్వేర్ వాడే అలవాటును వదులుకోవడమే. మీరిస్తారా అని అడిగారు కదా. కాదు నేను కేవలం సమాచారాన్ని మాత్రమే ఈ బ్లాగు ద్వారా అందిస్తాను. ఉచిత సాఫ్ట్వేర్లా లేదా నకిలీ వాడాలా అన్నది నిర్ణయించుకోవలసింది వాడేవారే. లాభాపేక్షలేని వ్యక్తులు సంస్థలు ఇప్పటికే ఎన్నో ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్లను తయారుచేసాయి. ఇప్పటికే వాటిలో చాలా వాటికి చాలా మంది వాడి నకిలీల బెడదను వదిలించుకున్నారు. 
ఉచితంగా దొరికే అనామకులు తయారుచేసిన సాఫ్ట్వేర్ల కన్న నకిలీ అయినప్పటికి పెద్ద సంస్థలు తయారుచేసిన వాటిని వాడడం మేలు కదా?
 అనామకులని తీసిపారేయకండి. పెద్దవాళ్ళ సాఫ్ట్వేర్లకి గర్వభంగం కలిగించిన ఉచిత సాఫ్ట్వేర్లను గురించి చెపెతే చాంతాడంత ఉంటది. ఉధాహరణకు పైర్ ఫాక్స్, వియల్సి, ఆండ్రాయిడ్, ఉబుంటు, లినక్స్ మింట్, 7జిప్, వర్డ్ ప్రెస్, ఒపెన్ ఆఫీస్, లిభ్రే ఆఫీస్, తండర్ బర్డ్, వికీపీడియా ఇలా చాలా ఉన్నాయి.
ఎవరైనా వాడుతున్నారా?
చాలామంది వ్యక్తులు వాడుతున్నారు. పెద్ద సంస్థలు కూడా ఉచిత సాఫ్ట్వేర్ల జపం చేస్తున్నాయి. గూగులోడు, నాసావోడు వాడగా లేనిది మనం వాడలేమా.
 ఇంక అనుమానం ఎందుకు మన రక్తంలో, సంసృతిలో, చదువుల్లో ఇంకిపోయిన ఈ నకిలీని సాగనంపు.
 మనం వాడే నకిలీ ఆపరేటింగ్ సిస్టంకి ప్రత్యామ్నాయంగా, ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఉచిత ఆపరేటింగ్ సిస్టములని ఇక్కడ చూడవచ్చు. వాటిల్లో మనకు నచ్చినది నప్పేది మనం ఉచితంగా వాడుకోవచ్చు.

అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి కృషి చేస్తున్న

 తెలుగుని కంప్యూటర్లో చూడవచ్చు, వ్రాయవచ్చని, తెలుగులో జాలాన్ని అన్వేషించవచ్చునని అందరికి తెలియజేయడానికి, రోజువారీ సంభాషణలని తెలుగులో జరుపుకోవడాన్ని ప్రోత్సహించడానికి, తెలుగులో అందుబాటులో ఉన్న అంతర్జాల సేవలను అందరికి తెలియజేయడానికి, సాఫ్ట్వేర్ల తెలుగీకరణని ప్రోత్సహించడానికి ఏర్పడిన సంస్థ e-తెలుగు. తెలుగువారందరూ తమ అవసరాలకి కంప్యూటర్లనూ, మెబైళ్ళనూ, అంతర్జాలాన్నీ తెలుగులో వాడుకోగలగాలనే స్వప్నంతో ఆ దిశగా కృషిచేస్తున్న లాభాపేక్షలేని సంస్థ e-తెలుగు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద నమోదయిన ఈ సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైటు www.etelugu.org
  అంతర్జాలంలో బ్లాగులు, గుంపులు వంటి వివిధ వేదికల ద్వారా తెలుగు బ్లాగరులు నిత్యమూ కలుసుకుంటూండేవారు. ముఖాముఖి కూడా కలిస్తే బాగుంటుందని ఆలోచించి 2006 మార్చి 12 న మొదటి సారి హైదరాబాదులో సమావేశమయ్యారు. అప్పటినుండి, ప్రతీనెలా రెండవ ఆదివారం నాడు హైదరాబాదు తెలుగు బ్లాగరులు, వికీపీడియనులు సమావేశమౌతూ వస్తున్నారు. ఈ సమావేశాలలో తెలుగు బ్లాగుల గురించిన సాధకబాధకాల గురించీ వికీపీడియా పురోగతి గురించీ చర్చించేవారు. తెలుగువారికి వీటిని గురించి తెలియజెయ్యడానికి ఏమేం చెయ్యాలి అన్న విషయాల గురించి కూడా చర్చిస్తూ ఉండేవారు. ముందుగా అతి తక్కువ శ్రమతో కంప్యూటరులో తెలుగు కనిపించేలా చేసుకోవచ్చనీ, ఇంగ్లీషులోలానే తెలుగులోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవచ్చనీ, తెలుగువారికి తెలియజెయ్యాల్సిన అవసరం ఉందని గ్రహించారు. ఈ అంశాలను ప్రచారం చేసి, మరింతమంది ఔత్సాహికులను చేర్చుకొంటే, మరిన్ని పనులను, మరింత త్వరగా చేయగలమని భావించారు.  ఈ కార్యక్రమాలన్నిటినీ ఒక గొడుగు కిందకు చేర్చి, ఒక లాభాపేక్ష లేని సంస్థ ఆధ్వర్యంలో చేస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చని భావించి e-తెలుగుని ఏర్పాటుచేసారు.
 e-తెలుగు కంప్యూటరులో తెలుగును స్థాపించుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తుంది. ఇందుకవసరమైన సాఫ్టువేరు ఉపకరణాలను కూడా తయారుచేసి ఉచితంగా అందిస్తుంది. తెలుగులో టైపు చేసేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. లిప్యంతరీకరణకు అవసరమైఅన ఉపకరణాల గురించి ప్రచారం చేస్తుంది. ఇప్పటికే వివిధ కీబోర్డు లేఔట్లను వాడి తెలుగులో టైపు చేస్తున్నవారికి అవే లేఔట్లను వాడి యూనికోడులో కూడా టైపు చేసేందుకు అవసరమైన సాఫ్టువేరు ఉపకరణాలను తయారుచేసి, ఉచితంగా అందుబాటులో ఉంచింది. ఈ విషయమై ప్రచారమూ చేస్తోంది. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికై చేసే కృషిలో భాగంగా బ్లాగులను, వికీపీడియాను, వెబ్ పత్రికలను, ఇతర తెలుగు వెబ్‌సైట్లను తెలుగువారికి పరిచయం చేస్తోంది. వివిధ సాఫ్టువేరు ఉపకరణాల స్థానికీకరణ గురించి తెలియని వారికి తెలియజేస్తూ, తెలిసిన వారికి వాటికి సంబంధించిన విషయాలలో సాంకేతిక సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తోంది.