పెరుగుతున్న యుపిఐ క్యూఆర్ కోడ్ మోసాలు, మనమేం చేయాలి?

సులభంగా,  వేగంగా, సురక్షితంగా, వాలట్‌ విధానం వలే కాకుండా నేరుగా బ్యాంకు అకౌంట్ నుండి బ్యాంకు ఆకౌంట్ కి నగదు బదిలీ జరగడం వలన అందరు చెల్లింపుల విధానం పై ఆధారపడుతున్నారు. మన బ్యాంకు ఖాతాకి అనుసంధానించిన మొబైల్ నెంబర్ ఆధారంగా జరిగే UPI చెల్లింపుల విధానం అన్ని బ్యాంకులు, ఆన్ లైన్ మరియు
సాధారణ మరియు చిన్న వ్యాపారాలు (పాలు, కూరగాయలు, పండ్లు) ఆమోదించడం వలన వేగంగా ప్రజాదరణ పొందింది. జనాలు ఎక్కువగా వాడుతున్నారుగా మోసగాళ్ళు కూడా వచ్చేసారు.తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఇటు వంటి మోసాలు వెలుగు చూస్తున్నాయి. చదువుకొన్న వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వీళ్ళ బారిన పడుతున్నారు. ఎక్కువగా పదవి విరమణ చేసినవారిని లక్షంగా చేసుకుంటున్నారు.


ఎలా?
మన ఫోన్ నంబరుని సోషల్‌ మీడియా లేదా OLX, క్వీకర్ వంటి సైట్ల నుండి తీసుకొని మనకి ఒక QR కోడ్ పంపిస్తారు డబ్బు 'రిసీవ్' చేసుకొవడానికి అని. మనం ఏదైనా UPI యాప్ తో స్కాన్ చేసినప్పుడు 'రిసీవ్'  అని కాకుండా 'సెండ్' అన్న బటన్ ఉంటుంది. వాడు మెసేజ్ లో మాత్రం మనం డబ్బు రిసివ్ చేసుకోడానికి అని రాస్తాడు. QR కోడ్ మాత్రం వాడు రిసీవ్ చేసుకొవడానికి. మనం ఒక వేళ చూసుకోకుండా బటన్ తాకి UPI పిన్ టైప్ చేస్తే మన అకౌంట్ నుండి డబ్బు మోసగాని అకౌంట్ కి జమ అవుతుంది. మీరు క్రింది చిత్రంలో నాకు ఆవిధంగా వచ్చిన QR కోడ్ ని చూడవచ్చు.


చిత్రాన్ని గమనిస్తే ఫోన్ నంబరు వేరే రాష్ట్రానికి చెందినది. బ్యాంకు ఖాతా మన రాష్ట్రానిది. అలానే స్కాన్ చేసినపుడు వేరే నంబరు రావడం కూడా చూడవచ్చు. నమ్మించడం కోసం, దొరక్కుండా ఉండడం కోసం ఇలా మన ప్రాంతంలో కొందరి దగ్గర బ్యాంక్ అకౌంట్‌లు కిరాయికి తీసుకుంటారు.

ఎం చేయాలి?
తెలియనివాళ్ళ నుండి వచ్చిన QR కోడ్లు స్కాన్ చెయ్యవద్దు. మన 5అనసరంలో ఎవరైనా QR కోడ్ పంపిస్తే దాన్ని స్కాన్ చేయనవసరం లేదు, మొబైల్ నెంబరు కి డబ్బు పంపమని చెప్పండి. ఒక వేళ తప్పక QR కోడ్ స్కాన్ చేయ్యాల్సి వస్తే, స్కాన్ చేసిన తర్వాత వచ్చే స్ర్కీన్ లో ఉండే బటన్ 'సెండ్' లేదా 'రిసీవ్' జాగ్రత్తగా చూడండి. ఒకటికి రెండు సార్లు మీరు 'పంపేవారా' లేక  'తీసుకునేవారా' అని నిర్థారించుకొన్న తర్వాతే పిన్ ఎంటర్ చెయ్యండి.

జాగ్రత్త మోసపోకండి, ఎవరిని మోసపోనివ్వకండి.