అసెంబుల్డ్ ఫోన్లు రాబోతున్నాయి

సాధారణంగా కంప్యూటరు కొనాలంటే చాలా మంది అసెంబుల్డ్ కంప్యూటర్ల వైపు మొగ్గుచూపుతుంటారు. ఎందుకంటే మనకు కావలసిన ధరలో మన అవసరానికి తగినట్టు విడిబాగాలను ఎంచుకొనే అవకాశం ఉంటుంది కనుక. అంతేకాకుండా భవిష్యత్తులో ఎప్పుడైనా పూర్తి కంప్యూటరును మార్చకుండానే చెడిపోయిన లేదా పెరిగిన అవసరానికి తగినట్టుగా ఒక
భాగాన్ని మాత్రమే మార్చుకొని మన కంప్యూటరు జీవితకాలాన్ని పొడిగించుకొనే అవకాశం ఉంటుంది. తద్వారా డబ్బుతో పాటు పర్యావరణానికి పెను సవాలుగా మారిన ఇ వ్యర్ధాలను కూడా నివారించవచ్చు.
భూమి మీద వేగంగా పెరుగుతున్న వ్యర్ధాలలో మొదట చెప్పుకోవలసింది మొబైల్ ఫోన్ వ్యర్ధాలు. కంప్యూటరు తో పోల్చితే మొబైల్ ఫోన్ సగటు జీవితకాలం తక్కువగా ఉండడమే దీనికి కారణం. ఎప్పటికప్పుడు కొత్త రకాల ఫోన్లు ఎక్కువ ఫీచర్లు కలిగి ఉన్న ఫోన్‌లు తక్కువ ధరకు వచ్చేయడం, కొన్ని కీలకమైన విడిభాగాలు చెడిపోతే మొత్తం ఫోన్‌ మార్చాల్సిరావడం వంటి కారణాల వలన ఫోన్ సగటు  జీవితకాలం తక్కువగా ఉంటుంది. దీని వలన ఫోన్‌ వ్యర్ధాలు రానున్న రోజులలో ముప్పుగా పరిణమించబోతున్నాయి. దీనికి విరుగుడుగా జరుగుతున్న ప్రయత్నాలలో మొదటిది గూగుల్ వారి ప్రాజెక్ట్ అర.

       
ఈ ప్రాజెక్ట్ అర ముఖ్యోధ్దేశము మనం కంప్యూటర్లలో ఏవిధంగా అయితే మనకు కావలసిన విడిభాగాలను ఎంచుకొని కంప్యూటరును తయారు చేసుకుంటామో అదేవిధంగా ఫోన్‌లలో కూడా మనకు కావలసిన స్పెసిఫికేన్‌లో విడిభాగాలను చేర్చుకొని ఫోన్‌ని తయారుచేసుకొనే వెసులుబాటు కల్పించడం, అదేవిధంగా భవిష్యత్తులో అవసరాలకి తగిన విధంగా ఫోన్‌ సామర్హ్యాన్ని సులభంగా పెంచుకోగలగడం ద్వారా ఫోన్ జీవితకాలాన్ని పెంచడం.



ఈ విధంగా తయారుచేసుకొనే ఫోన్ను మాడ్యులార్ ఫోన్ అని ఫోన్‌లో ఉన్న విడిభాగాలను మాడ్యూళ్ళు లేదా ఫోన్ బ్లాకులు అని అంటారు.  దీనిలో బేస్ ప్లేట్ ఉంటుంది దానికి మనకు కావలసిన మాడ్యూళ్ళను చేర్చుకొని ఫోన్ను తయారుచేసుకోవడమే. ఉదాహరణకు మనం ఫోను తయారుచేసుకోవాలంటే మొదట బేస్ ప్లేట్ కొనుక్కొని దానికి ప్రాససర్ మాడ్యూల్, రామ్‌ మాడ్యూల్, స్టోరేజ్ మాడ్యూల్, తెర మాడ్యూల్, నెట్ వర్క్ మాడ్యూల్, వైఫి మాడ్యూల్, బ్లూటూత్ మాడ్యుల్, కెమేరా మాడ్యూల్, స్పీకర్ మాడ్యూల్, బ్యాటరీ మాడ్యూల్ ఇలా మనకు కావలసిన స్పెసిఫికేషన్‌లలో మనకు కావలసిన ఫీచర్లను మాడ్యూళ్ళ రూపంలో చేర్చుకొని ఫోన్‌ను తయారుచేసుకోవడమే.
ఆసక్తి కలిగించే ఈ మాడ్యులార్ ఫోన్ వచ్చే ఏడాది మన ముందుకు వచ్చే ఆవకాశం ఉందంట. క్రింది వీడియోలో ఈ మాడ్యులార్ ఫోన్ ఏవిధంగా ఉంటుందో చూడవచ్చు.