ఎక్కడ చూసినా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న పరికరాలు మనకి కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టంగా పేరు పొందినది ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టం. దీనిని సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తయారుచేసి విడుదలచేస్తుంది. దానిని మొబైల్ తయారీదారులు వాళ్ళకి తగినట్టుగా మార్చుకొని వాళ్ల పరికరాలలో ఉంచి మనకు అమ్ముతారు. ఆవిధంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంకి సంబందించిన పరికరాలు ఒక్క గూగుల్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలువురు వారి పరికరాలతో పాటు అమ్ముతున్నారు. మరి గూగుల్ విడుదలచేసిన వెంటనే మనకి అప్‌డేట్‌లు రావడానికి మధ్యలో తయారీదారు ఉన్నాడు. వాళ్ళు గూగుల్ విడుదలచేసిన అప్‌డేట్‌ని తమ పరికరానికి తగినట్లు మార్చి దానిని పరిక్షించి విడుదలచేయడానికి సమయం తీసుకుంటుంది కనుక మనకు అప్‌డేట్స్ రావడం ఆలస్యం అవుతుంది. అయితే కొన్ని పెద్ద సంస్థలు వాటికున్న వనరుల వలన కొంత వరకు అప్‌డేట్స్ ఇచ్చినప్పటికి భవిష్యత్తు వ్యాపారం దృష్ట్యా కొన్ని రోజుల వరకే అప్‌డేట్స్ అందిస్తువస్తున్నాయి. ఇది కూడా ఆకంపెనీలకు ఖర్చుతో కూడుకున్న విషయం కనుక చాలా దిగువ శ్రేణి మొబైల్ తయారీదారులు అసలు అప్‌డేట్లు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కూడా ఫోన్‌తో వచ్చిన దానికంటే పనితీరు బాగాలేకపోవడం వంటి సమస్యలు ఎదురవడం మనం గమనించవచ్చు. అందువలన మనం ఫోన్ లేదా టాబ్లేట్ కొన్నపుడు కొంచెం ధర ఎక్కువైనా మంచి కంపెనీది కొనుక్కోవడం ఉత్తమం.
నెక్సస్ 5 కి ఆండ్రాయిడ్ 4.4.4 అప్‌డేట్ |
గూగుల్ తమ నెక్సస్ పరికరాలకు వెంటనే అప్‌డేట్లు విడుదలచేస్తుంది. అదే విధంగా ప్లే స్టోర్‌లో అమ్ముతున్న వివిధ కంపెనీల పరికరాలకు కూడా ఆయా కంపెనీలు త్వరగా అప్‌డేట్లు విడుదలచేసేటట్లు చూస్తుంది. ఇకపోతే గూగుల్ కాకుండా తమ పరికరాలకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ త్వరగా ఇచ్చే సంస్థలు మొటోరోలా, సోనీ, హెచ్‌టిసి, యల్‌జి తరువాత సాంసంగ్. ఆపిల్ గాని యమ్‌యస్ కానీ ఏ సంస్థ అయినా జీవితకాలం అప్‌డేట్స్ ఇవ్వలేదు. అదే విధంగా వెర్షన్ అప్‌గ్రేడ్ కూడా ఒకటి లేదా రెండు వెర్షన్‌లకు మాత్రమే ఇస్తారు. ఫోన్ విడుదలచేసిన సుమారు రెండు సంవత్సరాలు వరకు మాత్రమే అప్‌డేట్స్ విడుదలచేస్తారు. ఒకవేళ అంతకుమించి అప్‌డేట్స్ ఇవ్వడానికి సిద్దపడితే చాలా అధనపు భారం పడుతుంది తద్వారా భవిష్యత్తు ఆవిష్కరణలు లేక కంపెనీ మూత పడినా పడుతుంది. అందువలన కంపెనీలు పాత పరికరాలకు అప్‌డేట్స్ ఇవ్వడానికి ముందుకురావు.
ఆపిల్ గాని యమ్‌యస్ కానీ లేని అవకాశం ఆండ్రాయిడ్‌కి ఉంది. అదే ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ కావడం. ప్రతి ఆండ్రాయిడ్ వెర్షన్ విడుదలచేసిన వెంటనే గూగుల్ దానికి సంబందించిన సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉండేటట్లు పెడుతుంది. దానిని వాడుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒత్సాహిక డెవలపర్లు లాభాపేక్ష లేకుండా వివిధ పాత పరికరాలకి కూడా కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ని అందుబాటులోకి తెస్తారు. దానిని అందరికి ఉచితంగా అందజెస్తారు. అందువలన మనం ఫోన్ కొనే ముందు దాని ధర మాత్రమే కాకుండా దాని నాణ్యత, ఫీచర్లు, తయారీదారు ఎవరు మరియు ఆ పరికరం ఎంత వరకు ప్రాచూర్యం పొందినదో చూసుకొని కొనడం ఉత్తమం. జనాధరణ పొందిన ఫోన్‌లకి కొత్త ఆండ్రాయిడ్ తీసుకొని రావడానికి డెవలపర్లు కూడా సానుకూలంగా ఉంటారు. అప్‌డేట్స్ నిలిచిపోయిన పరికరాలకు సరికొత్త ఆండ్రాయిడ్ ని రుచిచూపించే పలు ఆండ్రాయిడ్ రామ్‌లు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనం చెప్పుకోవలసింది సైనోజెన్‌మోడ్ గురించి. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ ఆధారంగా తయారు చేసినప్పటికి , అంతా ఆండ్రాయిడ్ లా ఉన్నప్పటికి ఈ సైనోజెన్‌మోడ్ని ఒకసారి వాడితే మన ఫోన్ కొన్నప్పుడు వచ్చే ఆండ్రాయిడ్ వాడాలనిపించదు.