కంప్యూటర్ ఉంటే ఇవి తప్పనిసరి

 ఈ రోజుల్లో కంప్యూటర్ లేని వారు చాలా అరుదు. చాలా వరకు అందరి ఇళ్ళలో, చిన్న పెద్దా దుకాణాలలో, పాఠశాలలలో ఇలా అన్ని చోట్లా కంప్యూటరు పాగా వేసింది. ఇంత ప్రాచుర్యం పొందినప్పటికి ఇప్పటికి చాలా మంది కంప్యూటరు తో ఉండవలసిన అత్యవసర సామాగ్రి మాత్రం కలిగి ఉండడం లేదు. ఈ సామాగ్రి ఉంటే మనమే చాలా వరకు సమస్యలను అధిగమించవచ్చు లేదా సమస్య ఏమిటో తెలుసుకొని అదనపు వ్యయాన్ని అరికట్టవచ్చు. ఆ సామాగ్రి కూడా పెద్ద ఖరీదైనవేం కాదు. మనం ఒకసారి చదివించుకున్న డబ్బులతో వీటిని కొనుక్కోవచ్చు. చాలా రోజులు పాటు వాడుకోవచ్చు.

 దుమ్ము దులపడానికి:

కంప్యూటరు లో వచ్చే చాలా సమస్యలకి పరిష్కారం దుమ్ము దులపడం. కంప్యూటరులో ఉండే పరికరాలు చాలా సున్నితమైనవి కనుక మనం ఈ పని చాలా జాగ్రత్తగా చేయాలి. బట్టతో తుడవడం వంటివి చేయగూడదు. మనం ఈ పనికి బ్లోయర్ కాని మెత్తని రంగులేసే బ్రష్‌ని కాని ఉపయోగించవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా రంగులేసే బ్రష్‌తో సున్నితంగా దుమ్ముని తొలగించుకోవచ్చు.

బ్లోయర్


రంగులేసే బ్రష్

స్క్రూడ్రైవర్:

మనం సాధారణంగా‌ వాడే స్క్రూడ్రైవర్ కాకుండా నక్షత్రాకార స్క్రూడ్రైవర్ కంప్యూటర్ లో చాలా భాగాలను విప్పడానికి పనికొస్తుంది. కనీసం మనం శుభ్రం చేసుకోవాడానికి డబ్బాని విప్పడానికి ఒక స్టార్ స్క్రూడ్రైవర్ ఉండాలి. లేదా మూడొందలు మనవి కావనుకుంటే వివిధ రకాల పరిమాణాలున్న స్క్రూడ్రైవర్ సెట్ వస్తుంది. 

స్టార్ స్క్రూడ్రైవర్

కంప్యూటర్ బాగుచేయడానికి ఉపయోగపడే వేరువేరు పరిమాణాలున్న స్క్రూడ్రైవర్ సెట్టు

యాంటీస్టాటిక్ రిస్ట్ బేండ్:

 మన కంప్యూటరులో ఉండే విడిభాగాలు అన్ని చిన్న చిన్న సున్నితమైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లను కలిగి ఉంటాయి. అవి చాలా తక్కువ ఓల్టేజితో పనిచేస్తాయి. మన కదలికల ద్వారా ఉత్పత్తి అయిన స్టాటిక్ ఎలెక్ట్రసిటి ఓల్టేజి వలన కూడా అవి పాడయిపోయే ప్రమాదం ఉంది కనుక స్టాటిక్ ఎలెక్ట్రసిటి ని డిస్చార్జి చేయడానికి యాంటీస్టాటిక్ రిస్ట్ బేండ్ ధరించాలి.

కంప్యూటరుని బాగు చేస్తున్నపుడు యాంటీస్టాటిక్ రిస్ట్ బేండ్ తప్పనిసరి

హీట్ సింక్ కాంపౌండ్:

మనం కంప్యూటరు వాడుతున్నపుడు ఎక్కునగా పనిచేసే భాగం, మరియు వేడిని ఉత్పత్తి చేసే బాగం ప్రాససర్. దీనికి ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ ఉండి దీనిని చల్లబరుస్తు ఉంటుంది. ఆ ఫ్యానుకి ప్రాససర్‌కి మధ్య పేస్టులాంటిది ఉంటుంది. ఇది కొన్నిరోజులకి అయిపోతుంది. అలాంటప్పుడు ప్రాససర్ వేడెక్కి కంప్యూటర్ ఆగిపోతుంది. అందువలన కంప్యూటర్ శుభ్రపరిచినప్పుడల్లా కాకుండా కనీసం సంవత్సరానికొకసారి అయినా ఈ హీట్ సింక్ పేస్టుని పెట్టుకోవాలి. ఇది మనకి చిన్న డబ్బా, ట్యూబు, చిన్న పాకెట్, సిరంజిలో లభిస్తుంది.

హీట్‌సింక్ కాంపౌండ్

డయాగ్నసిస్ టూల్:

మన కంప్యూటర్లో ఉన్న వివిధ పరికరాలలో సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఈ అధ్బుతమైన టూల్ ఉపయోగపడుతుంది. అల్టిమేట్ బూట్ సిడి అను ఈ టూల్ ని ఉపయోగించి హార్డ్ డిస్క్ డయాగ్నసిస్, రామ్‌ మరియు ప్రాససర్ ఇలా అన్ని పరికరాలను పరిక్షించవచ్చు.

అల్టిమేట్ బూట్ సిడి

ఆపరేటింగ్ సిస్టం :

మనం కంప్యూటర్ కొన్నప్పుడు వచ్చే ఆపరేటింగ్ సిస్టం సిడి లేదా మన సిస్టం యొక్క రికవరీ డిస్క్ తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఆ సిడి లేదా డీవీడీ మీ దగ్గర లేకపోతే ఉచితంగా దొరికే ఆపరేటింగ్ సిస్టం సిడి ఇమేజిని ఇక్కడ నుండి దింపుకోని సీడీలలో వ్రాసుకోవచ్చు. అవసరమయినప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు లేదా సీడీ నుండే లైవ్‌గా వాడుకోవచ్చు. ఈ లైవ్ సీడీని ఉపయోగించి సులభంగా పాడయిపోయిన సిస్టం నుండి డాటాని రికవరీ చెయ్యవచ్చు. ఈ లినక్స్ ఉచిత ఆపరేటింగ్ సిస్టం లను పెన్‌డ్రైవ్ నుండి కూడా ఇక్కడ చెప్పినట్లు తయారుచేసుకొని వాడుకోవచ్చు.

డెబియన్ సిడి
పెన్‌డ్రైవ్ లో ఉబుంటు

డ్రైవర్లకి పరిష్కారం:

 విండోస్ వాడేవారు తప్పక ఉంచుకోవలసిన సిడీ డ్రైవర్ పేక్ సొల్యూషన్ డివీడి. విండోస్ ఇన్‌స్టాల్ చేసిన తరువాత డైవర్ల గురించి వెతకనవసరం దీని ద్వారా మనం తప్పించుకోవచ్చు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.