యక్స్‌పిని ఎందుకు సమాధి కట్టి సంతాపం?

 ఏ వార్తా పత్రిక చూసినా యక్స్‌పి ఇక లేదు, యక్స్‌పికి సెలవు, సపోర్ట్ నిలిపివేత అని సంచలనాత్మక వార్తలు. సామాజిక అనుసంధాన వేదికలలో (పేస్‌బుక్,గూగుల్+,ట్విట్టర్ మొదలైన వాటిలో) అయితే మరి విపరీతంగా సమాధి కట్టి సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ ప్రచారం వెనుక అసలు కారణాలు, వచ్చే సమస్యలు, తాత్కాలిక మరియు శాశ్వత పరిష్కారాలు మనం ఈ రోజు తెలుసుకోవలసిందే.

యక్స్‌పికి మైక్రోసాఫ్ట్ సపోర్ట్ నిలిపివేయడంతో పేస్‌బుక్‌లో ప్రచారంలో ఉన్న ఒక చిత్రం

 యక్స్‌పి ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం. దాని తయారీదారు అయిన మైక్రోసాఫ్ట్ వాడు అధికారికంగా సపోర్ట్ నిలిపివేయడం వలన దానికి ఉన్న ప్రాచుర్యం మరియు ఆదరణ కారణంగా ఈ విధంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. అంటే ఇక నుండి మైక్రోసాఫ్ట్ నుండి దానికి సెక్యూరిటీ అప్‌డేట్స్ రావన్నమాట. దానివలన సగటు కంప్యూటరు వాడుకరికి వచ్చే ఇబ్బంది ఏమిటి? మనకు కనిపించే కధనాలలో అయితే బధ్రత మరియు కొత్త ఫీచర్లు దానికి కారణంగా చెపుతున్నారు. మన శ్రేయస్సుకోరి ఈవిధంగా ప్రచారం జరుగుతుందా? లేక మనల్ని బయభ్రాంతులకి గురిచేసి మరో ఆపరేటింగ్ సిస్టం లేదా మరో ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న లాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కొనుక్కోనే  దిశగా మనల్ని తయారుచేయడానికా?
 చిన్నారి పొన్నారి యక్స్‌పి నిన్నెవరు చంపారమ్మా అని యక్స్‌పిని అడిగితే అది కచ్చితంగా మైక్రో సాఫ్ట్ వాడు నన్ను చంపాడు, కంప్యూటరు తయారీదారులు నా పీక నొక్కారని అంటుందేమో. ఎందుకంటే సాంకేతికంగా యక్స్‌పి కి ఇప్పుడు సపోర్ట్ నిలిపివేసి ఉండవచ్చు, కాని మనం కొన్ని విషయాలు గమనిస్తే మనకి ఎప్పుడో నిలిపివేసినట్లు అర్ధమవుతుంది. మైక్రోసాఫ్ట్ వాడి ఆస్థాన వెబ్ బ్రౌసర్, ఆఫీస్, మీడియా ప్లేయర్, ఇ మెయిల్ క్లయింట్ మరియు వివిధ సాఫ్ట్వేర్లకి వాటి కొత్త వెర్షన్‌లను యక్స్‌పికి విడుదలచేయడం ఎప్పుడో నిలిపివేసింది. అదేవిధంగా మనం కంప్యూటరు తయారీదారు వేబ్ సైటులో యక్స్‌పికి డ్రైవర్ల గురించి వెతికితే యక్స్‌పి తరువాతి ఆపరేటింగ్ సిస్టంలకు దొరుకుతాయి, కాని యక్స్‌పికి దొరకవు. అదేవిధంగా ఎప్పటి నుండో యక్స్‌పితో కంప్యూటర్లు అమ్మడంలేదు. యక్స్‌పికి మైక్రోసాఫ్ట్ సేవలు ఇప్పటికే క్రమక్రమంగా ఎప్పుడో నిలిపివేసింది. కొత్తగా నిలిపివేయడానికి ఏమిలేదు. ఇప్పటి యక్స్‌పి వాడుకర్లు ఎక్కువ మంది ఉండడం వలన మిగిలిన సాఫ్ట్వేర్ తయారీదారులు వారివారి సాఫ్ట్వేర్లను విడుదలచేస్తూనే ఉన్నారు. కేవలం మైక్రోసాఫ్ట్ మరియు కంప్యూటరు తయారీదారులు ఇరువురు పరస్పర సహకారంతో మనల్ని మరో కంప్యూటరు లేదా మరో ఆపరేటింగ్ సిస్టం కొనుగోలు చేయించడానికి సిద్దం చేస్తున్నారు. ఇక్కడ మనం వాళ్ళను తప్పుపట్టనవసరం లేదు ఎందుకంటే వాళ్ళు వ్యాపారులే కాని స్వచ్చంధ సంస్థలేమీ కాదుకదా.

సపోర్ట్ నిలిపివేయడం వలన మరి ఎవరికి నష్టం?

ఎవరైతే డబ్బులు పెట్టి యక్స్‌పిని కొనుక్కొని ఇప్పటికి దాని మీద ఆధారపడ్డారో వాళ్ళకి మాత్రమే. 

మరి ఈ ప్రచారం వలన ఎవరికి లాభం?

మైక్రోసాఫ్ట్ మరియు కంప్యూటరు తయారీదారులకి

   పెద్దపెద్ద కంపెనీలు యక్స్‌పి నుండి మరొక ఆపరేటింగ్ సిస్టం కు వెళ్ళడానికి పూర్తిగా కంప్యూటర్లని మార్చవలసి రావడంతో ఖర్చుకి వెనకాడి మైక్రోసాఫ్ట్ నుండి యక్స్‌పికి డబ్బులిచ్చి సపోర్ట్ని కొనుక్కోవడానికి సిద్దపడ్డాయి. ముందుచూపు గల కొన్ని సంస్థలయితే ఇప్పటికే ఉచిత సాఫ్ట్‌వేర్లను వాడడం ఉద్యోగులకి అలవాటు చేసాయి.  డబ్బున్న సంస్థలయితే ఇప్పటికే వేరే ఆపరేటింగ్ సిస్టంతో కొత్త కంప్యూటర్లను కొనుక్కున్నాయి. గూగులోడయితే తెలివిగా ముందునుండే ఉచిత ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నాడు. అయితే మరి సగటు యక్స్‌పి వాడుకరి పరిస్థితి ఏమిటి? తప్పని సరిగా వేరే ఆపరేటింగ్ సిస్టం లేదా కొత్త ఆపరేటింగ్ సిస్టం పనిచేసే కంప్యూటరు కొనుక్కోవలసిందేనా?
 అవసరం లేదు. యక్స్‌పి మునుపటిలాగే పనిచేస్తుంది. కొంపలేం అంటుకోవు, మనం బేషుగ్గా వాడుకోవచ్చు. బద్రతా కారణాలరీత్యా యక్స్‌పి ఎప్పుడో బలహీనమయిపోయింది. కొత్తగా అప్‌డేట్స్ రాకపోవడం వలన మనం కోల్పోవడానికి ఏమిలేదు. మనం చేయ్యాల్సిందల్లా మనం ఇప్పటిలాగే మన కంప్యూటరును మంచి యాంటీవైరస్ తో తరచు స్కాన్ చేసుకోవడం,ఆ యాంటివైరస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, నమ్మకం కలిగిన సైట్లనుండి మాత్రమే సాఫ్ట్‌వేర్లను డౌన్‌లోడ్ చేసుకోవడం, పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు ముందు తప్పక స్కాన్ చేసి తెరవడం వంటి ప్రాధమిక విషయాలు పాటించడం ద్వారా మనం ఎప్పుడూ వాడుక్కున్నట్లే వాడుకోవచ్చు. ఈ ప్రచారం అంతా మన జేబు చిల్లు పెట్టదానికే. ఒకవేళ మనం వేరే ఆపరేటింగ్ సిస్టం కొన్నామనుకోండి రాబోవు రోజుల్లో దానికి కూడా సపోర్ట్ నిలిపివేస్తాడు కదా? మరి దానికి శాశ్వత పరిషారం లేదా?
 లేకేం మనం మారడానికి సిద్దంగా ఉంటే మనకి ఉచితంగా ఎన్నో మార్గాలున్నాయి. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటరులోనే వాడుకోవడానికి ఎటువంటి ఖర్చు పెట్టనవసరం లేకుండానే దొరికే ఉచిత ఆపరేటింగ్ సిస్టం లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. మొదట కంప్యూటరు అంటే యక్స్‌పి లేదా విండోస్ అన్న బావన నుండి మనం బయటపడితే చాలు.
 ఇప్పటికే ఉచిత సాఫ్ట్వేర్ల దెబ్బకి పలు సాఫ్ట్వేర్ల ధరలు తగ్గడం మనం చూసాం. ఈ విధంగా మనం ఉచిత సాఫ్ట్వేర్లను వాడితే తొదరలోనే మైక్రోసాఫ్ట్ నుండి కూడా ఉచిత ఆపరేటింగ్ సిస్టం మనం చూడగలం.

Printfriendly

Related Posts Plugin for WordPress, Blogger...

ఈ బ్లాగు ప్రముఖ పోస్ట్‌లు