ఆండ్రాయిడ్ ఫోను రూట్ చేయబోయే ముందు ఆండ్రాయిడ్ ఫోను బాక్ అప్ తీసుకోవడం మంచిది. రూట్ చేసిన ఫోన్లకి మన డాటా తో పాటు పూర్తిగా ఆపరేటింగ్ సిస్టం బ్యాకప్ తీసుకోవడానికి వివిధ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ రూట్ చెయ్యని ఫోన్లకి మనం మన డాటా మాత్రమే అనగా మన ఫోన్ నంబర్లు, మెసేజిలు, అప్లికేషన్లు ఫొటో మరియు వీడియోలును బ్యాకప్ తీసుకోవచ్చు. రూట్ చెయ్యాలన్న ఆలోచన లేనప్పటికి మనం మన ఫోనులో ముఖ్యమైన సమాచారాన్ని బ్యాకప్ తీసుకుంటే ఫోన్ చెడిపోయినప్పుడు కాని, ఫొన్ కనిపించకుండా పోయినప్పుడు కాని, కొత్త ఫోను కొన్నప్పుడు కాని మనం తిరిగి మన సమాచారాన్ని తిరిగి పొందేందుకు వీలవుతుంది. ఎటువంటి పరిజ్ఞానం లేకపోయినా ఎవరైనా తమ ఫోనులో ఉన్న సమాచారాన్ని బ్యాకప్ తీసుకోవచ్చు, అవసరమైనప్పుడు తిరిగి వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోనులో ఉన్న మన సమాచారాన్ని బ్యాకప్ తీయడానికి గల వివిధ పధ్దతులు క్రింద ఇవ్వబడ్డాయి.
1) మన ఫోనుని గూగుల్ ఖాతాకి అనుసంధానించి ఉండి మనకి మొబైల్ కి నెట్ అందుబాటులో ఉంటే మనం క్రింది చిత్రంలో చూపించినట్లు బ్యాకప్ సెట్ట్ంగులని మార్చుకుంటే మన అప్లికేషన్ సెట్టింగులు, వైఫి పాస్ వర్డ్ లు, ఫొటోలు, ఫోన్ నంబర్లు అన్ని అటోమెటిక్ గా మన గూగుల్ అకౌంట్ లో బధ్రపరచబడతాయి. బ్యాకప్ తీయబడిన సమాచారం తిరిగి అటోమెటిక్ గా మన ఫొన్లోకి రిస్టోర్ చేసుకోవచ్చు. ఈ విధానంలో మెసేజిలు,వీడియోలు, సంగీతం మరియు అప్లికేషన్లు బధ్రపరచబడవు.
ఆండ్రాయిడ్ బ్యాకప్ సెట్టింగ్స్ |
2) గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, ఉబుంటు వన్, కాపీ వంటి వివిధ క్లౌడ్ సర్వీసులు కొంత స్టోరేజిని ఉచితంగా అందిస్తున్నాయి. ఆయా క్లయింట్లని ప్లే స్టోర్ ద్వారా ఇంస్టాల్ చేసుకొని వాటిలో మన సమాచారాన్ని నిల్వచేసుకోవచ్చు. వాటిలో ఉంచిన సమాచారం మనం ఎక్కడి నుండి అయిన వాడుకోవడానికి అవకాశం ఉంది. పై రెండు పధ్దతులలో మనకి నెట్ అవసరం ఉంటుంది.
3) నెట్ అవసరం లేకుండా మనం మన ఫొన్ నంబర్లు మరియు ఫొటోలు, వీడియోలు మరియు సంగీత ఫైళ్ళని మనం నేరుగా మన కంప్యూటరులోకి యు.యస్.బి కేబుల్ ద్వారా కాపీ చేసుకోవచ్చు. కావలసినప్పుడు తిరిగి ఫోన్లోకి కాపీ చేసుకొని వాడుకోవచ్చు. ఫోన్ నంబర్లను క్రింది చిత్రంలో వలె ఎక్స్ పోర్ట్ చేసుకుని ఒక ఫైల్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు. అపుడు .vfc ఫార్మాటులో మన కాంటాక్టులన్ని(ఫోన్ నంబర్లు, ఇ మెయిల్ ఐడిలు) బధ్రపరచబడతాయి. దానిని మనం యస్.డి. కార్డులో కానీ కంప్యూటర్లో గాని దాచుకొని కావలసినప్పుడు తిరిగి ఇంపోర్ట్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్లో ఫోన్ నంబర్లు దాచుకోవడం |
ఫోన్ నుండి ఉబుంటు 13.10 ఆపరేటింగ్ సిస్టం ఉన్న కంప్యూటర్లోకి నేరుగా ఫైళ్ళని కాపీ చేయడం |
4) మన ఫోన్లో ఉన్న అప్లికేషన్లని బ్యాకప్ తీసుకోవాలంటే ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ కావలిసిందే. ఆప్ బ్యాకప్ రిస్టోర్ అన్న అప్లికేషన్ని ఇక్కడ నుండి ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఆప్ ని ఉపయోగించి మనకి కావలసిన అప్లికేషన్లను ఒకే సారి యస్.డి. కార్డు లోకి బ్యాకప్ తీసుకోవచ్చు. తిరిగి మనకి కావలసిన అప్లికేషన్లను అన్నిటిని ఒకేసారి ఫోనులోకి రిస్టోర్ చెసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ అప్లికేషన్లని బ్యాకప్ తీసే ఆప్ బ్యాకప్& రిస్టోర్ |
5) చివరి అతి ముఖ్యమైనది మన మొబైల్ డాటా అనగా ఫోన్ నంబర్లు, మెసేజిలు, కాల్ లాగ్ మరియు క్యాలెండరు సమాచారాన్ని బ్యాకప్ తీయడం. ఈపనికి మొబైల్ బ్యాకప్ అనే అప్లికేషను మనకి ఉపయోగపడుతుంది. దీనిని మనం ఇక్కడ నుండి ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ని ఉపయోగించి ఫోన్ నంబర్లు, మెసేజిలు, కాల్ లాగ్ మరియు క్యాలెండరు సమాచారాన్ని యస్.డి. కార్డు లోకి బ్యాకప్ తీసుకొని తిరిగి కావలసినప్పుడు రిస్టోర్ చేసుకోవచ్చు.
ఫోన్ నంబర్లు, మెసేజిలు, కాల్ లాగ్ మరియు క్యాలెండరు సమాచారాన్ని బ్యాకప్ తీసే మొబైల్ బ్యాకప్ |