విజ్ఞానపు గని వాడుకున్నోడికి వాడుకున్నంత!

 విజ్ఞానం అనేది ఎవరికో సొంతం కాదు అది అందరికి అందుబాటులో ఉండాలని ఒకరిచే మొదలైన ఆ సంకల్పం ఇప్పుడు ప్రపంచంలో అన్ని దిక్కులకు విస్తరించినది. దాని ఫలాలు ఇప్పుడు ప్రతి ఒక్కరు అను నిత్యం ఏప్పుడో ఒకప్పుడు అనుభవిస్తూనే ఉన్నాము. అదే వికిపీడియా. ఏదైనా విషయం గురించి సమాచారం కావాలంటే వికిపీడియా లో వెతుకు అని సాదారణంగా వింటుంటాం,అంటుంటాం. వికీపీడియా అంటే అంతర్జాల విజ్ఞానభాండాగారం. పలువురు కలిసి విజ్ఞాన సమాచారాన్ని సేకరించి అంతర్జాలంలో ఒకచోట భద్రపరచడం. ఈవిధంగా భద్రపరచినదానిని అందరికీ ఉచితంగా వాడుకోవడమే. విషయసేకరణ మరియు అది అందరికీ అందుబాటులో ఉంచడం అనే ప్రక్రియను నిరంతరంగా ప్రవహింపచేయడమే వికీపీడియా లక్ష్యం. ఈ ప్రక్రియను మొదలు పెట్టిన ఘనత జిమ్మీ వేల్స్ అనే అమెరికన్ కు చెందుతుంది. చిన్న చినుకులు కలిసి ఒక మహ సముద్రంగా మారినట్లు ఇప్పుడు వికిపీడియా అనేక ప్రపంచ బాషలలో అనేక వ్యాసాలతో అందుబాటులో ఉంది. సాధారణ వ్యక్తులు కూడా వికీపీడియాలో వ్యాసాలను రాయగలగడంతోబాటు ఇతరులు రాసిన వ్యాసాలలో అక్షర దోషాలను సరిదిద్దడం, అదనపు సమాచారాన్ని జోడించడం మరియు వాణిజ్య ప్రకటనలు లేకపోవడం వంటి అంశాలు దీన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.
 ఆంగ్లవికీ ప్రారంభమైన రెండేళ్ళ అనంతరం మొదలైన తెలుగు వికీపీడియా ఆరంభంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ క్రమక్రమంగా వేగం పుంజుకుంది. భారతీయ భాషలలో తెలుగుభాష ఔన్నత్యాన్నీ, ప్రత్యేకతనూ చాటిచెబుతోంది. దీని వెనుక తెలుగు బ్లాగరులు మరియు మనలాంటి సామాన్యుల కృషి కూడా ఉంది. వికీపీడియా తెలుగులో ఉందన్న విషయాన్ని అందరికి తెలియచెప్పడం, మరియు తెలుగు వికీపీడియాకి ప్రచారం కల్పించడం కోసం ఈ ఉగాది సందర్భాన్ని పురష్కరించుకొని తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 ఏర్పాటుచేసారు. 
 రేపటి తరానికి ఖచ్చితమైన సమాచారాన్ని ఉచితంగా అందివ్వాలన్న సదుద్దేశ్యంతో నిస్వార్ధంగా కృషి చేస్తున్న  తెలుగు వికీపీడియాని తెలుగు వారందరికి చేరువ చెయవలసిన బాద్యత మనందరిది. రండి బ్లాగు బ్లాగు  కలిపి ప్రచారాన్ని చేద్దాం. సామాజిక అనుసంధాన వేదికలైన ఫేస్ బుక్ ,ట్విట్టర్ మరియు గూగుల్ + లలో కూడా పంచుకోవడం ద్వారా తెలుగు వికీపీడియాని అందరికి చేరువ చేయవచ్చు. దయచేసి విజ్ఞాన ప్రవాహాన్ని ఆపవద్దు.