వేగవంతమైన రేపటితరం ఫైల్ సిస్టం

సాధారణంగా మనం పెన్‌డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్ ఫార్మాటు చేసినపుడు ఆ డిస్కు యొక్క పూర్తి సామర్ధ్యం మనం వాడుకోవడానికి అందుబాటులో ఉండదు. ఉధాహరణకు మనం 8జిబి డిస్క్‌ని ఫార్మాటు చేస్తే మనకి 7.6 జిబి సుమారుగా అందుబాటులో ఉంటుంది. డిస్క్‌లో మిగిలిన స్థలం ఫైల్ సిస్టం వాడుకుంటుంది. మనకి వివిధ రకాల ఫైల్
సిస్టంలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో విండోస్ వాడేవారికి పరిచయమైనవి FAT, NTFS అలాగే లినక్స్ ఆపరేటింగ్ సిస్టం వాడేవారికి తెలిసినవి EXT3 మరియు EXT4. అయితే సాధారణంగా మనం వీటి గురించి అంతగా పట్టించుకోము. అయితే డాటా స్టోరేజిలో వినూత్నమైన మార్పులు తీసుకురాబోతున్న ఈ ఆధునిక ఫైల్‌సిస్టం గురించి తప్పక తెలుసుకోవలసిందే. ఫేస్‌బుక్,ప్యూజిట్సు, ఇన్‌టెల్, నెట్‌గేర్, ఒరాకల్, రెడ్‌హాట్, నోవెల్ మరియు లినక్స్ ఫౌండేషన్ వంటి ప్రముఖ సంస్థలచే ఒపెన్ సోర్స్ విధానంలో అబివృద్ది చేయబడుతున్న ఈ ఫైల్‌సిస్టం పేరే Btrfs(బి-ట్రి ఫైల్ సిస్టం). ఇప్పుడున్న ఫైల్‌సిస్టంలతో పోల్చితే అన్ని అంశాలలో భారీ మెరుగుదలతో వస్తున్న ఈ ఫైల్ సిస్టం సాధారణ వినియోగదారుడి నుండి పెద్దపెద్ద సంస్థలకు ఎంతో ఉపయోగపడదనడంలో సందేహమే లేదు. ఈ ఫైల్ సిస్టం యొక్క ముఖ్య విశిష్టతలు కొన్ని చూద్దాం.
  • మనం వాడుతుండగానే పార్టీషియన్ పరిమాణాన్ని మార్చుకోగలగడం.
  • మన దగ్గర ఉన్న అన్ని హార్డ్‌డిస్కులను కలిపి ఒకే పార్టీషియనుగా మార్చుకోగలగడం.
  • మనం వాడుతుండగానే మనకు కావలసినపుడు మరొక హార్డ్‌డిస్కును పార్టీషియనుకు జతచేసుకోవడం లేదా ఉన్న డిస్కును తీసివేయడం చేయవచ్చు. 
  • ఈ ఫైల్ సిస్టంలో మనం ఒక ఫైల్‌ని మార్పులు చేసినపుడు ఆ ఫైలు పూర్తిగా కొత్త వెర్షనులో దాయబడకుండా, మార్పులుచేసిన భాగం మాత్రమే వేరుగా దాయబడి మిగిలిన భాగం ఆ ఫైల్ యొక్క పాత వెర్షనునే వాడుకుంటుంది. అందువలన హార్డ్‌డిస్కు స్థలం పొదుపుగా వాడబడుతుంది.
  • మనం ఫైళ్ళను కాపీ చేస్తున్నపుడే ఆ ఫైల్ అటోమెటిక్‌గా స్నాప్‌షాట్ తీయబడుతుంది. మనం సిస్టం బ్యాకప్‌తీయాలనుకున్నపుడు మరలా ఫైల్స్ అన్ని కాపీచేయబడకుండా ముందుగా తీసిన స్నాప్‌షాట్నే వాడుకుంటుంది. దాని వలన బ్యాకప్ వేగంగా అయిపోవడమే కాకుండా డిస్క్‌లో స్థలం వృధా కాకుండా ఉంటుంది.
  • డాటా ఆటోమెటిక్‌గా వేగంగా కంప్రెస్ చేయబడుతుంది.
  • ఆటోమెటిగ్గా డిప్రాగ్మెంట్ చేసుకుంటుంది.
  • ఆటోమెటిగ్గా ఫైల్‌సిస్టం సరి చేసుకుంటుంది. 
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి. 
       లినక్స్ ఆపరేటింగ్ సిస్టం వాడేవారు ఆపరేటింగ్ సిస్టం ఇంస్టాల్ చేసుకునే సమయంలో పార్టీషియను చేసుకునేటప్పుడు క్రింది చిత్రంలో వలే Btrfs ఫైల్‌సిస్టం ఎంచుకోవడం ద్వారా ఈ ఆధునిక ఫైల్‌ సిస్టంను వాడుకోవచ్చు.