తక్కువ ధరలో గూగుల్ ఫోన్లు రాబోతున్నాయి

స్మార్ట్‌ఫోన్ అనేది ఒకప్పుడు ఖరీదైన ధనికవర్గాలకి మాత్రమే అందుబాటులో ఉండే వస్తువు. ఆండ్రాయిడ్ రాకతో మధ్య తరగతివారికి కూడా చేరువకాగలిగింది. దానికి పలురకాల కారణాలున్నప్పటికి ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ కావడం దానివలన పలు చిన్న కంపెనీలు కూడా తక్కువ ధరలో ఆండ్రాయిడ్ ఆధారిత పరికరాలను తయారుచేసి చవక ధరల్లో అందుబాటులో
ఉంచడం కూడా ఒక ముఖ్య కారణమే. అయితే ఈ చవక పరికరాల్లో నాణ్యత పెద్ద సమస్యగా ఉంటు వస్తుంది. దీనికి కారణం దీనిపై గూగుల్ నియంత్రణ లేకపోవడం మరియు చిన్న కంపెనీలకు ఉన్న పరిమిత వనరులు కావచ్చు. అయితే ఇప్పుడు గూగుల్ ఈ సమస్య పరిష్కారం దిశగా తన పని మొదలుపెట్టింది. అయితే మనకేంటి లాభం అనుకుంటున్నారా చవగ్గా నాణ్యత గల పరికరాలు అందుబాటులోకి వస్తాయి.
గూగుల్ చేపట్టిన ఈ కార్యక్రమం పేరు ఆండ్రాయిడ్ వన్. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 100 డాలర్లలో నాణ్యమైన, అన్ని అవసరాలను తీర్చగల, సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఫోన్‌లను అబివృద్ది చెందుతున్న దేశాలలో అందుబాటులోకి తేవడం. ఈ ఫోన్‌లను తయారుచేయడానికి దిగువ శ్రేణి ఫోన్ తయారీదారులకు కావలసిన సాంకేతికపరమైన మద్దతును గూగుల్ అందించడంతో పాటు సాఫ్ట్‌వేర్, హర్డ్‌వేర్ నాణ్యతను పర్యవేక్షించడం చేస్తుంది. ఈ కార్యక్రమంలో తొలి అడుగుగా దిగువ శ్రేణి ఫోన్‌లు అమ్ముడుకావడానికి విసృత అవకాశం ఉన్న భారతదేశంలో మూడు దేశియ ఫోన్‌ తయారీదారులతో (కార్బన్, స్పైస్, మైక్రోమాక్స్) జట్టు కట్టింది. సాంసంగ్, యల్ జి, మోటో వంటి బహుళజాతియ మరియు చైనా దాడులకు కుదేలయిన దేశియ కంపెనీలకు ఈ చర్య భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు.

ఆండ్రాయిడ్ వన్ ఏర్పాటు చేయడానికి గూగుల్‌కి ప్రేరణ భారతదేశంలో మోటో ఇ మరియు జి చేసిన సందడే కావచ్చు. చవక ధరలో నాణ్యత కలిగిన ఫోన్‌లను అందిస్తే జనాధరణ పొందడం పెద్ద కష్టమేమి కాదు అని ఈ ఫోన్‌లు నిరూపించడమే కాకుండా దిగువ శ్రేణి ఫోన్ మార్కెట్ లో భారత్‌లో ఉన్న అవకాశాలను కూడా చాటింది.
ఇక ఫోన్ విషయాని కొస్తే డ్యూయల్ సిమ్‌, 4.5 ఇంచుల తెర, ఎఫ్‌యం రేడియో, యస్‌డి కార్డు స్లాట్ తో వంద డాలర్లలోపు ధరతో ఈ ఫోన్ ఉంటుందని గూగుల్ ప్రకటించింది. నెక్సస్ ఫోన్‌ల మాదిరిగానే ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లు కూడా తాజా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం రావడంతో పాటు కొత్త వెర్షన్‌కు అప్‌డేట్స్ కూడా అందించబడతాయంట.