రాష్ట్ర విభజన - యక్స్‌పి సపోర్ట్ నిలిపివేత

 యక్స్‌పి సపోర్ట్ నిలిపివేయబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ సుమారు రెండు సంవత్సరాల క్రితమే ప్రకటించింది. దానికి అనుగుణంగా అప్పటి నుండి ప్రజలను ప్రత్యామ్నాయాల వైపు మళ్ళించడానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తూనే ఉంది. ఇప్పటికే చాలా సంస్థలు, ప్రజలు ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు. అయినప్పటికి ఇప్పటికి చాలా మంది యక్స్‌పిని వాడుతున్నారు. వారిలో సాధారణ ప్రజలే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. వారు ఆదిశగా చర్యలను తీసుకుంటున్నట్లు ఏ పత్రికలోను రాలేదు. బహుషా వారు ఇప్పటికే యక్స్‌పి తరువాతి వెర్షన్‌లతో వచ్చే కంప్యూటర్లను కొనడానికి గుత్తేదారులను సిద్దం చేసుకొనే ఉండవచ్చు. టెండర్ల రూపం లో ప్రజాధనాన్ని అయినవారికి దోచిపెట్టే పందేరం మొదలైపోయి ఉండొచ్చు. మన ప్రక్క రాష్ట్రం తమిళనాడు విషయానికొస్తే ఆ ప్రభుత్వం యక్స్‌పి సపోర్ట్ నిలిచిపోతున్న సందర్భంగా వివిధ శాఖలను ఉచితంగా లభించే ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్టం లను వాడమని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.
 ఇక మన రాష్ట్రాని కొస్తే రాష్ట్ర విభజన నేపధ్యంలో యక్స్‌పి సపోర్ట్ నిలిచిపోవడం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లే ముఖ్యంగా నిర్మాణం కావలసిన సీమాంధ్ర ప్రాంతం. మనం ఇక్కడ సరిగా ఆలోచిస్తే విభజన నేపధ్యంలో అన్ని శాఖలు పునర్‌వ్యవస్థికరణ జరగనుండడం, యక్స్‌పి సపోర్ట్ నిలిపివేయడం ఒకేసారి రావడం వలన మన రాష్ట్రాలకి మంచి అవకాశం వచ్చినట్లే. ఇప్పుడు ఉన్న కంప్యూటర్లలో యక్స్‌పికి బదులుగా మరో ఆపరేటింగ్ సిస్టంను కొనుగోలు చేయడం, తక్కువ సామర్ధ్యం గల కంప్యూటర్లని తొలగించి వాటి స్థానంలో ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న కొత్త కంప్యూటర్లను కొనుగోలు చేయడం వంటి ఖరీదైన ప్రయామ్నాయాలతో పాటు ఉన్న కంప్యూటర్లలోనే ఉచితంగా లభించే ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలు మరియు సాఫ్ట్‌వేర్లను వాడుకోవడం వంటి ఉచిత ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉంది. విభజన నేపధ్యంలో నిధుల కొరత రెండు ప్రాంతాలలోను తప్పదు. మన ప్రభుత్వం ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్లను వాడుకలోకి తీసుకువచ్చి విలువైన ప్రజాధనాన్ని ఆధా చేసినచో ఆ నిధులను నిర్మాణ,పునర్‌నిర్మాణ పనులకి కేటాయించుకోవచ్చు. 
 ప్రభుత్వానికి మంచి అవకాశం ఉన్నట్లే ఇప్పుడు ప్రజలకి కూడా ఎన్నికల రూపంలో మంచి అవకాశం వచ్చింది. ప్రజాధనాన్ని స్వాహా చేసే నాయకులను కాకుండా ప్రజాధనాన్ని కాపు కాసే నేతలను ఎన్నుకోవలసిన అవసరం ఉంది. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కనుక ఆలోచించి మానసిక, భౌతిక ప్రలోభాలకు గురి కాకుండా సరైన నిర్ణయం తీసుకోవాలి.