ఆండ్రాయిడ్ రూట్ చేయడం అంటే ఏమిటి? రూట్ చేయడం వలన లాభాలు, నష్టాలు

ఆండ్రాయిడ్ రూట్ చేయడం అంటే ఏమిటి? 

 

  మన కంప్యూటర్లో ఏవిధంగా అయితే అడ్మినిస్ట్రేటర్ మరియు గెస్ట్ అకౌంట్ లు ఉంటాయో అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఉంటాయి. మనకి ఫోన్ తయారీదారుడు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ని లాక్ చేసి గెస్ట్ అకౌంట్ అనుమతి మాత్రమే ఇస్తాడు. అంటే మనం మన ఫోన్ లో గెస్ట్ అకౌంట్ లోకి మాత్రమే వెళ్ళగలం అన్నమాట. లినక్స్ ఆపరేటింగ్ సిస్టం లో అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ని రూట్ అకౌంట్ అని అంటారు. సిస్టం అడ్మినిస్ట్రేటర్ పనులు చేయాలంటే మనం రూట్ అకౌంట్ కి లాగిన్ కావాల్సిందే. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కూడా లినక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టం కావడం వలన ఆండ్రాయిడ్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ని రూట్ అకౌంట్ అని అంటారు. రూట్ అకౌంట్ లోకి ప్రవేశించేటట్లు మన ఫోన్ ని చేయడమే రూటింగ్. రూటింగ్ చేయడం వలన ఆపరేటింగ్ సిస్టం ఫైళ్ళను కూడా మనం మార్చవచ్చు.

రూట్ చేయడం వలన లాభాలు:

 

  • అప్లికేషన్లలో మరియు వెబ్ బ్రౌజర్ లో యాడ్స్ రాకుండా చేయ్యవచ్చు.
  • తెలుగు మరియు మనకు నచ్చిన ఫాంట్లను ఇన్ స్టాల్ చేయవచ్చు.
  • ఫోన్ ప్రాసెసర్ వేగం పెంచడం, బ్యాటరీ పనితీరు మెరుగుపరచడం చేయవచ్చు.
  • ఫోన్ కొన్నఫుడు వచ్చిన థీం మరియు అప్లికేషన్లని తొలగించవచ్చు.
  • రూట్ ఫోన్లలో మాత్రమే పని చేసే అప్లికేషన్లని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
  • అప్ డేట్లు లేని ఫోన్లకి తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ రాం ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
  • మనకి నచ్చిన కస్టం రాం ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
  • మనకి నచ్చిన ఐకాన్లని థీం లని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
  • మన ఫోన్ లేదా టాబ్లెట్ ని పూర్తిగా మన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు.
  • ఫోన్ ఇంటర్నల్ మెమోరీ తక్కువ గా ఉన్నపుడు డీఫాల్ట్ ఆప్స్ కూడా యస్ డి కార్డ్ లోకి మార్చుకోవచ్చు.
  • పెన్ డ్రైవ్ ను ఫోన్ నుండి వాడుకోవచ్చు.

రూట్ చేయడం వలన నష్టాలు:

 

  • రూట్ చేయడం వలన వారెంటీ వర్తించదు. కనుక వారెంటీ గడువు అయిపోయిన తరువాత రూట్ చేసుకోవడం మంచిది.
  • రూట్ చేసేటప్పుడు మన డాటా కోల్పోవచ్చు కనుక డాటా అనగా ఫోన్ నంబర్లు, మెసేజ్ లు అన్ని బాక్ అప్ తీసుకోవాలి.
  • రూట్ చేసేటప్పుడు పొరపాటు జరిగితే ఫోన్ మొత్తానికి పని చేయక పోవచ్చు. కనుక పూర్తిగా తెలిసి ఉంటేనే రూట్ చేయడం ఉత్తమం.