అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి కృషి చేస్తున్న

 తెలుగుని కంప్యూటర్లో చూడవచ్చు, వ్రాయవచ్చని, తెలుగులో జాలాన్ని అన్వేషించవచ్చునని అందరికి తెలియజేయడానికి, రోజువారీ సంభాషణలని తెలుగులో జరుపుకోవడాన్ని ప్రోత్సహించడానికి, తెలుగులో అందుబాటులో ఉన్న అంతర్జాల సేవలను అందరికి తెలియజేయడానికి, సాఫ్ట్వేర్ల తెలుగీకరణని ప్రోత్సహించడానికి ఏర్పడిన సంస్థ e-తెలుగు. తెలుగువారందరూ తమ అవసరాలకి కంప్యూటర్లనూ, మెబైళ్ళనూ, అంతర్జాలాన్నీ తెలుగులో వాడుకోగలగాలనే స్వప్నంతో ఆ దిశగా కృషిచేస్తున్న లాభాపేక్షలేని సంస్థ e-తెలుగు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద నమోదయిన ఈ సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైటు www.etelugu.org
  అంతర్జాలంలో బ్లాగులు, గుంపులు వంటి వివిధ వేదికల ద్వారా తెలుగు బ్లాగరులు నిత్యమూ కలుసుకుంటూండేవారు. ముఖాముఖి కూడా కలిస్తే బాగుంటుందని ఆలోచించి 2006 మార్చి 12 న మొదటి సారి హైదరాబాదులో సమావేశమయ్యారు. అప్పటినుండి, ప్రతీనెలా రెండవ ఆదివారం నాడు హైదరాబాదు తెలుగు బ్లాగరులు, వికీపీడియనులు సమావేశమౌతూ వస్తున్నారు. ఈ సమావేశాలలో తెలుగు బ్లాగుల గురించిన సాధకబాధకాల గురించీ వికీపీడియా పురోగతి గురించీ చర్చించేవారు. తెలుగువారికి వీటిని గురించి తెలియజెయ్యడానికి ఏమేం చెయ్యాలి అన్న విషయాల గురించి కూడా చర్చిస్తూ ఉండేవారు. ముందుగా అతి తక్కువ శ్రమతో కంప్యూటరులో తెలుగు కనిపించేలా చేసుకోవచ్చనీ, ఇంగ్లీషులోలానే తెలుగులోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవచ్చనీ, తెలుగువారికి తెలియజెయ్యాల్సిన అవసరం ఉందని గ్రహించారు. ఈ అంశాలను ప్రచారం చేసి, మరింతమంది ఔత్సాహికులను చేర్చుకొంటే, మరిన్ని పనులను, మరింత త్వరగా చేయగలమని భావించారు.  ఈ కార్యక్రమాలన్నిటినీ ఒక గొడుగు కిందకు చేర్చి, ఒక లాభాపేక్ష లేని సంస్థ ఆధ్వర్యంలో చేస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చని భావించి e-తెలుగుని ఏర్పాటుచేసారు.
 e-తెలుగు కంప్యూటరులో తెలుగును స్థాపించుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తుంది. ఇందుకవసరమైన సాఫ్టువేరు ఉపకరణాలను కూడా తయారుచేసి ఉచితంగా అందిస్తుంది. తెలుగులో టైపు చేసేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. లిప్యంతరీకరణకు అవసరమైఅన ఉపకరణాల గురించి ప్రచారం చేస్తుంది. ఇప్పటికే వివిధ కీబోర్డు లేఔట్లను వాడి తెలుగులో టైపు చేస్తున్నవారికి అవే లేఔట్లను వాడి యూనికోడులో కూడా టైపు చేసేందుకు అవసరమైన సాఫ్టువేరు ఉపకరణాలను తయారుచేసి, ఉచితంగా అందుబాటులో ఉంచింది. ఈ విషయమై ప్రచారమూ చేస్తోంది. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికై చేసే కృషిలో భాగంగా బ్లాగులను, వికీపీడియాను, వెబ్ పత్రికలను, ఇతర తెలుగు వెబ్‌సైట్లను తెలుగువారికి పరిచయం చేస్తోంది. వివిధ సాఫ్టువేరు ఉపకరణాల స్థానికీకరణ గురించి తెలియని వారికి తెలియజేస్తూ, తెలిసిన వారికి వాటికి సంబంధించిన విషయాలలో సాంకేతిక సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తోంది.